వయసు నిబంధన.. ప్రమాదాన్ని తగ్గిస్తుంది!
హూస్టన్ః అనేక దేశాల్లో వివాహాలకు చట్టపరమైన వయసు నిబంధనలు ఉన్నసంగతి తెలిసిందే. కానీ అలవాట్లకు సైతం నిబంధనలు విధిస్తే ఆరోగ్యాలు బాగుపడతాయంటున్నారు తాజా పరిశోధకులు. చిన్ననాటినుంచే చెడు అలవాట్లకు బానిసలౌతుండటంతో, అతి తక్కువ వయసులోనే అనారోగ్యాల బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఓ శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు చేపట్టింది. మద్యపానానికి చట్టపరంగా 21 ఏళ్ళ వయసును నిర్థారిస్తే.. చిన్నవయసునుంచే మద్యం తాగే అలవాటు ఉన్నవారితో పోలిస్తే మరణాల ప్రమాదం తగ్గుతుందని అధ్యయనాల ద్వారా తెలుసుకున్నారు.
మద్యం తాగేందుకు కనీస వయసు (మినిమమ్ లీగల్ డ్రింకింగ్ ఏజ్ (ఎంఎల్డీయే) 21 ఏళ్ళు ఉండేట్టుగా చట్టాన్ని తెస్తే మరణాల శాతం తగ్గుతుందని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. మద్యం తాగే వయసు కనీసం 21 ఏళ్ళు ఉండేట్లుగా చూస్తే.. యవ్వనంలో ఆరోగ్య పరంగా అనేక లాభాలు చేకూరుతాయని అధ్యయనకారులు చెప్తున్నారు. 21 ఏళ్ళ వయసుకన్నా ముందే మద్యానికి అలవాటు పడినవారు... మద్యానికి సంబంధించిన అనేక దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడటమే కాక, మరణించే ప్రమాదం కూడ ఉన్నట్లు పరిశోధనల్లో తెలుసుకున్నారు. 1990 నుంచి 2010 మధ్య జనాభా మరియు, వారి మరణాలకు కారణాల డేటాను అమెరికా రీసెర్స్ సొసైటీనుంచి సేకరించిన శాస్త్రవేత్తలు.. 21 ఏళ్ళ వయసులోపు మద్యపానం అలవాటు అనేక ప్రమాదాలకు దారి తీస్తుందని తెలుసుకున్నారు.
మద్యపానం అలవాటుతో కాలేయానికి సంబంధించిన వ్యాధుల బారిన పడినవారు, మద్యపానం వల్ల క్యాన్సర్ తో చనిపోయినవారి రికార్డులను సైతం అధ్యయనకారులు పరిశీలించారు. దీనిద్వారా మద్యపానం సేవించే కనీస వయసు 21 ఏళ్ళు ఉండాలనే చట్టపరమైన నిబంధన విధిస్తే... అనేక ఆల్కహాలిక్ వ్యాధులవల్ల ఏర్పడే మరణాల సంఖ్య తగ్గించి, జీవించే సమయాన్ని పెంచవచ్చని అభిప్రాయం వ్యక్తంచేశారు. ముఖ్యంగా కాలేజీలకు వెళ్ళనివారికి ఈ నిబంధన వల్ల అధిక ప్రయోజనం ఉంటుందని అధ్యయనకారులు చెప్తున్నారు. అలాగే విద్యాలయ ప్రాంగణాల్లో 21 ఏళ్ళ వయసు లోపు ఉన్నవారిపై మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తే ఎంఎల్డీయే వల్ల కళాశాలలకు హాజరయ్యే విద్యార్థులకు సైతం లాభం చేకూరుతుందని భావిస్తున్న అధ్యయనకారులు తమ క్లినికల్ అండ్ ఎక్స్ పరిమెంటల్ పరిశోధనలను ఆల్కహాలిజం జర్నల్ లో నివేదించారు.