
కుట్టు లోగుట్టు
అనంతపురం ఎడ్యుకేషన్ :
స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) నిర్లిప్తతతో ఆయా పాఠశాలల్లో యూనీఫాం ‘కుట్టు' దారితప్పుతోంది. తమ పిల్లలు ఆయా పాఠశాలల్లో చదువుతున్నా...ఆర్థిక ఇబ్బందులు, ఇతరత్రా కారణాల వల్ల చాలామంది ఎస్‌ఎంసీ సభ్యులు పాఠశాలల వైపు చూడడం లేదు. హెచ్‌ఎంలు ఇంటికో.. లేక ఎక్కడైనా పని చేస్తున్న చోటుకు పేపర్లు పంపితే సంతకాలు చేయడంవరకే వారి బాధ్యత. ఎందుకోసం సంతకాలు చేస్తున్నామని ప్రశ్నించని సభ్యులు కూడా చాలామంది ఉన్నారు. దీంతో యూనీఫాం కుట్టే పని ఒకరిద్దరికే కేటాయించవద్దన్న ప్రభుత్వ ఉత్తర్వులు అమలుకు నోచుకోవడం లేదు.
5.97 లక్షల యూనిఫాం జతలు ఇవ్వాల్సి ఉంది
జిల్లాలో 3,844 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలు ఉన్నాయి. వీటిలో 1-8 తరగతుల విద్యార్థులకు సర్వ శిక్ష అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ద్వారా ప్రతి ఏడాది రెండు జతల యూనీఫాం పంపిణీ చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా 2,98,632 మంది విద్యార్థులు 1-8 తరగతుల విద్యార్థులు ఉన్నారు. ఒక్కొక్కరికి రెండు జతల ప్రకారం 5,97,264 జతల యూనీఫాం అవసరం. 1-7 తరగతుల బాలురకు చొక్కా, నిక్కర, బాలికలకు చొక్కా, స్కర్టు ఇవ్వాలి. 8వ తరగతి బాలురకు షర్టు, ప్యాంటు, బాలికలకు పంజాబీ దస్తులు ఇవ్వాలి.
ప్రతి సంవత్సరం పాఠశాలలు ప్రారంభమయ్యేనాటికి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులందరికీ యూనీఫాం పంపిణీ చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఈ క్రమంలో జూన్, జూలై మాసాల్లో ఈ పక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటికి స్కూళ్లు ప్రారంభమై ఐదు నెలలు గడుస్తున్నా...నేటికీ యూనీఫాం అందలేదు. నేటికీ సుమారు 200 స్కూళ్లకు యూనీఫాం జాడలేదు. ఎప్పుడూ లేనివిధంగా ఈసారి పోస్టల్ ద్వారా క్లాత్ పంపడం కూడా ఆలస్యానికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.
కుట్టులో కమీషన్లకే పెద్దపీట
కుట్టుపై కొందరి గుత్తేదారుల కన్నుపడింది. నిబంధనలు తుంగలో తొక్కి కమీషన్లకు కక్కుర్తిపడుతూ కుట్టు విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులకు కమీషన్ల ఎరచూపి గంపగుత్త పేరుతో నిధులు బొక్కేందుకురంగం సిద్ధం చేశారు. అనుకున్నట్లే కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు క్షేత్రస్థాయిలో మండల విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
గుంతకల్లు నియోజకవర్గంలో ఓ ముఖ్య ప్రజాప్రతినిధి ఆదేశాల మేరకు అనంతపురం బళ్లారి రోడ్డులో ఉన్న ఓ సంస్థకు కుట్టు బాధ్యతను అప్పగిస్తూ ఎంఈఓలు నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఆయా స్కూళ్ల హెచ్‌ఎంలపై ఒత్తిడి తెచ్చి మరీ ఒప్పించినట్లు తెలిసింది. అనంతపురం నగరం, ధర్మవరం, తాడిపత్రి, లోనూ ఇదే పరిస్థితి. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కమీషన్ ఎరచూపి కుట్టు బాధ్యతను తీసుకున్న సంస్థ ఈప్రభుత్వంలోనూ అదే కమీషన్ల ఎరచూపి కాంట్రాక్ట్ దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సుమారు పదుల సంఖ్యలో మండలాల కాంట్రాక్ట్ దక్కించుకున్నట్లు తెలిసింది.
ఇలా చేయాలి..
ఎక్కడా గంపగుత్తగా ఒకే సంస్థకు యూనిఫాం కుట్టేందుకు ఇవ్వకూడదు. స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ) సిఫార్సు మేరకు వారికి ఇష్టం వచ్చిన వారితో కుట్టించుకోవచ్చు. టైలరు పాఠశాలకు వచ్చి ప్రతి విద్యార్థి నుంచి కొలతలు తీసుకునేలా చూడాల్సిన బాధ్యత ఎస్‌ఎంసీలదే. ఇదీ ప్రభుత్వ ఉత్తర్వు.
జరుగుతోందిలా
‘యూనిఫాం కుట్టే బాధ్యతను స్థానిక ముఖ్య ప్రజాప్రతినిధి ఫలానా సంస్థకు ఇవ్వమని చెప్పాడు. ఈ విషయంలో ఎవరైనా కాదు గీదంటే మీఇష్టం. మీరే ఇబ్బంది పడతార’ంటూ కొందరు మండల విద్యాశాఖ అధికారులు స్కూల్ ప్రధానోపాధ్యాయులకు చెబుతున్న మాటలివి. అధికారులే పట్టించుకోనప్పుడు తమకు ఎందుకొచ్చిన తలనొప్పిలే అనుకుంటూ వారు కూడా ఎంఈఓలు చెప్పినవారికి కుట్టు బాధ్యత అప్పగిస్తున్నారు.
ఎస్‌ఎంసీలదే బాధ్యత
గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి యూనీఫాం విషయంలో ప్రభుత్వం గట్టిచర్యలు తీసుకుంది. నేరుగా స్కూల్ పాయింట్‌కే క్లాత్ పంపిణీ చేసింది. హెచ్‌ఎం, ఎస్‌ఎంసీ ఆమోదం మేరకు స్థానికంగా ఉండే టైలర్లతో యూనీఫాం కుట్టించాలి. ప్రతి విద్యార్థి నుంచి కొలతలు తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే హెచ్‌ఎం, ఎంఈఓలు ఇబ్బంది పడతారు.
- మధుసూదన్‌రావు ఎస్‌ఎస్‌ఏ పీఓ