- ఎర్రచందనం స్మగ్లర్లందరినీ ఏరేస్తాం
- పింఛన్ల విషయంలో రాద్ధాంతం తగదు
- మాట వినని అధికారులను మార్చేస్తాం
- టీడీపీ సమావేశంలో మంత్రి బొజ్జల
చిత్తూరు(సిటీ): రాష్ట్రంలోని అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ వర్తింపజేస్తామని రాష్ట్ర అటవీ, సహకారశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చెప్పారు. గురువారం ఇక్కడి టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ సర్వసభ్య సమావేశం సీనియర్ నాయకుడు ముద్దుకృష్ణమనాయుడి అధ్యక్షతన నిర్వహించారు. రుణమాఫీ విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని, అంతా మేలు జరుగుతుందని మంత్రి చెప్పారు. డ్వాక్రా రుణాలకు సంబంధించి గ్రూపునకు వర్తింపజేయాలా, సభ్యులవారీగా వర్తింపజేయాలా అనే అంశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు.
పింఛన్ల విషయంలో కొంతమంది రాజకీయం చేస్తున్నారని, అలా చేయడం తగదని చెప్పారు. భర్తలు ఉన్నవారు, వృద్ధులు కాని వారు పింఛన్లు తీసుకుంటున్నారని, అలాంటి వాటిని రద్దు చేసేందుకే సర్వే చేస్తున్నారని తెలిపారు. ఎర్రచందనం స్మగ్లర్లందరినీ ఏరిపారేస్తామన్నారు. గత 100 రోజుల పాలనలో ఏమీ చేయలేదనే అపోహలో అందరూ ఉన్నారని, అలాంటివేమి పెట్టుకోవద్దని చెప్పారు. ఇకపై అంతా మంచే జరుగుతుందని, పార్టీ నాయకులు, కార్యకర్తల మాటలను ఖాతరు చేయని అధికారులను తప్పక బదిలీ చేస్తామని స్పష్టం చేశారు.
మద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ మెజారిటీ వచ్చే గ్రామాల్లోనే పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. చిత్తూరు ఎమ్మేల్యే డీఏ సత్యప్రభ మాట్లాడుతూ సీఎం సహకారంతో చిత్తూరు నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బీఎన్ రాజసింహులు మాట్లాడుతూ వచ్చే నెల 15 తరువాత పార్టీకి కొత్త అడహాక్ కమిటీలను ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదు చేస్తామని వెల్లడించారు. జెడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి, నగర మేయర్ కఠారి అనురాధ తదితరులు ప్రసంగించారు.
ఉద్యానపంటలకూ రుణమాఫీ చేయాల్సిందే
- తంబళ్లపల్లె నియోజకవ ర్గ తమ్ముళ్లు
ఉద్యానపంటలకూ రుణమాఫీ చేయాల్సిందేనని తంబళ్లపల్లె నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లు సమావేశంలో పట్టుబట్టారు. 100 రోజులుగా రుణమాఫీపై కాలయాపన చేస్తున్నందున కార్యకర్తలతో పాటు, రైతులు మనోవేదనకు గురవుతున్నారని మండిపడ్డారు. మంత్రి కలగజేసుకుని అధికార పార్టీలో ఉంటూ సీఎం ప్రకటనలకు మద్దతు పలకకుండా, వ్యతిరేకంగా మాట్లాడటం తగదని వారిని వారించారు. మంత్రి ఎంత చెప్పినా వినకుండా రుణమాఫీ, పింఛన్ల విషయంపై కార్యకర్తలు నిలదీస్తుండటంతో సమావేశ మందిరం వద్ద గందరగోళం నెలకొంది. దీంతో చేసేదిలేక సమావేశాన్ని అర్ధంతరంగా ముగించారు.