ట్విట్టర్, ఫేస్ బుక్ లో వదంతులకు మరణశిక్షే..!
ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తే ఏమవుతుందో తెలుసా.. ఇక్కడైతే ఏమో గానీ సౌదీ అరేబియాలో అయితే మాత్రం మరణశిక్ష విధిస్తారట. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వ వెబ్సైట్లో అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనలపై ఎన్నో ఆంక్షలు విధిస్తున్న సౌదీ సర్కారు తాజా ప్రకటన సామాన్య ప్రజల్లో ఆందోళన రేపుతోంది. ఈ ప్రకటన వెనుక.. మొత్తం సోషల్ మీడియానే ఆ దేశంలో నిషేధించాలన్న ప్రయత్నం కనిపిస్తోందని పలువురు అంటున్నారు.
కొత్తరాజు సల్మాన్ పాలనలో ఈ మరణ శిక్షల జోరు పెరిగిపోతోంది. సౌదీ రాజు కొత్త నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సంస్థలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల హజ్ యాత్రకు వెళ్లి తొక్కిసలాటలో వెయ్యిమంది వరకూ చనిపోవడం... దీనికి కారణం ప్రభుత్వ నిర్వహణ లోపమేనని సోషల్ మీడియాలో రావడంతో... ఆగ్రహానికి గురైన ప్రభత్వం ఈ కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటివరకు చిన్నపాటి తప్పులు చేసినవారికి.. ఖైదు, ప్రయాణ నిషేధం, గృహ నిర్బంధం వంటి శిక్షలు అమలులో ఉన్నాయని, ఇప్పుడు ఓ సామాజిక మాధ్యమంలో వదంతులు సృష్టించేవారికి మరణ శిక్ష విధించేందుకు నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి అని మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ చెప్తోంది. అయితే ఏ రకం వార్తలకు శిక్ష పడుతుందో స్పష్టంగా ధ్రువీకరించలేదని ఓ సీనియర్ న్యాయమూర్తి అంటున్నారు.
ఇప్పుడు అందరిలో ఆందోళన కలిగిస్తున్న కొత్త చట్టాన్ని కొన్ని వారాల క్రితం వచ్చిన సౌదీ రాజు ప్రకటించారు. 79 ఏళ్లు కొత్త రాజు సల్మాన్, అతడి కుమారుడు 30 ఏళ్ల మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రవేశ పెట్టిన ఈ ప్రకటనకు జనం నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. మాస్ మీడియాను సెన్సార్ చేయడం కోసం ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారంటూ విమర్శిస్తున్నారు.