చెడ్డ పేరు వస్తే.. మేం తలెత్తుకోలేం
ఒంగోలు కలెక్టరేట్ : ‘ప్రజలకు మంచినీటిని అందించాల్సిన బాధ్యత మనపై ఉంది. మీ దగ్గర పనులు సరిగా జరగడం లేదు. దొనకొండ మండలంలో మంచినీటి సమస్య ఉందని స్వయంగా నేను చెప్పినా మీ బుర్రకు ఎక్కలేదు. పది ట్రాక్టర్లు పెట్టించి నీటిని సరఫరా చేస్తున్నాను. జరిగిందేదో జరిగిపోయింది. ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. రేపు రిమార్క్స్ వస్తే మేం తలకాయ ఎత్తుకోలేం. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలకు సంబంధించి మినిట్ టు మినిట్ తెప్పించుకుంటున్నారు. నిధులు కావాలంటే తెప్పిస్తా. మీరు బాగా పనిచేయకపోతే మీకు, మాకు, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది’ అని ఆర్‌డబ్ల్యూస్ అధికారులను రాష్ట్ర రవాణా, రోడ్లు భవనాలశాఖ మంత్రి శిద్దా రాఘవరావు సున్నితంగా మందలించారు.
శుక్రవారం మధ్యాహ్నం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉందని, చాలామంది వడదెబ్బకు గురై మరణించారని మంత్రి చెప్పారు. అనేక హామీలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచామని, జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు సహకరించాలని కోరారు. ప్రభుత్వ పథకాలు, ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. మంచినీటి సమస్య గురించి చర్చించే సమయంలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ మూర్తి దర్శి నియోజకవర్గ పరిధిలోని వివరాలు అందిస్తుండగా తాను మంత్రిని, జిల్లాలోని 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని శిద్దా రాఘవరావు ఆదేశించారు.
‘నా నియోజకవర్గంలో బోర్‌వెల్స్ లేవు. సాగర్ నీరు విడుదల చేసినప్పుడు చెరువులు నింపరు. చెరువుల్లోకి నీరు వచ్చినా అక్కడి ఫిల్టర్ బెడ్ పనిచేయదు. మంచినీటి పథకాలకు నీరు తరలించరు. సరైన ప్రణాళిక లేదు. రివ్యూలో అడిగినప్పుడే సమస్యలపై బుర్ర పెడుతున్నారు. మీ వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది’ అని పర్చూరు శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారుల పనితీరును ఎండగట్టారు. కొండపి శాసనసభ్యుడు బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ కొన్ని పంచాయతీలకు పాలక వర్గాలు మారగానే ఉద్దేశపూర్వకంగా మంచినీటి పథకాలను మూలనపడేస్తున్నారని ఆరోపించారు.
వర్క్ ప్రోగ్రెస్ లేదు.. చేసిన ఖర్చు చూపలేదు : ఎమ్మెల్యే సురేష్
‘సంతనూతలపాడు అసెంబ్లీ నియోజకర్గ పరిధిలో చీమకుర్తి, అమ్మనబ్రోలులో చేపట్టిన మంచినీటి పథకాల నిర్మాణాల్లో ప్రోగ్రెస్ లేదు. ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారో లెక్కలు చూపలేదు. నాలుగు మండలాల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాలని కోరాను. అధికారులు దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు’ అని శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. సంతనూతలపాడులోని కొన్ని గ్రామాలను ఒంగోలు నగర పాలకసంస్థలో కలిపారని, వారికి మంచినీటిని అందించడం లేదన్నారు. ట్యాంకర్ల ద్వారా నీరు రవాణా చేయాలని ఎవరూ తనను అడగలేదని కమిషనర్ విజయలక్ష్మి సమాధానం చెప్పడంపై కలెక్టర్ విజయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి శిద్దా జోక్యం చేసుకుంటూ మంచినీటి సరఫరాపై ఒంగోలులో ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, ఎన్ని రోజులకు ఒకసారి నీరు విడుదల చేస్తున్నారని కమిషనర్‌ను అడిగితే విద్యుత్ కోతల కారణంగా సరిగా ఇవ్వడం లేదని ఆమె నీళ్లు నమిలారు. ఇలాగే ఉంటే పబ్లిక్‌లో డ్యామేజ్ అవుతామని, అవసరమైతే అదనంగా 15 ట్యాంకర్లను పెంచి నీరు సరఫరా చేయాలని మంత్రి ఆదేశించారు. చంద్రబాబునాయుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత బెల్ట్‌షాపులు తొలగిం పుపై సంతకం చేశారని, ఇప్పటికీ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అవి రన్ అవుతున్నాయని మంత్రి శిద్దా రాఘవరావు అసంతృప్తి వ్యక్తం చేశారు. నాగార్జునసాగర్ కాలువ నీటి విడుదల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎన్‌ఎస్‌పీ అధికారులకు మంత్రి శిద్దా సూచించారు. రిమ్స్ గురించి చర్చిస్తున్న సమయంలో మంత్రి మాట్లాడుతూ ఎక్కడ పడితే అక్కడ చెత్తతో మురికిమయంగా ఉందని, రూ.వందల కోట్లు ఖర్చుచేసినా పాతకాలం నాటి పరుపులు వేస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. క్లీన్‌గా ఉంటే రోగాలు తగ్గుతాయని రిమ్స్ డెరైక్టర్‌కు సూచించారు. విద్యాశాఖ, వైద్య ఆరోగ్యశాఖ, సంక్షేమశాఖల గురించి సమావేశంలో మంత్రి చర్చించారు.