అంత వరకూ జరిగిన శుభ కార్యానికి చెందిన ముచ్చట్లు చెప్పుకుంటూ సరాదాగా ఆటోలో వస్తున్న వారిని వ్యాన్ రూపంలో మృత్యువు పలకరించింది.
- ఆటో,వ్యాన్ ఢీ: ఇద్దరు మృతి
- ఎనిమిది మందికి తీవ్రగాయాలు
బుచ్చెయ్యపేట, న్యూస్‌లైన్: అంత వరకూ జరిగిన శుభ కార్యానికి చెందిన ముచ్చట్లు చెప్పుకుంటూ సరాదాగా ఆటోలో వస్తున్న వారిని వ్యాన్ రూపంలో మృత్యువు పలకరించింది. కనురెప్ప పాటులో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఎనిమిది మంది తీవ్రగాయాలపాలయ్యారు.
చీడికాడ మండలం మంచాల గ్రామానికి చెందిన పట్నాల రాజు అతని తల్లి పార్వతమ్మ, కుటుంబీకులు పట్నాల వీరభద్రుడు, పట్నాల బ్రహ్మాజి, పట్నాల రాము, పట్నాల లక్ష్మి , కుచ్చర్ల భారతి ఆమె నాలుగేళ్ల కొడుకు వినయ్, కుచ్చర్ల లక్ష్మి, గోస మౌనిక కలిసి తమ గ్రామానికి చెందిన దేముడునాయుడు ఆటోలో రావికమతంలో తమ బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరై తిరిగి వస్తున్నారు.
బీఎన్ రోడ్డులో లోపూడి వద్దకు వచ్చేసరికి నర్సీపట్నం మదర్ థెరీసా నర్సింగ్ హోమ్‌కు చెందిన నర్సింగ్ వ్యాన్ వడ్డాది నుంచి వస్తూ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జయింది. ఆటోడ్రైవర్ దేముడు నాయుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
తల్లి కళ్లముందే కొడుకు కన్నుమూత...
డ్రైవర్ పక్కనే కూర్చొని ఉన్న పట్నాల రాజు తీవ్రంగా గాయపడి ఆటోలో ఇరుక్కుపోయాడు. మిగతా వారంతా తీవ్రగాయాలతో రోడ్డుపై చెల్లా చెదురుగా పడ్డారు. స్థానిక యువకులు వచ్చి ఆటోలో ఇరుక్కున్న రాజును రక్షించేందుకు ప్రయత్నించారు. ఆ పక్కనే కాళ్లు విరిపోయి రక్తపు మడుగులో పడి ఉన్న తల్లి పార్వతమ్మను చూసి కొన ఊపిరితో ఉన్న రాజు, అమ్మా...కాపాడు అమ్మా...అంటూ రోధించాడు. కదలలేని స్థితిలో తల్లి ఉండగా ఆమెను చూస్తూనే రాజు కళ్లు మూశాడు.
మరోపక్క తలకు దెబ్బతగిలిన నాలుగేళ్ల చిన్నారి వినయ్ ఆ పక్కనే శరీరమంతా దెబ్బలతో రక్తపు మడుగులో ఉన్న తల్లి భారతిని చూసి ‘అమ్మా... మంచినీళ్లు ఇవ్వమ్మా...’ అంటూ రోధించిన సంఘటన చూపరును కలిచివేసింది. స్థానికుల సమాచారంతో 108 అంబులెన్స్ వాహనాలు వచ్చి క్షతగాత్రులను చోడవరం, అనకాపలి ఆస్పత్రులకు తరలించారు. చోడవరం సీఐ విశ్వేశ్వరరావు వచ్చి కేసు నమోదు చేశారు.
నర్సింగ్ వ్యాన్ సభ్యుల పరారీ
ఆటోను ఢీకొని ఇద్దరు ఇద్దరు మరణానికి, మరో తొమ్మిది మంది గాయపడేందుకు కారణమైన నర్సింగ్ హోమ్ వ్యాన్‌లో ఉన్న వారు అక్కడ నుంచి పరారయ్యారు. నర్సింగ్ హోమ్‌కు చెందిన కొందరు ఈవ్యాన్‌లో మరో కార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ప్రమాద తీవ్రతను గుర్తించి భయపడి వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు.