వణుకుతున్న గుంటూరు ప్రజలు | Guntur People Fear With Diarrhea | Sakshi
Sakshi News home page

వణుకుతున్న గుంటూరు ప్రజలు

Published Tue, Mar 20 2018 7:50 AM | Last Updated on Fri, Sep 28 2018 3:39 PM

Guntur People Fear With Diarrhea - Sakshi

జీజీహెచ్‌లో సోమవారం డయేరియాతో చికిత్స పొందుతున్న బాధితులు

గుంటూరు మెడికల్‌: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో డయేరియాతో చికిత్స పొందుతున్న ఆలీనగర్‌ మూడవ లైన్‌ ప్రియంక గార్డెన్‌ ప్రాంతానికి చెందిన షేక్‌ ఇస్మాయేల్‌(52) సోమవారం మృతి చెందాడు. దీంతో డయేరియా మరణాలు 20కి చేరకున్నాయని ఇంటెలిజెన్స్‌ అధికారులు తెలిపారు. జీజీహెచ్‌ అధికారులు అధికారికంగా ఎనిమిది డయేరియా మరణాలుగా, మరో ఎనిమిది అనుమానిత మరణాలుగా తెలిపారు. మృతుల కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం  మరణాలు 24 ఉన్నాయి. గుంటూరు రమేష్‌ హాస్పటల్‌లో బాధితులు 13 మంది సోమవారం నాటికి చికిత్స పొందుతున్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండి వెంటిలేటర్‌పై ఉన్నారు. కిడ్నీ సమస్య తలెత్తి  ఒకరు డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో 40 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

డయేరియా పేరు చెబితే హడల్‌
గుంటూరు తూర్పులో  ఈనెల 3న మూడు ప్రాంతాల్లో ప్రారంభమైన డయేరియా నేడు నగరం అంతా విస్తరించటంతో ప్రజలు హడలిపోతున్నారు. కార్పొరేషన్‌ కుళాయి నీరు, మినరల్‌ వాటర్‌ ప్లాంట్స్‌ నీరు సైతం కలుషితం అయినట్లు నిర్ధారణ జరిగింది. దీంతో మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ నుంచి తెచ్చుకున్న నీరు సైతం తాగాలన్నా భయపడిపోతున్నారు.  

అదుపులోకి రాని వాంతులు, విరోచనాలు
రెండు వారాలు దాటినా డయేరియా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. స్థానిక ఆనంద్‌పేట మూడోలైన్‌కు చెందిన షేక్‌ అల్లాబక్షు రెండు రోజులుగా వాంతులు, విరోచనాలతో బాధపడుతూ సోమవారం చికిత్స కోసం జీజీహెచ్‌కు వచ్చాడు. వారం రోజుల కిందట అల్లుడు ఇర్ఫాన్‌ కూడా డయేరియా బారిన పడి చికిత్స పొందినట్లు ఆయన తెలిపారు. వట్టిచెరుకూరు మండలం అనంతరవరప్పాడు గ్రామానికి చెందిన ముదిగంట పార్వతి, వినుకొండకు చెందిన యోహాను, బారాఇమామ్‌పంజా సెంటర్‌కు చెందిన ఇబ్సమ్, పాత గుంటూరుకు చెందిన పొట్లూరి నాగరాజుతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన 15 మంది సోమవారం డయేరియాతో బాధపడుతూ జీజీహెచ్‌లో చేరారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement