సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల రెండో విడత ఎన్నికల నేపథ్యంలో ఈనెల 10, 11వతేదీల్లో నిర్వహించాల్సిన పదో తరగతి సోషల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏప్రిల్ 10వ తేదీన జరగాల్సిన సోషల్ పేపర్ 1ను, 11వతేదీన జరగాల్సిన సోషల్ పేపర్ 2 పరీక్షలను వాయిదా వేసినట్లు ప్రభుత్వ పరీక్షల డెరైక్టర్ మన్మథరెడ్డి తెలిపారు. తాజా షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 12న సోషల్ పేపర్ 1 పరీక్షను, 15వ తేదీన సోషల్ పేపర్ 2 పరీక్షను నిర్వహించనున్నారు. 12వతేదీన జరగాల్సిన ఓరియెంటల్ ఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్(సంస్కృతం, అరబిక్, పర్షియన్) పేపర్-2 పరీక్షను 16 తేదీకి వాయిదా వేశారు. 15న జరగాల్సిన ఒకేషనల్ థియరీ పరీక్ష 17కు వాయిదా పడింది.
రెండు పరీక్షల టైమింగ్స్ మార్పు: ఏప్రిల్ 7వతేదీన జరగనున్న సైన్స్ పేపర్ 1తోపాటు 12వ తేదీ జరగనున్న సోషల్ పేపర్ 1 పరీక్షల సమయంలో మార్పు చేశారు. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటలకు కాకుండా 11 గంటల నుంచి 1.30 గంటల వరకు నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే నెల 6వతేదీన, 11వతేదీన రెండు విడతల్లో జరగనున్న విషయం తెలిసిందే. పోలింగ్ తర్వాత రోజుల్లో జరగనున్న ఈ రెండు పరీక్షలకు సెంటర్లలో తగిన ఏర్పాట్లు చేయడానికి వీలుగా పరీక్షల నిర్వహణ సమయంలో మార్పు చేసినట్లు అధికారులు తెలిపారు.
షెడ్యూల్‌లో మార్పులు ఇవీ...
పరీక్ష పాత తేదీ కొత్త తేదీ
సోషల్ పేపర్-1 ఏప్రిల్ 10 ఏప్రిల్ 12
సోషల్ పేపర్-2 ఏప్రిల్ 11 ఏప్రిల్ 15
ఓరియంటల్ మెయిన్ లాంగ్వేజ్ ఏప్రిల్ 12 ఏప్రిల్ 16
వొకేషనల్ థియరీ ఏప్రిల్ 15 ఏప్రిల్ 17