
పాము కాటుకు...ముందు జాగ్రత్తే మందు
సాలూరు: వర్షాలు విస్తారంగా కురుస్తున్న సమయంలో అన్నదాతలే కాదు విష సర్పాలు కూడా పొలాల్లో ఎక్కువగా సంచరిస్తాయి. గడ్డిమేటల వద్ద, తుప్పల్లోనూ ఇవి తలదాచుకుంటాయి. ఆదమరిచి వాటిని కదిలిస్తే రైతు ప్రాణానికే ప్రమాదం. అందుకే రైతులు ముందు జాగ్రత్త తీసుకోవడం తప్పనిసరి.
కాటేస్తే ఏం చేయాలి..?
పాముకాటుకు గురైన వెంటనే పక్కన ఉన్న వారి సహకారంతో కాటు వేసిన చోటుకు పైభాగాన తాడుతో గానీ, వస్త్రంతో గానీ గట్టిగా కట్టి బిగించాలి.
బాధితులను కంగారు పెట్టకూడదు.
ఎంత తొందరగా వైద్యుని వద్దకు తీసుకువెళితే అంత మంచిది.
సొంత వైద్యం, నాటు వైద్యం మంచిది కాదు.
ప్రతి పది నిమిషాలకు కట్టును వదులు చేస్తూ ఉండాలి.
భయంతోనే...
ట పాము కాటుకు గురైన వారిలో అధిక శాతం మంది ఆందోళనకు గురి కావడం వల్లనే చనిపోతున్నారని వైద్యులు చెబుతున్నారు.
పాము కాటుకు గురైన వ్యక్తికి పక్కనే ఉండి ధైర్యం చెప్పడం ఎంతో అవసరం.
బాధితుడు ఒత్తిడికి గురి కాకుండా చూసుకోవాలి.
బాధితుడి వద్ద నానా రాద్దాంతం చేస్తే రక్త ప్రసరణ పెరిగి విషం ఇంకా వేగంగా పాకే అవకాశం ఉంటుంది.
కరిచింది విష సర్పమైతే...
విష సర్పాలు రెండు రకాలుగా మానవ శరీరంపై ప్రభావం చూపుతాయి.
నరాలపై ప్రభావం చూపే విషాన్ని న్యూరో టాక్సిస్ పాయిజన్ అని అంటారు.
ఈ తరహా విషం కోబ్రా జాతికి చెందిన నాగుపాము తదితర పాముల్లో ఉంటుంది.
అలాగే నేరుగా రక్తం, గుండెపై ప్రభావం చూపే విషం కలిగిన పాములు కూడా ఉంటాయి.
వీటిలో ఉన్న విషాన్ని కార్డియో టాక్సిస్ పాయిజన్‌గా పిలుస్తారు. ఇది పొడపాము, ఉల్లిపాముల్లో ఉంటుంది.
ఒక్కోసారి కరిచింది విష సర్పమో, సాధారణమైనదో తెలిసే అవకాశం ఉండదు.
అలాంటప్పుడు ఏ పాము విషానికైనా విరుగుడుగా పనిచేసే ఏంటీ స్నేక్ వీనమ్ మందులు వేస్తారు.
ఇవి అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అందుబాటులో ఉంటాయి.
బాధితుడిని సాధ్యమైనంత తొందరగా ఆస్పత్రికి చేర్చితే ప్రాణాపాయం తప్పుతుంది.
చాలా మంది కాటు వేసింది పామో లేక తేలో తేల్చుకోలేక అశ్రద్ధ చేయడంతో ప్రాణాలు కోల్పోతున్నారు.
ఏది కరచినా తక్షణం వైద్య సేవలు పొందడం అనివార్యమని గుర్తుంచుకోవాలి.
ఆ సమయం అర్ధరాత్రయినా, పగలైనా సరే.
ఆస్పత్రిలో చేరిన తర్వాత మరణించినవారు చాలా అరుదు.
పాము కాటుకు మొదట బాధ్యత వహించాల్సింది మనమే.
వాటికి మనం ఏదైనా అపాయం తలపెడతామోనన్న భయంతోనే అవి కాటేస్తుంటాయి.
వాటిని పొరపాటున కాలితో తొక్కేయడమో, లేక గడ్డి కోస్తున్నపుడు వాటిని పట్టుకోవడమో, తాకడమో చేయడంతోనే అవి కాటేస్తున్నాయని గుర్తించాలి.
విష సర్పమేనా..?
పాములన్నీ విష పూరితం కావనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
పొలాల్లో తిరిగే కొన్ని పాములు కరిచినా పెద్ద ప్రమాదమేమీ ఉండదు.
అందువల్ల ఏ పాము కరిచిందో వీలైతే తెలుసుకోవాలి.
పాము తోక చివర బాగం సూదిగా మొనదేలి ఉంటే అది విషపుజాతి పామే.
అలా కాకుండా బండదేలినట్టు, గుండ్రంగా వుంటే అది ప్రమాదరహితమేనని గుర్తుంచుకోవాలి.
కాటు వేసిన చోట రెండు గంట్లు పడితే విష సర్పమే. అదే ఎక్కువ, చిన్నచిన్న గాట్లు పడితే అది విషపు జాతికి చెందనిదిగా తెలుసుకోవచ్చు.
జాగ్రత్తలు అవసరం
రాత్రి వేళల్లో పొలాలకు వెళ్లేటపుడు మోకాళ్ల వరకు ఉండే గమ్ బూట్లను వేసుకుని వెళ్లడం మంచిది.
పాములు కేవలం శబ్ద తరంగాలను గ్రహించి అప్రమత్తమవుతాయి. అందువల్ల శబ్దం చేసేలా అడుగులు వేయడం, ఏదోలా చప్పడు చేయడం వల్ల వాటిని గ్రహించి పాములు అప్రమత్తమై అక్కడ నుంచి వెళ్లిపోతాయి.పాదం వరకు కప్పి ఉంచే పంచెలు, లుంగీలు, ప్యాంట్లు వేసుకుని వెళ్లడం మంచిది.
రాత్రిపూట పొలానికి వెళ్లాల్సి వస్తే టార్చిలైటు, కర్ర తీసుకువెళ్లడం తప్పనిసరి.
కొన్ని మందులు, పాముకాట్ల నుంచి తప్పించుకునే పద్ధతులు తెలియడం కూడా అవసరమే.
ఇళ్లలో ఉండే పసరు మందులు, నాటు వైద్యులు ఇచ్చే ఆకులు, అలములను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్ముకోకూడదు.