
తెలుగు తమ్ముళ్ల డిష్యుం..డిష్యుం!
► నాయకుల ఎదుటే ఇరువర్గాల బాహాబాహీ
టంగుటూరు (కొండపి) : టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టంగుటూరు తెలుగుదేశం పార్టీకి చెందిన ఇరువర్గాల నేతలు ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి సాక్షిగా బుధవారం తన్నుకున్నారు. తన ఎదుటే పార్టీకి చెందిన ఇరువర్గాలు కొట్టుకోవడంతో ఎమ్మెల్యే హతాశుడయ్యారు.
ఇదీ.. జరిగింది: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని స్థానిక బొమ్మల సెంటర్ కూడలిలో ఆ పార్టీ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు స్థానిక శాసన సభ్యుడు డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమస్యలు ఏవైనా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే కోరారు. స్థానిక రాజీవ్ నగర్‌కు చెందిన టీడీపీ నేత రాచపూడి రాము లేచి రాజీవ్ నగర్ సమస్య అలాగే పెండింగ్‌లో ఉందని, సమస్యను పరిష్కరించకుండా ఏళ్లతరబడి మాటలతో సరిపెడుతున్నారంటూ ఎమ్మెల్యేను ఉద్దేశించి అసహనంగా అన్నాడు. అక్కడే ఉన్న సర్పంచి వర్గీయులు తీవ్ర ఆగ్రహంతో రాముపైకి దూకారు. కె.శ్రీను, వెంకట్రావ్ అనే కార్యకర్తలు దాడి చేయడంతో రాము కిందపడ్డాడు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఉన్నా ఎవరూ వారిని వారించకపోవడం గమనార్హం. బిత్తరపోయిన ఎమ్మెల్యే స్వామి ఎందుకొచ్చిన తంటా..అని అక్కడి నుంచి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి ఇరువర్గాలనూ నిలువరించారు. ఈ విషయమై ఇరువర్గాలు పోలీసుస్టేషన్‌లో కేసులు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావును వివరణ కోరగా ఇరువర్గాలు ఫిర్యాదులు చేయలేదని చెప్పారు.