హరిత అమరావతి.. ఆంధ్రుల రాజధాని | singapore team set up the capital amaravathi | Sakshi
Sakshi News home page

హరిత అమరావతి.. ఆంధ్రుల రాజధాని

Published Mon, May 25 2015 9:37 PM | Last Updated on Wed, May 29 2019 3:19 PM

హరిత అమరావతి.. ఆంధ్రుల రాజధాని - Sakshi

హరిత అమరావతి.. ఆంధ్రుల రాజధాని

రాజధాని నగర మహా ప్రణాళికను అందించిన సింగపూర్ ప్రభుత్వం
సువిశాలమైన రహదారులు.. ఆ రోడ్ల వెంటే హరితవనాలు.. అంతర్గత జలమార్గాలు.. సైకిల్‌పై వెళ్లడానికి, నడిచి వెళ్లడానికి ప్రత్యేక మార్గాలు.. జనావాసాలకు అతి సమీపంలోనే వాణిజ్య సముదాయాలు, విద్యాలయాలు.. 24 గంటలూ విద్యుత్ సరఫరా చేయడానికి ప్రత్యేకమైన గ్రిడ్.. నీటి సరఫరా.. మచిలీపట్నం, నిజాంపట్నం నౌకాశ్రయాల సమీపంలో పరిశ్రమలను ఏర్పాటుచేసేలా రాజధాని మహా ప్రణాళిక (కేపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్)ను సింగపూర్ ప్రభుత్వం రూపొంచింది.

ఇప్పటికే రాజధాని ప్రాంత మహా ప్రణాళిక (కేపిటల్ రీజియన్ మాస్టర్ ప్లాన్)ను సింగపూర్ ప్రభుత్వం రాష్ట్ర సర్కారుకు అందించిన విషయం విదితమే. కేపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ దేశ రక్షణ, వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి ఎస్.ఈశ్వరన్‌ సోమవారం హైదరాబాద్‌లో సచివాలయంలో కేపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అందించారు. కేపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్‌కు చెందిన సుర్బానా ఇంటర్నేషనల్ కన్సల్టెన్సీ సంస్థ రూపొందించింది.

అంతర్జాతీయ ప్రమాణాల మేరకు మౌలిక సదుపాయాల కల్పనకు మాస్టర్ ప్లాన్‌ను పెద్దపీట వేసింది. ఈ ప్లాన్‌లో రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ) పరిధిలోని ప్రాంతాన్ని ఎనిమిది ప్రణాళిక ప్రాంతాలుగా విభజించింది. ఇందులో రాజధాని నగరం కలిసి ఉండే ప్రాంతాన్ని కేంద్ర ప్రణాళిక ప్రాంతంగా ప్రతిపాదించింది. కేంద్ర ప్రణాళిక ప్రాంతం 854 చకిమీల్లో అంటే.. 2,11,028 ఎకరాల్లో విస్తరించి ఉండాలని సూచించింది. ఇందులో రాజధాని నగరం 217 చకిమీల్లో అంటే 53,621 ఎకరాల్లో నిర్మించాలని పేర్కొంది. కేపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ వివరాలను సుర్బానా ఇంటర్నేషనల్ కన్సెల్టెన్సీ సీఈవో పాంగ్ యీ యాన్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

వాస్తుకు పెద్దపీట
కేపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్‌లో వాస్తుకు పెద్దపీట వేశారు. రాజధాని నగరంలో కృష్ణా నదికి అభిముఖంగా.. ఈశాన్యం వైపున త్రిభుజకారంలో కొంత ప్రాంతాన్ని ఖాళీగా ఉంచాలని ప్రతిపాదించింది. దీన్నే ‘బ్రహ్మస్థానం’గా పేర్కొంది. వాస్తు ప్రకారం బ్రహ్మస్థానం ఏర్పాటు చేయడం వల్ల నగరం శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని అంచనా వేసింది.

సు‘జలాం'
కొండవీటి వాగు, కృష్ణా నదులపై చిన్న చిన్న రిజర్వాయర్లను నిర్మించి.. నిత్యం ఐదు టీఎంసీల జలాలను నిల్వ ఉంచాలని సూచించింది. రాజధాని నగర తాగునీటి, పారిశ్రామిక అవసరాలకు ఈ జలాలు సరిపోతాయని పేర్కొంది.

ట్రా‘ఫికర్’కు చెక్
రాజధాని నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా రహదారులను నిర్మించాలని ప్రతిపాదించింది. ఇందుకు ఇబ్రహీంపట్నం నుంచి హైదరాబాద్, వైజాగ్ నుంచి చెన్నై వెళ్లే మార్గాలను ఎక్స్‌ప్రెస్ మార్గాలుగా అభివృద్ధి చేయాలని పేర్కొంది. రాజధాని చుట్టూ మంగళగిరి, తాడేపల్లి, విజయవాడలను కలుపుతూ.. అలానే మధ్యలోనూ 155 కిమీల మేర ప్రధాన రహదారులను నిర్మించాలని సూచించింది. ఎక్స్‌ప్రెస్ వేలు, జాతీయ రహదారులు, ప్రధాన రహదారులను అనుసంధానం చేస్తూ 332 కిమీల మేర ఉప ప్రధాన రహదారులను నిర్మించాలని ప్రతిపాదించింది. రాజధాని నగరంలో 324 కిమీల పొడవును అంతర్గత రహదారులను నిర్మించాల్సి ఉంటుందని అంచనా వేసింది.

నడక, సైకిల్ మార్గాలు
నడక, సైకిల్ మార్గాలను ప్రత్యేకంగా ఏర్పాటుచేస్తే కాలుష్యానికి అడ్టుకట్ట వేయవచ్చునని సూచించింది. జనావాసాలకు సమీపంలోనే అంటే.. ప్రజలు నడిచి వెళ్లడానికిగానీ సైకిల్‌పై వెళ్లడానికిగానీ సౌకర్యంగా ఉండేలా విద్యాలయాలు, వాణిజ్య సముదాయాలు, ఆసుపత్రులు నిర్మించడం వల్ల కాలుష్యంతోపాటూ ట్రాఫిక్ సమస్యను అధిగమించవచ్చునని అభిప్రాయపడింది. ఆ మేరకు 150 కిమీల మేర సైకిల్ మార్గం, 170 కిమీల పొడవున నడక మార్గంను ప్రత్యేకంగా ఏర్పాటుచేయాలని ప్రతిపాదించింది.

మెట్రో రైలు వ్యవస్థ
విజయవాడ, తాడేపల్లి, మంగళగిరి, ఇబ్రహీంపట్నం, ఉండవల్లి, నీరుకొండ, అనంతవరంలను రాజధాని అమరావతితో కలుపుతూ మెట్రో రైలు మార్గాన్ని 135 కిమీల పొడవున ఏర్పాటుచేయాలని ప్రతిపాదించింది. మంగళగిరికి సమీపంలో ట్రాన్స్‌పోర్ట్ హబ్‌ను ఏర్పాటుచేయాలని సూచించింది.

జలమార్గం:
కొండవీటివాగు, కృష్ణా నదుల్లో నిత్యం నీళ్లు ఉండేలా రిజర్వాయర్లు నిర్మించి.. జల మార్గాలను అభివృద్ధి చేయవచ్చునని ప్రతిపాదించింది. సుమారు 80 కిమీల పొడవున అంతర్గత జలమార్గం ఏర్పాటుచేయడం ద్వారా కాలుష్యానికి అడ్డుకట్ట వేయడంతోపాటూ పర్యాటకులను ఆకట్టుకోవచ్చునని సూచించింది.

అంతర్జాతీయ విమానాశ్రయం
రాజధాని నగరంలో.. మంగళగిరికి సమీపంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటుచేయాలని సూచించింది. ఇందుకు కనీసం ఐదు వేల ఎకరాల భూమిని కేటాయించాలని పేర్కొంది. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాజధాని నగరం అమరావతి, విజయవాడ, ప్రధాన రహదారులను అనుసంధానం చేస్తూ ప్రత్యేక మార్గాలను నిర్మించాలని ప్రతిపాదించింది.

హరితవనం
అమరావతిని హరితవనంగా తీర్చిదిద్దాలని ప్రతిపాదించింది. రోడ్ల వెంట హరితవనాలు ఏర్పాటుచేయడం ద్వారా కాలుష్యానికి అడ్డుకట్ట వేయడంతోపాటూ పర్యావరణ సమతౌల్యాన్ని సాధించవచ్చునని అభిప్రాయపడింది. ప్రధాన రహదారులు వెంట 200 కిమీల మేర హరితవనాలను ఏర్పాటుచేయాలని పేర్కొంది. హరితవనాలకు అనుసంధానంగా పౌర ఉద్యానవనం(సివిక్ పార్క్), కేంద్ర ఉద్యానవనం(సెంట్రల్ పార్క్), నిడుముక్కల ప్రాంతంలో కెనాల్ పార్క్, గోల్ఫ్ కోర్సు, అంతర్జాతీయ విశ్వవిద్యాలయం(ఇంటర్నేషనల్ యూనివర్శిటీ) క్రికెట్ స్టేడియంను నిర్మించాలని సూచించింది.

జలమార్గం
రాజధాని నగరానికి అభిముఖంగా అమరావతి నుంచి విజయవాడ వరకూ 35 కిమీల పొడవున కృష్ణా నది ప్రవహిస్తుంది. కృష్ణా నది జలవిస్తరణ ప్రాంతం మూడు వేల హెక్టార్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో 2,800 హెక్టార్లలో ద్వీపాలు విస్తరించి ఉన్నాయి. వాటిలో వెయ్యి హెక్టార్లలో విస్తరించిన ద్వీపాలను పర్యాటకులను ఆకట్టుకునేలా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. ద్వీపాలను అభివృద్ధి చేసి రిసార్ట్స్ ఏర్పాటుచేయాలని సూచించింది.

పారిశ్రామికం
మచిలీపట్నం, నిజాంపట్నం(వాన్‌పీక్)లో నౌకాశ్రయాలను ఏర్పాటుచేయాలని ప్రతిపాదించింది. ఈ నౌకాశ్రయాలకు సమీపంలోనే పారిశ్రామిక నగరాలను అభివృద్ధి చేయాలని పేర్కొంది. నౌకాశ్రయాలు, పారిశ్రామిక నగరాలను జాతీయ ప్రధాన రహదారులు, అమరావతిని అనుసంధానం చేస్తూ ప్రత్యేక రహదారులు నిర్మించాలని సూచించింది.

పర్యాటకం
రాజధాని చుట్టూ చరిత్ర ప్రసిద్ధికెక్కిన ప్రాంతాలు, అధ్యాత్మిక కేంద్రాలను అభివృద్ధి చేస్తే పర్యాటకులను భారీ ఎత్తున ఆకట్టుకోవచ్చునని ప్రతిపాదించింది. విజయవాడ కనకదుర్గ ఆలయం, భవానీ ద్వీపం, ఉండవల్లి గుహలు, మంగళగిరి ఆలయం, నీరుకొండ, అనంతవరం ఆలయాలు.. అమరావతి భౌద్దారామాలను అనుసంధానం చేస్తూ 145 కిమీల పొడవున మెట్రో రైలు, 45 కిమీల పొడవున జలమార్గాలు, 61 కిమీల మేర రహదారులను నిర్మించాలని ప్రతిపాదించింది. ఇది పర్యాటకులను ఆకట్టుకోవడానికి దోహదం చేస్తుందని అంచనా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement