
మొబైల్ రంగంలో ఎప్పటికప్పుడు అత్యాధునిక సాంకేతిక సేవలు అందుబాటులోకి వచ్చినా... బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌ఫోన్లకున్న ఆదరణ మాత్రం కొనసాగుతూనే ఉంది. అయితే ల్యాండ్‌లైన్ వినియోగదారులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే పట్టించుకునే నాథుడే కరువయ్యారు. మరమ్మతులకు గురైతే వినియోగదారులకు ఇక నరకమే. ఆయా ప్రాంతాల్లోని టెలికం మెకానిక్‌లు, ఇంజినీర్లకు పదేపదే ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో ల్యాండ్ ఫోన్‌లు పాడైతే వినియోగదారుడు ఎదుర్కొంటున్న అవస్థలు వర్ణనాతీతం.
తిరుపతి అర్బన్: జిల్లా వ్యాప్తంగా 43,976 ల్యాండ్‌ఫోన్ కనెక్షన్క్షుడగా వాటిలో సుమారు 25 శాతం వరకు ఫోన్‌లు సక్రమంగా పని చేయకపోవడం, కేబుల్ సమస్యలు రావడంతో వినియోగదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తిరుపతిలాంటి నగరంలో బీఎస్‌ఎన్‌ఎల్ జిల్లా ప్రధాన కార్యాలయం, సంస్థ ఉన్నతాధికారులంతా కొలువై ఉన్నప్పటికీ ల్యాండ్‌ఫోన్ సమస్యలు ఎదురైతే దిక్కుమొక్కూ ఉండడం లేదు. దీంతోపాటు చిత్తూరు, పలమనేరు, మదనపల్లె, పీలేరు, శ్రీకాళహస్తి వంటి ముఖ్యమైన పట్టణాల్లో సైతం ల్యాండ్‌ఫోన్ సమస్యలపై ప్రతి వారం ఫిర్యాదులు ఉన్నతాధికారులకు వస్తూనే ఉన్నాయి. అయినా గానీ ఫిర్యాదులపై సకాలంలో స్పందించి పరిష్కరించే కిందిస్థాయి జేటీఓ, జేఈ, డీఈల పనితీరు పూర్తిగా పడకేసింది.
పరికరం పాడైతే...
ఐదు సంవత్సరాల క్రితం వరకు బీఎస్‌ఎన్‌ఎల్ ల్యాండ్‌ఫోన్లు మరమ్మతులకు గురైనా, ఏదైనా సాంకేతిక సమస్యలతో పాడైనా ఫోన్ కిట్(పరికరం) రీప్లేస్ చేసే సౌకర్యాన్ని పూర్తిగా సంస్థ పరి«ధిలోనే నిర్వహించేవారు. అయితే సంస్థ ఆధ్వర్యంలో కొత్త ఫోన్ పరికరాలు ఉత్పత్తి కావడం లేదన్న ఒకేఒక్క సాకుతో అధికారులు, టెక్నికల్ సిబ్బంది ల్యాండ్‌ఫోన్ వినియోగదారులకు అవస్థలు సృష్టిస్తున్నారు. సాంకేతిక విభాగం అధికారులు, సిబ్బంది చాలినంతమంది లేరన్న అంశం కూడా ఓ సాకుగా చూపుతున్నారు. దీంతో ల్యాండ్ ఫోన్ పరికరం పాడైతే సంబంధిత సంస్థ టెక్నికల్ సిబ్బంది సూచించే బయట మెకానిక్‌ల వద్దే రిపేరు చేయించుకోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు మెకానిక్ ఒక్కో ఫోన్‌కు రూ.250 నుంచి రూ.400 వరకు వసూలు చేస్తున్నారు. పాడైన ఫోన్ పరికరం బాగు కాకుంటే మాత్రం బీఎస్‌ఎన్‌ఎల్ సాంకేతిక విభాగంలో రూ.650 చెల్లిస్తే కొత్త ల్యాండ్ ఫోన్ ఇస్తామంటూ అధికారులు చెబుతుండడాన్ని వినియోగదారులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ప్రతినెలా సర్వీసు చార్జీల రూపంలో వందలకు వందలు చెల్లిస్తున్నా ల్యాండ్‌ఫోన్ సమస్యలపై అ«ధికారులు నిర్లక్ష్యం చేయడం సరికాదని మండిపడుతున్నారు.
పని చేయకున్నా సర్వీస్ బిల్లు
ల్యాండ్ ఫోన్‌లు పనిచేయకున్నా, మరమ్మతులకు గురైనా సంస్థకు చెల్లించాల్సిన సాధారణ సర్వీసు బిల్లులను మాత్రం వినియోగదారుడు భరించక తప్పడం లేదు. ఈ విధంగా సరాసరిన నెలకు బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులపై పడుతున్న సర్వీస్ బిల్లుల భారమే సుమారు రూ.5 లక్షలకు పైగా ఉంటోంది. వినియోగదారులు చిరకాలం నుంచి బంధం కొనసాగిస్తున్న ల్యాండ్‌ఫోన్‌లను వదులుకోలేక, సాంకేతిక సమస్యలతోనే కొనసాగించుకుంటున్నారు. ఇందుకు అనుగుణంగా సంస్థ టెక్నికల్ సిబ్బంది సహకారం వేలాది మంది వినియోగదారులకు సకాలంలో అందడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment