- డాక్టర్‌ను బట్టి రోగానికి చికిత్స మారకూడదు
- మార్గదర్శకాలపై 32 మంది వైద్యులతో కమిటీ
ఇక ఒక రోగానికి ఒకే రకమైన చికిత్స
Published Mon, Mar 10 2014 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 AM
సాక్షి, హైదరాబాద్: చిన్న రోగమైనా సరే.. ఇద్దరు వైద్యులు చేసే చికిత్స మధ్య చాలా తేడా ఉంటోంది. చిన్నదైనా, పెద్దదైనా ఒకే రకమైన జబ్బుకు ఒక వైద్యుడు అందించే చికిత్సకు, మరొకరు చేసే చికిత్సకు మధ్య పొంతన ఉండదు. పైగా.. మారుతున్న పరిస్థితులతో కొత్త రకాల జబ్బులు అనేకం పుట్టుకొస్తున్నాయి. వైద్యులు అందిస్తున్న వైద్యానికి ఎలాంటి ప్రామాణికతా ఉండటం లేదు. రకరకాల చికిత్సల కారణంగా రోగికి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి, తీవ్ర నష్టం జరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇకపై ఇటువంటి పరిస్థితి ఉండకూడదని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఒకే రకమైన జబ్బుకు ఏ ఆస్పత్రిలోనైనా, డాక్టరెవరైనా ఒకే రకమైన వైద్యం అందించడం, ముఖ్యంగా ప్రభుత్వాస్పత్రుల్లో ఏకరీతి వైద్యం లక్ష్యంగా మార్గదర్శకాలను రూపొందించే పనిలో పడింది. దీనిపై అధ్యయనానికి వివిధ ప్రభుత్వ ఆస్పత్రులు, నిమ్స్‌కు చెందిన 32 మంది వైద్య నిపుణులతో ఇటీవల ఓ కమిటీని నియమించింది. అధ్యయనాన్ని పర్యవేక్షించడానికి డీఎంఈ (అకడెమిక్) డాక్టర్ వెంకటేష్, ఉస్మానియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.శ్రీనివాస్, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్‌లు సభ్యులుగా కమిటీని కూడా నియమించారు. నిపుణుల కమిటీ రెండు నెలల్లో అధ్యయనం చేసి, మార్గదర్శకాలను రూపొందిస్తుందని అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి, బోధనాసుపత్రి వరకూ మలేరియా, డెంగీ, టైఫాయిడ్ తదితర దోమకాటు వల్ల వచ్చే జబ్బులతో పాటు జీవనశైలి కారణంగా వచ్చే గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం వంటి పలు రకాల జబ్బులకు అందించే వైద్య పద్ధతులపై అధ్యయనం చేసి ఒకే రకమైన చికిత్సలను ప్రవేశపెట్టనున్నారు. 2008లో ఒకసారి కేవలం బోధనాసుపత్రుల్లో ఏకతరహా వైద్య చికిత్సలపై మార్గదర్శకాలు ఇచ్చారు. ఇప్పుడు పీహెచ్‌సీ నుంచి బోధనాసుపత్రుల వరకూ అధ్యయనం చేస్తున్నారు. సుమారు 200 జబ్బులపై అధ్యయనం చేసి, వాటికి ఎలాంటి చికిత్స అందించాలో విధివిధానాలను రూపొందించనున్నారు. దీనికోసం ఇప్పటికే రాజస్థాన్, తమిళనాడుల్లో అనుసరిస్తున్న పద్ధతులనూ పరిశీలించారు. అన్నీ అధ్యయనం చేశాక 400 పేజీల బుక్‌లెట్‌ను తయారు చేసి అన్ని ప్రభుత్వాస్పత్రులకు అందజేస్తారు. ఇందులో ఉన్న మార్గదర్శకాలను అనుసరించే చికిత్స చేయాల్సి ఉంటుంది.
Advertisement
Advertisement