
ముదురుతున్న వివాదం
మున్సిపల్ చైర్మన్, టీడీపీ కౌన్సిలర్ల మధ్య వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. 15 రోజులుగా చైర్మన్ వ్యవహారశైలి....
ప్రొద్దుటూరు టౌన్ : మున్సిపల్ చైర్మన్, టీడీపీ కౌన్సిలర్ల మధ్య వివాదం రోజు రోజుకూ ముదురుతోంది. 15 రోజులుగా చైర్మన్ వ్యవహారశైలి, ఆయన బావమరిది మున్సిపాలిటీలో చేస్తున్న పెత్తనంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న 11 మంది కౌన్సిలర్లు ఈ రోజు వరకు చైర్మన్‌తో మాట్లాడటంలేదు. చైర్మన్ కూడా ఆ కౌన్సిలర్లు ఎదురు పడినా పలుకరించే పరిస్థితి లేక పోవడంతో సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది.
చైర్మన్..ఆయన కోటరీగా ఉన్న మరో ముగ్గురు కౌన్సిలర్లతో చాంబర్ నుంచి పాలన కొనసాగిస్తుంటే అసమ్మతి కౌన్సిలర్లు పాత భవనంలోని చైర్మన్ చాంబర్ వద్ద ఉండి స్పందిస్తున్నారు. ఆయా వార్డుల ప్రజలు ఏ సమస్యపై వచ్చినా నేరుగా కమిషనర్ వద్దకు వెళ్లి మాట్లాడి సమస్యలను పరిష్కరించు కోవడం తప్ప చైర్మన్ చాంబర్ వద్దకు వెళ్లడంకానీ, చైర్మన్ దృష్టికి సమస్యలు తీసుకెళ్లడం కానీ చేయడంలేదు.
ఈ దశలో చైర్మన్ వర్గీయులు 11 మంది కౌన్సిలర్ల కదలికలపై ఎప్పటి కప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. కమిషనర్ వద్ద ఏం మాట్లాడింది.. ఎవరెవరు వస్తున్నారన్న విషయాన్ని కూడా ఎప్పటి కప్పుడు ఓ డ్రైవర్ ద్వారా తెలుసుకుంటూ తమదైన శైలిలో వ్యవహరిస్తున్నట్లు సమాచారం. గత రెండు వారాలుగా ఏ కార్యక్రమంలో కూడా అసమ్మతి కౌన్సిలర్లు పాల్గొనడం లేదు.
ఫలించని పెద్దాయన పంచాంగం...
ఇటీవల అసమ్మతి కౌన్సిలర్లు పెద్దాయన వద్దకు వెళ్లి పంచాయతీ పెట్టారు. తమకు ఎలాంటి ప్రాధాన్యతను చైర్మన్ ఇవ్వడం లేదని, ఆయన బావమరిదే అంతా తానై వ్యవహరిస్తున్న విషయాన్ని కూడా తెలియచేశారు. అక్కడ కూడా అసమ్మతి కౌన్సిలర్లకు ఎదురుగాలే వీచినట్లు సమాచారం. అసమ్మతి వర్గంలో కొందరు జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి, పోట్లదుర్తి నాయకుల వర్గీయులుగా ఉండటమే ఇందుకు కారణంగా చర్చించుకుంటున్నారు.
అవినీతి ఆరోపణలు చేయడం దారుణం..
ఒకే పార్టీలో ఉంటూ, తాము ఓటు వేసి గెలిపిస్తే చైర్మన్ సీటులో కూర్చున్న వ్యక్తి ఈ రోజు తమపై అవినీతి ఆరోపణలు చేయడం దారుణమని అసమస్మతి కౌన్సిలర్లు వాదిస్తున్నారు. కౌన్సిలర్లుగా ఎన్నికై ఏడు నెలలు కూడా గడవక ముందే, మున్సిపాలిటీలో ఏ ఒక్కరూపాయి పని కూడా మొదలు కాక ముందే పరిస్థితి ఈ విధంగా ఉంటే మునుముందు మనుగడ కష్టమేనని కౌన్సిలర్లు చర్చించుకుంటున్నారు.
ఆత్మగౌరవం కాపాడుకునేందుకు రాజీనామాలకైనా సిద్ధం...
ఆత్మగౌరవం కాపాడుకునేందుకు కొందరు అసమ్మతి కౌన్సిలర్లు రాజీనామాలకైనా సిద్ధం అన్నట్లు ఉన్నారు. వార్డుల్లో ప్రజలతో తమకున్న పరిచయాలు, గతంలో తాము ప్రజలకు చేసిన సేవను చూసి ఓట్లు వేశారేతప్ప చైర్మన్‌నో, మరొకరినో చూసి కాదన్నది అసమ్మతి కౌన్సిలర్ల నుంచి వినిపిస్తున్న వాదన.