అడ్రస్ లేదు! | so many problems are there in govt hostels | Sakshi
Sakshi News home page

అడ్రస్ లేదు!

Published Tue, Jun 24 2014 1:54 AM | Last Updated on Fri, Nov 9 2018 4:51 PM

అడ్రస్ లేదు! - Sakshi

అడ్రస్ లేదు!

నోట్ దిస్ పాయింట్
 
పాఠశాలలు ప్రారంభమై పది రోజులు దాటినా అందని నోట్ పుస్తకాలు
అతీగతీ లేని యూనిఫాం
చిరిగిన దుస్తులు, ఖాళీ బ్యాగులతో వెళ్తున్న వైనం
ఇదీ జిల్లాలోని హాస్టల్ విద్యార్థుల దుస్థితి
 
 
అనంతపురం ఎడ్యుకేషన్ :
పాఠశాలలు పునఃప్రారంభమై పది రోజులు దాటింది. అయితే నేటికీ హాస్టల్ విద్యార్థులకు నోట్ పుస్తకాలు, యూనీఫాం అందలేదు. ఫలితంగా విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 234 ప్రభుత్వ హాస్టళ్లు ఉన్నాయి. 126 సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో 12,600 మంది, 91 బీసీ హాస్టళ్లలో 14,200 మంది, 18 ఎస్టీ హాస్టళ్లలో రెండు వేల మంది 1-10 తరగతుల విద్యార్థులు ఉన్నారు. వీరికి విద్యా సంవత్సరం ప్రారంభంలోనే నోట్ పుస్తకాలతో పాటు నాలుగు జతల యూనిఫాం పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటిదాకా ఒక్క శాఖ కూడా యూనిఫాం అందజేయలేదు. ఇక నోట్ పుస్తకాలు లేక విద్యార్థులు ఖాళీ బ్యాగులతో పాఠశాలలకు వెళ్తున్నారు. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పే సమయంలో దిక్కులు చూస్తున్నారు.  

 బీసీ హాస్టళ్లకు ఒక్క నోట్  బుక్కూ రాలేదు

 9,10 తరగతుల విద్యార్థులకు 192 పేజీల లాంగ్ నోట్‌బుక్కులు 12 ఇవ్వాల్సి ఉంది. 7,8 తరగతులకు 96 పేజీలు కల్గిన ఆరు (చిన్నవి), 192 పేజీలు కల్గిన ఆరు (పెద్దవి) నోట్‌పుస్తకాలు ఇవ్వాలి. ఆరో తరగతికి చిన్నవి ఆరు, పెద్ద పుస్తకాలు మూడు, 3-5 తరగతుల విద్యార్థులకు చిన్న పుస్తకాలు ఐదు ఇవ్వాలి. బీసీ సంక్షేమ శాఖకు సంబంధించి ఈ విద్యా సంవత్సరం 13,395 మంది విద్యార్థులకు 46,601 చిన్న పుస్తకాలు, 99,027 పెద్ద పుస్తకాలు అవసరమని ప్రతిపాదనలు పంపారు. ఇప్పటిదాకా ఒక్క పుస్తకమూ రాలేదు. ఇక సాంఘిక సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు సంబంధించిన నోట్ పుస్తకాలు  డీడీ కార్యాలయానికి చేరినా.. వాటిని ఇంకా హాస్టళ్లకు పంపలేదు. పిల్లల చేతికి అందడానికి ఇంకొన్ని రోజులు పట్టే అవకాశముంది. గిరిజన సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు నోట్‌పుస్తకాలు అందజేశామని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

సిద్ధం కాని దుస్తులు

వాస్తవానికి పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికే దుస్తులు సిద్ధంగా ఉండాలి. తొలిరోజే విద్యార్థులకు పంపిణీ చేయాలి. అయితే, ఇప్పటిదాకా కనీసం జత కూడా అందజేయలేదు. మరీ ఘోరమేమిటంటే బీసీ హాస్టళ్ల విద్యార్థులకు సంబంధించి జిల్లాకు క్లాత్‌కూడా చేరలేదు. ఎస్సీ హాస్టళ్ల విద్యార్థులకు మాత్రం రెండు జతలకు సరిపడా క్లాత్ వచ్చింది. మరో రెండు జతల క్లాత్ రావాల్సి ఉంది. ప్రస్తుతం వచ్చిన క్లాత్‌తో యూనిఫాం కుట్టే పనిలో ఉన్నారు. గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో చదువుకుంటున్న రెండు వేల మంది విద్యార్థులకు గాను ఇప్పటిదాకా 1,400 మందికి సరిపడా క్లాత్ వచ్చింది. స్టిచ్చింగ్ పూర్తయి విద్యార్థులకు చేరేలోపు మరో 15 రోజుల పైనే పడుతుంది. బీసీ హాస్టళ్ల విద్యార్థులకు మాత్రం మరో రెండునెలల దాకా యూనిఫాం అందే పరిస్థితులు కనిపించడం లేదు.

గోడౌన్‌లో మూలుగుతున్న బెడ్‌షీట్లు

అన్ని శాఖలకు సంబంధించి బెడ్‌షీట్లు జిల్లాకు చేరాయి. బీసీ విద్యార్థుల బెడ్‌షీట్లు మాత్రం గోడౌన్‌లోనే మూలుగుతున్నాయి. హాస్టళ్లకు ఎప్పుడు చేరవేస్తారో అధికారులకే తెలియాలి. ఎస్సీ హాస్టళ్లకు సంబంధించి కొన్నింటికి చేరగా.. మరికొన్నింటికి ఇప్పటికీ అందలేదు. గిరిజన హాస్టళ్లకు పూర్తి స్థాయిలో పంపిణీ చేశామని అధికారులు చెబుతున్నారు.

నెలకుపైగా పట్టొచ్చు

బీసీ హాస్టళ్లకు సంబంధించి ప్రతియేటా జూలై ఆఖరులోగా క్లాత్ వస్తుంది. ఈ విషయమై రాష్ట్ర అధికారులతోను, జిల్లా కలెక్టరుతోను మాట్లాడాం. క్లాత్ వచ్చి.. స్టిచ్చింగ్ చేయించి పిల్లలకు పంపిణీ చేయాలంటే మరో నెల పడుతుంది. ఇక నోట్ పుస్తకాలు రావడానికి మరోవారం పట్టొచ్చు.                   

-  ఉమాదేవి,   బీసీ సంక్షేమ శాఖ ఉప సంచాలకులు
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement