
మేమున్నామనీ.. మీకేం కాదనీ!
సేవ.. ఆధ్యాత్మికం.. ఆరోగ్యమే లక్ష్యంగా మణికంఠ సత్సంగ్ సొసైటీ ముందుకు సాగుతోంది. మనిషిలో దాగి ఉన్న మానవత్వ విలువలను పంచుకునే వేదికగా సొసైటీని తీర్చిదిద్దడంలో వ్యవస్థాపకులు సఫలమయ్యారు. సేవా భావంతో ముందుకొచ్చే కొత్త సభ్యులను కలుపుకుంటూ తమ సేవలను విస్తృత పరుస్తున్నారు. అనాథలు, అభాగ్యులకు అండగా మేమున్నామంటూ భరోసా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
- సేవా, ఆధ్యాత్మిక స్ఫూర్తి ప్రదాత మణికంఠ సత్సంగ్ సొసైటీ
- మానవత్వ విలువలు పంచుకునే వేదికగా తీర్చిదిద్దుతున్న వ్యవస్థాపకులు
- అనాథలు, అభాగ్యులను అక్కున చేర్చుకోవడమే ధ్యేయంగా సేవలు విస్తృతం
- అనంతవరం రోడ్డులో రూ.కోటితో ముగిసిన మొదటి దశ భవన నిర్మాణ పనులు
- దసరా రోజు వృద్ధాశ్రమం ప్రారంభానికి ఏర్పాట్లు పూర్తి : అబ్బూరి వరప్రసాద్
టంగుటూరు : మండల కేంద్రం టంగుటూరుకు చెందిన అబ్బూరి వరప్రసాద్ సామాన్య అయ్యప్ప భక్తుడు. అతడి సంకల్పమే నేటి మణికంఠ సత్సంగ్ సొసైటీ. ప్రతి ఒక్కరికీ ఆధ్యాత్మిక స్ఫూర్తి కలిగించి, వారిలో మానవత్వాన్ని మేల్కొలిపి తద్వారా సమాజ సేవ చేయించాలన్నది వరప్రసాద్ ఆలోచన. ప్రసాద్ తన ఆలోచనను మిత్రుడు, ఎస్‌బీహెచ్‌లో ఉన్నత ఉద్యోగి పెరవలి నాగరవికాంత్‌తో పంచుకున్నారు. ఆయన ఆలోచనలోని మానవీయ విలువలకు అండగా ఉంటానని రవికాంత్ ముందుకొచ్చారు. సమాజ సేవలో తాము సైతం..అంటూ మరికొంతమంది చేయి కలిపారు. వ్యస్థాపకుల్లో అత్యధికులు అయ్యప్ప భక్తులు కావడంతో 2009లో కార్తీకపౌర్ణమి రోజు మణికంఠ సత్సంగ్ సొసైటీని స్థాపించారు. అప్పటి నుంచి ఆధ్యాత్మిక, ఆరోగ్య, విద్యా సేవలో సొసైటీ తమ వంతు బాధ్యత నిర్వర్తిస్తోంది. నేడు ఎలాంటి ఆదరణ లేని వృద్ధులకు ఆశ్రయం ఇచ్చే స్థాయికి ఎదిగింది.
ఏడాదిలో రెండు సార్లు మెగా రక్తదాన శిబిరాలు
సొసైటీ ఆరో ఏట అడుగిడిన నాటి నుంచి ఏడాదికి రెండు సార్లు మెగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తోంది. ఇప్పటి వరకూ సుమారు 500 మంది యువకుల నుంచి 750 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఆ రక్తం ఎంతో మంది ప్రాణాలు నిలబెట్టగలిగింది. సొసైటీ వ్యవస్థాపకులు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకూ సాయపడ్డారు. విద్యార్థులకు ఉచితంగా ప్లేట్లు,గ్లాసులు పంపిణీ చేశారు. విద్యా సేవలను మరింత విస్తృత పరిచేందుకు సంసిద్ధులవుతున్నారు.
అన్నదానంలో మేటి : ఏటా కార్తీక పౌర్ణమిలో అయ్యప్ప జన్మనక్షత్రమైన ఉత్తరానక్షత్రం రోజు అన్నదానం చేస్తారు. టంగుటూరు అయ్యప్ప గుడిలో కార్తీకపౌర్ణమి నుంచి సంక్రాంతికి వారం ముందు వరకు దాతల సహకారంతో అయ్యప్ప భక్తులకు అన్నదానం చేస్తూనే ఉంటారు. ఈ కార్యక్రమానికి సొసైటీ తన సంపూర్ణ సహకారం అందిస్తోంది.
రూ.4 కోట్లతో 60 గదుల నిర్మాణమే లక్ష్యం
మణికంఠ సొసైటీ తన సేవలను మరింత విస్తృత పరుస్తోంది. ఇప్పటికే వృద్ధాశ్రమాన్ని నిర్మించింది. ఇందుకు వ్యవస్థాపకులు టంగుటూరుకు సమీపంలో అనంతవరం రోడ్డులో 1.10 ఎకరాల భూమి సేకరించారు. నిర్మాణ పనులను 2013 ఫిబ్రవరిలో చిన్న వెంకయ్యస్వామి చేతుల మీదుగా ప్రారంభించారు. 100 మంది వృద్ధులకు ఉచితంగా ఆశ్రయం కల్పించేందుకు వీలుగా, అలాగే 20 మంది అనాథ పిల్లలకు ఆశ్రయంతో పాటు చదువు చెప్పేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 5 ఫోర్లలో 60 గదులు నిర్మిస్తున్నారు. ఇందుకు సుమారు రూ.4 కోట్లు ఖర్చు అవుతుందని భావిస్తున్నారు. ముందుగా రూ.కోటి వెచ్చించి గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. వచ్చే నెల 22వ తేదీ దసరా రోజు ఆశ్రమం ప్రారంభిస్తున్నట్లు వరప్రసాద్ చెప్పారు.