కారేపల్లి, న్యూస్‌లైన్ : గ్రామాభివృద్ధి కోసం స్థానికులు ఆందోళన బాట పట్టారు. సింగరేణి నుంచి తమకు రావాల్సిన సెస్, షేప్ నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా.. వారు స్పందించకపోవడంతో ఆగ్రహించిన గ్రామస్తులు తహశీల్దార్, ఎంపీడీవోలను నిర్బంధించారు. వివరాలిలా ఉన్నాయి... సింగరేణి నుంచి రావాల్సిన సెస్, షేప్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణి సాధన కమిటీ ఆధ్వర్యంలో కారేపల్లి గ్రామస్తులు, అఖిలపక్ష నాయకులు శుక్రవారం తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను ముట్టడించారు. తహశీల్దార్ మంకెన రజని, ఎంపీడీఓ పి.అల్బర్ట్‌లను కార్యాలయంలోకి వెళ్లకుండా నిర్బంధించారు.
ఈ క్రమంలో తోపులాట జరగగా, తహశీల్దార్ ఆందోళనకారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమ గ్రామంలోనే సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించాలని, దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ నుంచి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు అధికారులను వదిలేదని లేదని స్పష్టం చేశారు. దీంతో రెండు కార్యాలయాల్లోని పనులన్నీ స్తంభించాయి.
విషయం తెలుసుకున్న ఇల్లెందు రూరల్ సీఐ పి.రవీందర్‌రెడ్డి అక్కడికి చేరుకొని ఆందోళనకారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా.. వారు వినలేదు. ఈ క్రమంలో తహశీల్దార్ రజిని కార్యాలయం వెనుక భాగం నుంచి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా మహిళలు ఆమెను అడ్డుకున్నారు. సీఐ వారిని వారిస్తుండగా ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అఖిలపక్షం నాయకుడు తురక నారాయణ చొక్కాను సీఐ పట్టుకోవడంతో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది. కొందరు విద్యార్థులు మండల కార్యాలయాల భవనాల పెకైక్కి సీఐ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు.
ఆందోళనలో భాగంగా గ్రామస్తులు కార్యాలయాల వద్దే వంటా-వార్పు నిర్వహించారు. స్థానిక కళాకారుడు ఆదెర్ల శంకర్‌రావు సింగరేణి పుట్టినిల్లుపై పాట పాడి అందరినీ అలరించగా, డప్పు దరువులతో గిరిజన మహిళలు నృత్యం చేశారు.
సర్పంచ్‌పై ఆర్డీవో ఆగ్రహం...
సాయంత్రం 5 గంటల వరకూ అధికారులను విడిచిపెట్టలేదనే విషయం తెలుసుకున్న కొత్తగూడెం ఆర్డీవో అమయ్‌కుమార్ తహశీల్దార్ రజినికి ఫోన్ చేశారు. దీంతో ఆమె గ్రామ సర్పంచ్ మండెపూడి రాణిని ఆర్డీవోతో మాట్లాడించగా, సర్పంచ్ పరిస్థితి వివరించారు. అయితే ఈ నెల 28న కలెక్టర్ సమక్షంలో చర్చలు జరుపుదామని, ఆందోళన విరమించాలని ఆర్డీవో సూచించడంతో ఇదే విషయాన్ని గ్రామానికి వచ్చి ప్రజల సమక్షంలో హామీ ఇవ్వాలని సర్పంచ్ కోరారు. దీంతో ఆగ్రహించిన ఆర్డీవో.. అసలు సింగరేణి నిధులు ఎక్కడివని ప్రశ్నించారు. తమ గ్రామం పేరు సంస్థకు పెట్టుకుని, నిధులు ఎక్కడివని మాట్లాడడం భావ్యం కాదని, ఇంతటితో ఈ ఉద్యమాన్ని ఆపేది లేదని సర్పంచ్ ఆర్డీఓ దృష్టికి తెచ్చారు. శనివారం సింగరేణి గ్రామంలో అఖిల పక్షం ఆధ్వర్యంలో బంద్ నిర్వహిస్తామని, దీంతో పాటు ప్రభుత్వ కార్యకలాపాలను స్తంభింపజేస్తామని హెచ్చరిస్తూ ఆందోళన విరమించారు.
నిధుల కోసం నిర్బంధం
Published Sat, Dec 21 2013 4:45 AM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement
Advertisement