12నుంచి షర్మిల సమైక్య శంఖారావం | sharmila bus tour in west godavari from september 12th | Sakshi
Sakshi News home page

12నుంచి షర్మిల సమైక్య శంఖారావం

Published Sun, Sep 8 2013 4:37 AM | Last Updated on Fri, Sep 1 2017 10:32 PM

sharmila bus tour in west godavari from september 12th

ఏలూరు (ఆర్‌ఆర్ పేట), న్యూస్‌లైన్ :సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం బస్సు యాత్ర ఈనెల 12న జిల్లాలోకి ప్రవేశించనుందని పార్టీ జిల్లా కన్వీనర్, పోల వరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు  తెలిపారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన నియోజకవర్గాల కన్వీనర్లు, పార్టీ ముఖ్య నాయకుల సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 12న మధ్యాహ్నం 3గంటలకు స్థానిక ఫైర్‌స్టేషన్ సెంట ర్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారని చెప్పారు. ఆ రోజు రాత్రి ఏలూరులో బస చేస్తారని వివరించారు. 13న ఉదయం ఏలూరు నుంచి బస్సు యాత్ర బయలుదేరుతుందన్నారు. అనంతరంతూర్పుగోదావరి జిల్లా రావులపాలెం చేరుకుంటారని వెల్లడించారు.
 
 బహిరంగ సభను, బస్సు యూత్రను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇంతకుముందు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర నిర్వహిం చిన షర్మిల ప్రపంచ రాజకీయాల్లోనే సరి కొత్త చరిత్ర సృష్టించారని బాలరాజు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించే ప్రయత్నాలకు నిరసనగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతోందని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఇప్పటికే అనేక కార్యక్రమాలు నిర్వహించామని గుర్తుచేశారు. పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు విభజన ప్రకటన వెలువడిన వెంటనే రాజీనామా చేశారని తెలిపారు. 
 
 పార్టీ  గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ 5 రోజులు, పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 7 రోజులు నిరాహార దీక్ష చేసి సమైక్య వాదానికి కట్టుబడి ఉన్న విషయాన్ని స్పష్టం చేశారని చెప్పారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల వైఖరి కారణంగానే రాష్ట్రం అగ్నిగుండంగా మారిందని బాలరాజు విమర్శిం చారు. ఈ పరిస్థితుల్లోనూ చంద్రబాబునాయుడు ప్రజలను మోసం చేయడానికి ఆత్మగౌరవ యాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమైక్య వాదానికి కట్టుబడి ఉన్నప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని చంద్రబాబు విమర్శించడం విడ్డూరంగా ఉందని పేర్కొ న్నారు. అసలు విధానమే లేని బాబు ఏ మొహం పెట్టుకుని ప్రజల ముందుకు వస్తున్నారని దుయ్యబట్టారు. 
 
 సమైక్యవాదాన్ని, నాదాన్ని ఢిల్లీకి వినిపిస్తాం : నాని
 ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ సమైక్య శంఖారావంలో భాగంగా షర్మిల నిర్వహించనున్న సభను విజ యవంతం చేయడానికి ఏలూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. సమైక్య శంఖారావం బహిరంగ సభను జయప్రదం చేయడానికి సమైక్య వాదులు సైతం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే వివిధ జిల్లాలో సమైక్య శంఖారావం యాత్రను సమైక్యవాదులు, ప్రజలు స్వాగతించడం శుభపరిణామమన్నారు. షర్మిల సభ సందర్భంగా సమైక్యవాదాన్ని, నాదాన్ని ఢిల్లీ వరకూ వినిపిస్తామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ షర్మిల సభకు 15 నియోజకవర్గాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతోపాటు ప్రజలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
 
 సమైక్య వాణిని తమ పార్టీ నాయకులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదిలోనే పార్లమెంటులో వినిపించారని గుర్తు చేశారు. ఆత్మగౌరవ యాత్ర పేరిట చంద్రబాబు బస్సుయూత్ర చేయడాన్ని ప్రజలు నమ్మ టం లేదని పేర్కొన్నారు. చంద్రబాబు మాటల్లో పొంతన లేకపోవడమే ప్రజల అపనమ్మకానికి కారణమైందన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ నియోజకవర్గాల కన్వీనర్లు తోట గోపి, పాతపాటి సర్రాజు, తలారి వెంకటరావు, చలమోలు అశోక్‌గౌడ్, కొఠారు రామచంద్రరావు, కర్రా రాజారావు, చీర్ల రాధయ్య, గొట్టుముక్కల భాస్కరరాజు, పార్టీ జిల్లా మహిళా కన్వీనర్ గూడూరి ఉమాబాల పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement