సోనియా... తెలంగాణ తల్లి: శంకర్రావు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీలో ఆయనదో విభిన్న శైలి. వింత వైఖరుల, విచిత్ర వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారాయన. ఒక్కోసారి ఆయన మాటలు, చేష్టలు హాస్యాస్పదంగానూ అన్పిస్తుంటాయి. ఆయన మరెవరో కాదు రాష్ట్ర మాజీ మంత్రి పి.శంకర్రావు అలియాస్ శంకరన్న. అధిష్టానమ్మ సోనియా గాంధీని స్తుతించడంలోనూ ఆయనది ప్రత్యేక శైలి. 'మేడమ్' వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడబోతోందని శంకర్రావు గట్టిగా నమ్ముతున్నారు.
ఈ నేపథ్యంలో సోనియా భజన ముమ్మరం చేశారు. సోనియాను తెలంగాణ దేవతగా వర్ణిస్తూ ఆమెకు ఆలయం కట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి సోనియా పేరు పెట్టాలంటూ శంకర్రావు కొత్త పాట అందుకున్నారు. త్వరలో ఏర్పాటు కానున్న కొత్త రాష్ట్రానికి 'సోనియా తెలంగాణ' అని నామకరణం చేయాలని ఆయన కోరుతున్నారు. అధిష్టానమ్మను ఆయన తెలంగాణ తల్లిగా వర్ణించారు. శంకర్రావు వీర విధేయతపై 'మేడమ్' ఎలా స్పందిస్తారో చూడాలి.