సోదరుడికి ప్రజల కష్టాలు వివరించిన షర్మిల | Sharmila meets YS Jagan in jail, shares feelings | Sakshi
Sakshi News home page

సోదరుడికి ప్రజల కష్టాలు వివరించిన షర్మిల

Published Mon, Aug 5 2013 1:57 PM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

సోదరుడికి ప్రజల కష్టాలు వివరించిన షర్మిల - Sakshi

సోదరుడికి ప్రజల కష్టాలు వివరించిన షర్మిల

ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు సుదీర్ఘ పాదయాత్ర చేసి, ప్రజల కష్టనష్టాలు తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల... ఆ వివరాలన్నింటినీ చంచల్గూడ జైల్లో తన సోదరుడు, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డికి వివరించారు. విమానాశ్రయం నుంచి నేరుగా జైలు వద్దకు చేరుకున్న ఆమె, ములాఖత్ ద్వారా ఆయనను కలుసుకున్నారు. అశేష ప్రజాభిమానం ఎలా ఉందో వివరించారు. కొద్దిసేపటి తర్వాత ఆమె చంచల్ గూడ జైలు నుంచి బయటకు వచ్చారు. పాదయాత్ర సాగిన తీరు పట్ల జగన్ మోహన రెడ్డి చాలా సంతోషంగా ఉన్నారని, తామందరినీ ఆయన అభినందించారని జైలు బయట విలేకరులకు చెప్పారు. తమను ఆశీర్వదించి, సహకరించి, తమ సహకారం అందించిన ప్రజలకు, పాదయాత్రను ఆశీర్వదించిన దేవుడికి షర్మిల కృతజ్ఞతలు తెరలిపారు. 

అంతకుముందు పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న షర్మిలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు,అభిమానులు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. సోమవారం ఉదయం వైఎస్ విజయమ్మతో కలిసి ఆమె విశాఖపట్నం నుంచి బయల్దేరి హైదరాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయంలో షర్మిలకు పార్టీ నేత పుత్తా ప్రతాప్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రాజన్న బిడ్డకు స్వాగతం పలికేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి తరలి వచ్చారు. షర్మిల.. పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా జై జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జగన్ నినాదాలతో ఎయిర్ పోర్టు మార్మోగింది.

సుదీర్ఘ పాదయత్ర చేసిన మహిళగా వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ఆమె చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్ద ముగిసిన విషయం తెలిసిందే. 2012 అక్టోబర్ 18న వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుంచి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.  పాదయాత్రలో షర్మిల మోకాలుకు గాయం కావడంతో కొంతకాలం పాదయాత్ర వాయిదా వేసుకున్నారు. 3112 కిలోమీటర్ల దూరాన్ని 230 రోజులలో ఆమె పూర్తి చేశారు. రాష్ట్రంలో 14 జిల్లాలు, 116 అసెంబ్లీ నియోజక వర్గాలు, తొమ్మిది కార్పొరేషన్లు, 45 మున్సిపాల్టీలు, 195 మండలాల్లో షర్మిల పర్యటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement