కష్టపడదాం ప్రగతి సాధిద్దాం | Seven missions to the development of the district | Sakshi
Sakshi News home page

కష్టపడదాం ప్రగతి సాధిద్దాం

Published Sat, Aug 16 2014 3:11 AM | Last Updated on Wed, Apr 3 2019 5:55 PM

కష్టపడదాం ప్రగతి సాధిద్దాం - Sakshi

కష్టపడదాం ప్రగతి సాధిద్దాం

  • ఏడు మిషన్ల ద్వారానే జిల్లా అభివృద్ధి  సాధ్యమవుతుంది
  •  సమైక్యాంధ్ర ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తేస్తాం
  •  పట్టణ, పల్లెప్రాంతాల్లో 24 గంటల విద్యుత్తు సరఫరాకు చర్యలు చేపట్టాం
  •  ఎన్ని అడ్డంకులు ఎదురైనా రుణమాఫీ చేసి తీరుతాం
  •  తెలుగుగంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి
  •  68వ స్వాతంత్య్ర  సంబరాల్లో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
  • సాక్షి, చిత్తూరు : ‘‘అభివృద్ధికోసం ప్రభుత్వం ప్రాధాన్య రంగాలను గుర్తించి ఏడు మిషన్లుగా విభజించింది. వీటి అమలుతో ఇటు జిల్లా అభివృద్ధి, అటు రాష్ట్ర అభివృద్ధి సుసాధ్యమవుతుంది. ఆదాయవనరులు పెంచుకుని, జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకుని ఐదేళ్లలో ‘ఏడు మిషన్ల’ లక్ష్యాన్ని సాధించాలి. విజన్ 2029లో పొందుపరిచిన లక్ష్యాలను 2022కే చేరుకోవాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తిస్థాయిలో పనిచేసి లక్ష్యసాధనకు శ్రమించాలి.’’ అని పర్యావరణ, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. 68వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని ఆయన శుక్రవారం చిత్తూరు పోలీసుపరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

    జిల్లా ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశస్వాతంత్య్ర ఉద్యమంలో ప్రాణాలర్పించిన త్యాగమూర్తులకు శ్రద్ధాంజలి ఘటించారు. కొత్తగా ఎన్నికైన  ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ఆపై జిల్లా అభివృద్ధి, ప్రభుత్వ లక్ష్యాలను ఆయన సోదాహరణంగా వివరించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.‘‘రాబోయే రోజుల్లో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో రాష్ట్రాభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం. అన్నివర్గాల ప్రజలకు సంక్షేమఫలాలను అందించే పాలన వ్యవస్థను సిద్ధం చేస్తున్నాం. లక్ష్యాలను నిర్ధిష్ట కాలపరిమితిలో పూర్తిచేసి ఫలితాలు రాబట్టేందుకు ఏడు ప్రాధాన్య రంగాలను గుర్తించాం.

    వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం,ఉత్పాదకత పెంచడం, పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన, పర్యాటక రంగం అభివృద్ధి, స్కిల్ డెవలప్‌మెంట్ , స్త్రీశిశు సంక్షేమ ఆరోగ్యం, విద్య, తాగునీరు, పారిశుద్ధ్య కల్పన అంశాలతో మిళితమైన ఁసెవెన్‌మిషన్*ను అనుకున్న కాలపరిమితిలో పూర్తిచేస్తే జిల్లాతో పాటు రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉద్యమకారులపై నమోదైన కేసులన్నీ ఎత్తేస్తాం. అందరికీ అనువైన రాజధాని ఏర్పాటు చేస్తాం. నాయుడుపేట-విజయవాడ, విశాఖపట్నం-విజయవాడ నాన్‌స్టాప్ రైళ్లు ఏర్పాటు చేస్తున్నాం.
     
    ఎన్నికష్టాలు ఎదురైనా రుణమాఫీ చేస్తాం :

    ఈ ఏడాది మార్చి 31 వరకూ తీసుకున్న రుణాల్లో ఒక్కో కుటుంబానికి 1.5లక్షల రూపాయల వరకూ మాఫీ చేస్తాం. డ్వాక్రా గ్రూపుల్లో ఒక్కో సంఘానికి లక్ష రూపాయలు మాఫీ చేస్తాం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రుణమాఫీ చేసి తీరుతాం. పంటలబీమా గడువును సెప్టెంబర్ 15 వరకూ పెంచాం. రైతులంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. పల్లెలు, పట్టణాల్లో 24 గంటల విద్యుత్ సరఫరాకు ఇప్పటికే చర్యలు తీసుకున్నాం.

    ఈ ఏడాది 14,637 హెక్టార్లలో డ్రిప్, స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసేందుకు లక్ష్యం నిర్ధేశించుకున్నాం. వాటర్‌షెడ్లు, ఫాం పాండ్లు, చెక్‌డ్యాంలు, నీరు-చెట్టు కార్యక్రమాలకు 436కోట్ల రూపాయలతో ప్రణాళికలు రూపొందించాం. ఈ ఏడాది ఎన్.టి.ఆర్ సుజల స్రవంతి ద్వారా 2రూపాయలకు 20 లీటర్ల శుద్ధిజలాన్ని అందిస్తాం. ఇప్పటికే చిత్తూరు, శ్రీకాకాళం మునిసిపాలిటీలో ప్రక్రియ ప్రారంభించాం. ఈ ఏడాది తెలుగుగంగకు 85కోట్లు, హంద్రీ-నీవాకు 205.70కోట్లు, గాలేరు-నగరి ప్రాజెక్టు పనులకు 100కోట్ల అంచనాతో పనులు చేపట్టనున్నాం. రాష్ట్రంలోనే మల్బరీసాగులో జిల్లా ప్రథమస్థానంలో ఉంది. పాడిఉత్పత్తిలో రాష్ట్రంలో అగ్రగామిగా ఉన్నాం. వీటి అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటాం.
     
    అంతర్జాతీయ విద్యాకేంద్రంగా తిరుపతి :


    ప్రసిద్ధపుణ్యక్షేత్రం తిరుపతిని అంతర్జాతీయ విద్యాకేంద్రంగా అభివృద్ధి చేస్తాం.ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌లను తిరుపతిలో ఏర్పాటు చేసేందుకు భూసేకరణ చేస్తున్నాం. రాష్ట్రంలో మూడు మెగాసిటీల అభివృద్ధి ప్రక్రియలో తిరుపతి కూడా ఉండటం జిల్లావాసులందరికీ గర్వకారణం. ఆరోగ్యశ్రీ స్థానంలో త్వరలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీకార్డులు జారీ చేస్తాం. జిల్లాలో ఆధార్‌సీడింగ్ 85శాతం పూర్తయింది. వంద శాతం పూర్తిచేస్తాం. విద్యార్థుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు 100కోట్ల రూపాయలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్నాం. ఎర్రచందనం అడవుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. జిల్లా అభివృద్ధికి శ్రమిస్తున్న అధికార యంత్రాంగానికి , శాంతిభద్రతల కోసం శ్రమిస్తున్న పోలీసులకు అభినందనలు.

    మంత్రి ప్రసంగం అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. తర్వాత పలు ప్రభుత్వశాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకరించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. అయితే ఉద్యోగుల తరఫున ఆయా శాఖాధిపతులకు మాత్రమే వేడుకల్లో ప్రశంసాపత్రాలు అందించడం ఉద్యోగులను తీవ్రంగా బాధించింది. వేడుకల్లో కలెక్టర్ సిద్ధార్థ్ జైన్, జెడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి, ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే డీఏ సత్యప్రభ, మేయర్ కఠారి అనురాధతో పాటు అన్ని ప్రభుత్వశాఖల అధికారులు పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement