ఖాకీల హల్‌చల్
- అనంతసాగర్‌లోని పలువురి ఇళ్లలో తనిఖీలు
- ఆందోళనలో గ్రామస్తులు
- పోలీసుల తీరుపై ఆగ్రహం
కొండాపూర్, న్యూస్‌లైన్: మండల పరిధిలోని అనంతసాగర్‌లో పోలీసులు హల్‌చల్ చేశారు. బుధవారం డీఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సుమారు 30 మంది పోలీసులు ఒక్కసారిగా గ్రామంలో హడావుడి చేశారు. పలువురి ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. దీంతో స్థానికులంతా భయాందోళనలు చెందారు. ఇప్పటికే సీఐడీ పోలీసుల మం టూ పలువురు గ్రామంలోని తనిఖీలు చేపట్టడం... తాజాగా పోలీసులు కూడా వారిలాగే తనిఖీలు చేపట్టడంతో అసలు ఏం జరుగుతుందో తెలియక గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. కనీసం ఎందుకు తనిఖీలు చేపడుతున్నారో కూడా పోలీసులు చెప్పకపోవడంతో వా రు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా రోజుకొకరు వచ్చి గ్రామంలోని పలు ఇళ్లను తవ్వేస్తుంటే ఏం చేయాలో...ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని పలువురు వాపోతున్నారు.
వారంరోజులుగా తనిఖీల పరంపర
ఈ నెల 1వ తేదీన 25 మంది వ్యక్తులు పోలీసు యూనిఫాం, సివిల్ దుస్తులు ధరించి స్కార్పియో వాహనాల్లో గ్రామానికి వచ్చారు. తాము సిఐడీ పోలీసులమని గ్రామస్థులకు చెప్పారు. ఓ కేసు విషయంలో విచారణ జరుపుతున్నామంటూ గ్రామానికి చెందిన సోమేశ్వర్ పాడుపడ్డ ఇంటి తలుపులు బద్దలుకొట్టి ఆ ఇంట్లోని దేవుడిగదిలో తవ్వకాలు జరిపారు. తిరిగి మంగళవారం రాత్రి రెండు స్కార్పియో వాహనాల్లో వచ్చిన పలువురు వ్యక్తులు తాము సీఐడీ పోలీసులమంటూ మళ్లీ సోమేశ్వర్ ఇంటికే వచ్చారు.
ఇక్కడ తవ్వకాలు జరిపేందుకు సిద్ధంకాగా అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అనంతసాగర్ చేరుకున్న ఎస్‌ఐ చంద్రయ్య ఆరుగురిని అరెస్టు చేయగా, మరికొందరు పరారయ్యారు. తన అదుపులో ఉన్న వారికి స్టేషన్‌కు తరలించిన ఎస్‌ఐ విచారణ చేపట్టారు. ఇదిలాఉండగా, బుధవారం ఉదయం డీఎస్పీతో పాటు మరికొంత మంది పోలీసులు తహశీల్దారు గీత, గ్రామంలోని మటం మల్లేశం, అశోక్, ఇంద్రారెడ్డి, సోమేశ్వర్‌ల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు.
అయితే ఎందుకు తనిఖీలు చేస్తున్నారో కూడా చెప్పకపోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఓ దశలో పోలీసులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రింబవళ్లు ఇలా ఎవరో ఒకరు వచ్చి తనిఖీలంటూ తమను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదన్నారు. పోలీసులు వెంటనే ఇక్కడ పికెటింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
తహశీల్దారు ఎదుట బైండోవర్
తమ అదుపులో ఉన్న హైదరాబాద్‌కు చెందిన హరిబాబు, విజయ్‌కుమార్, కోల్కుంద నరేశ్, వినయ్‌మీర్ బాబు, గడ్డపల్లి శేఖర్, రాజ్‌కుమార్ నాయక్‌లను విచారించి బైండోవర్ చేసినట్లు ఎస్‌ఐ చంద్రయ్య తెలిపారు. కూలీ పనులు చేసుకోడానికి తాము గ్రామానికి వచ్చినట్లు విచారణలో వారు చెప్పారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.