రూ.13 కోట్ల ఎత్తిపోత
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో అసలేం జరిగింది? ఆరుగురు ఇంజనీర్ల సస్పెన్షన్‌కు దారితీసిన కారణాలేమిటి? అనేది ఆసక్తి రేపుతోంది. పంపులు, మోటార్ల సరఫరాలో భారీగా అవకతవకలు జరిగినట్లు సాక్షాత్తూ ఇరిగేషన్ విభాగం ధ్రువీకరించటంతో పాటు ఇద్దరు ఈఈలు, ఇద్దరు డీఈఈలు, ఇద్దరు ఏఈలపై సస్పెన్షన్ వేటు వేయటం కలకలం రేపింది. అందుకు సంబంధించినవివరాలు ఆరా తీస్తే పంపులు, మోటార్ల కొనుగోలులో అధికారులు లెక్కకు మించి తప్పులు చేసినట్లు తెలిసింది. - సాక్షి ప్రతినిధి, కరీంనగర్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మహదేవపూర్, కాటారం, మహాముత్తారం, మల్హర్ మండలాల్లోని 45 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నారు. గోదావరిపై కన్నెపల్లి వద్ద ఇన్‌టెక్ వెల్ నుంచి 4.5 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసేందుకు వీలుగా ప్రాజెక్టు డిజైన్ చేశారు. రెండు పంప్ హౌజ్‌లతో పాటు 14 చెర్వులు, కుంటలను రిజర్వాయర్లుగా ఆధునికీకరించి ఆయకట్టుకు సాగునీటిని అందించాల్సి ఉంది. రూ.637 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో ఇప్పటివరకు రూ. 300 కోట్ల పనులు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగానే మహదేవపూర్ మండలం బీరాసాగర్ వద్ద చేపట్టిన పంపుహౌస్ నిర్మాణ దశలో ఉంది. పంపుహౌస్‌లో అమర్చేందుకు 2000 హెచ్‌పీ నుంచి 3000 హెచ్‌పీ వరకు వివిధ సామర్థ్యం ఉన్న భారీ మోటార్లు, పంపులను ఎనిమిది నెలల కిందట ఆర్డర్ ఇచ్చారు. కానీ ఈ పంపులు, మోటార్లు సరఫరా కాకముందే ఇంజనీరింగ్ అధికారులు రూ.13 కోట్లు బిల్లులు చెల్లించారు. ఈ డబ్బులు చెల్లించి ఎనిమిది నెలలు కావస్తున్నా ఇప్పటికీ పంపులు, మోటార్లు ప్రాజెక్టు నిర్మాణ స్థలానికి చేరలేదు.
నిబంధనల ప్రకారం పంపులు, మోటార్లు సరఫరా అయ్యాక.. అవి రన్నింగ్ కండిషన్‌లో ఉన్నాయో లేదో చెక్ చేసుకున్నాక.. బిల్లులు చెల్లించాల్సి ఉంది. కానీ ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు ఈ నిబంధనలన్నీ ఉల్లంఘించారు. కంపెనీపై ఉన్న ప్రేమనో, కమీషన్లకు తొందర పడ్డారో అర్థం కాకపోయినా ఆగమేఘాలపై రికార్డులు తయారు చేశారు. పంపులు, మోటార్లు సరఫరా అయినట్లు తప్పుడు రికార్డు చేసి, ఏఈ మొదలు సీఈ వరకు సంతకాలు చేసి, ఈ ఫైలుకు ఉరుకులు పరుగులు పెట్టించారు. రూ.13 కోట్లు ముందుగానే ముట్టజెప్పారు. తీరా ఈఎన్‌సీ విచారణలో పంపులు సరఫరా కాకముందే బిల్లులు చెల్లించిన వాస్తవం బయటపడింది. అందుకే ప్రాథమిక విచారణలో బాధ్యులుగా గుర్తించిన ఏఈలు, డీఈఈలు, ఈఈలపై సస్పెన్షన్ వేటు వేశారు. బిల్లు చెల్లించాలని సంతకాలు చేసిన ఎస్‌ఈ, సీఈలు సైతం ఇందులో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. అందుకే వారిపై కూడా శాఖాపరమైన చర్యలుంటాయని ఉన్నతాధికార వర్గాలు వెల్లడించాయి.