మితిమీరిన కీచకపర్వం!
► లైంగిక వేధింపులు ఆపని కీచకుడు
► ఉన్నతాధికారుల అండదండలతో పెట్రేగిపోతున్న అధికారి
► కలెక్టర్ వద్ద కన్నీళ్లు పెట్టుకున్న మహిళా ఉద్యోగి
► ముందేచెప్పిన ‘సాక్షి
నెల్లూరు(అగ్రికల్చర్): ‘‘నీకు భర్తలేడు..పైగా ప్రోబేషన్ పిరియడ్‌లో ఉన్నావు.. నేను సంతకం పెడితేనే నీకు ఉద్యోగం నిలుస్తోంది. లేదంటే జౌట్.. అందువల్ల నా కోరిక తీర్చితేనే నీకు మంచిది. లేదంటే కష్టాలు తప్పవు.’’ అంటూ నిత్యం వేధిస్తున్నాడు.. వేధింపులు తాళలేక ఆ మహిళ ఆత్మహత్య చేసుకోవాలనుకుంది. తనపై ఆధారపడ్డ మూడేళ్ల పసిబిడ్డ, 85 ఏళ్ల ముసలి తండ్రి, పక్షవాతానికి గురైన సోదరుడు గుర్తుకు రావడంతో బాధతోనే ఆత్మహత్యను విరమించుకుంది. ధైర్యాన్ని కూడదెచ్చుకుని కలెక్టర్ ఎం.జానకీకి శనివారం కన్నీళ్లతో తన గోడు వెళ్లబోసుకుంది. తనకు వేధింపులు జరగకుండా రక్షణ కల్పించాలనిబోరున విలపించింది. ఆమె గాధను విన్న కలెక్టర్ సైతం ఆవేదన చెందారు.
ఆరునెలలుగా ఆగని వేధింపులు..
జిల్లా వ్యవసాయశాఖ పరిధిలోని భూసార పరీక్షల కేంద్రం రైల్వేఫీడర్స్ రోడ్డులో ఉంది. అక్కడ ఓ మహిళ రెండేళ్లుగా అగ్రికల్చర్ ఆఫీసర్‌గా(ఏఓ)గా పనిచేస్తోంది. ప్రోబేషన్ పిరియడ్‌లో ఉంది. ఈ పిరియడ్‌లో ఆమె కాన్ఫిడెన్షియల్ రిపొర్టుపై పైఅధికారి అయిన ఏడీఏ గయాజ్ అహ్మద్ సంతకం చేయాల్సి ఉంది. ఎప్పటి నుంచో ఆమెపై కన్నేసిన ఆయన దీనిని ఆసరాగా తీసుకున్నాడు. సీఆర్‌ఎస్‌పై సంతకం పెట్టాడు. ఇక ఆమెను సాయంత్రం షిప్టుకు విధులకు మార్చాడు. సాయంత్రం 7 గంటలకు కంప్యూటర్ రూమ్‌లో ఒంటరిగా ఉన్న ఆమె వద్దకు వచ్చి ‘సంతకం పెట్టాను కదా నాకేమిస్తావు’ అంటూ వేధింపులు మొదలు పెట్టాడు. నా కారులో పోదాంరా అంటూ పిలిచేవాడు. దీంతో ఆమె భయపడి తన ఇబ్బందులకు గురిచేయోద్దని కాళ్లవేళ్లా పడింది. తాను భర్త మరణించిన బాధలో ఉన్నాని వేడుకుంది. అయినా అతని వేధింపులు ఆగలేదు.
దీంతో జనవరి 23న తొలిసారిగా వేధింపులపై జేడీఏ హేమమహేశ్వరరావుకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన, అసోసియేషన్ నాయకులు రంగంలోకిదిగి విషయం బయటకు పొక్కితే పరువు పోతుందని భావించి సర్దుబాటు చేశారు. ఫిర్యాదుతో మరింత రెచ్చిపోయిన ఏడీఏ గయాజ్ ఆమెకు కావాలని చార్జీ మెమో లు ఇవ్వడం, కమిషనర్‌కు ఫిర్యా దు చేయడం, విధులకు హాజరైనా సీఎల్ వేయడం లాంటి తీవ్రమైన ఇబ్బందులకు గురి చేశా రు. లొంగకపోతే వదిలేదు లేదంటూ హెచ్చరించాడు. దీంతో మరోమారు ఆమె జేడీఏకు తన బాధలు చెప్పుకుని ఏడ్చింది. దీంతో చివరకు ఆమెను అక్కడ నుంచి డిప్యూటేషన్‌పై పది రోజుల క్రితం భూ పరిరక్షణ కేంద్రానికి (సాయిల్ కన్‌జర్వేషన్) కార్యాలయానికి మార్చారు. అయినా ఆయన వేధింపులు ఆగలేదు.
విచారణకు ఆదేశించిన కలెక్టర్:
ఈ విషయాలన్నింటిని పూసగుచ్చినట్లు వివరించడంతో కీచక అధికారిపై వెంటనే కలెక్టర్ విచారణకు ఆదేశించారు. చర్యలు తీసుకునే ందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది.
ఎస్పీకి ఫిర్యాదు చేయనున్న బాధిత మహిళ:
తనను లైంగికంగా వేధిస్తున్న వైనం ఎస్పీకి సైతం ఫిర్యాదు చేయనుంది. తనకు రక్షణ కల్పించాల్సిందిగా కోరనున్నట్టు ఆమె ‘సాక్షి’కి తెలిపింది.
చర్యలకు నివేదించాం: -కె. హేమమహేశ్వరరావు, జేడీ
తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదు. ఏడీఏ గయాజ్ తప్పు చేసిన విషయం వాస్తవమే. దీనిపై ఇప్పటికే తాము ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కమిషనరేట్‌కు నివేదిక పంపాం.