ప్రేమ వ్యవహారమే కారణం ..
జంగారెడ్డిగూడెం/బుట్టాయగూడెం : క్షణికావేశం తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చింది. వారి ఆకాంక్షలకు వెలుగునివ్వాల్సిన విద్యార్థిని తనను తాను అంతం చేసుకుని.. వారి ఆశలను చిదిమేసి అనంత లోకాలకు వెళ్లిపోయింది. జంగారెడ్డిగూడెంలోని విద్యావికాస్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ చదువుతున్న.. బుట్టాయగూడెంకు చెందిన విద్యార్థిని స్వప్న నాయక్ (17) శుక్రవారం ఉదయం కళాశాల హాస్టల్ భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆ హఠాత్ పరిణామంతో సహచర విద్యార్థులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఒక్క క్షణం ఆలోచించి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదని కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమతో ఇన్నాళ్లూ కలిసి చదువుకున్న స్నేహితురాలు ఇక లేదని తెలిసి బోరున విలపిస్తున్నారు.
శుక్రవారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో స్వప్న నాయక్ ఆత్మహత్యకు పాల్పడింది. ఆ సమయంలో హాస్టల్ విద్యార్థులంతా కాలకృత్యాలు తీర్చుకుని స్టడీ అవర్స్‌కు హాజరవుతుండగా.. స్వప్న నాయక్ కూడా వారితో కలిసి హాల్‌లోకి చేరుకుంది. తాను పుస్తకాలు మరిచిపోయానంటూ హడావుడిగా హాస్టల్ పైభాగంలోకి వెళ్లి ఒక్కసారిగా కిందకు దూకేసిందని తోటి విద్యార్థులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న కళాశాల కరస్పాండెంట్ సతీష్‌చంద్, ఉపాధ్యాయులు స్వప్న నాయక్‌ను స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. స్వప్ననాయక్ తల్లిదండ్రులు శిశుపాల్ నాయక్, షీబా హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. కూతురు మృతి చెందిందని తెలుసుకున్న తల్లి ఆసుపత్రిలో సొమ్మసిల్లి పడిపోయింది.
ప్రేమ వ్యవహారమే కారణమంటున్న తల్లిదండ్రులు
కూతరు స్వప్న నాయక్ ఆత్మహత్యపై తండ్రి శిశుపాల్ నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమ వ్యవహారమే తన కుమార్తె మరణానికి కారణమని భావిస్తున్నట్టు ఆయన పోలీసులకు తెలిపారు. 15 రోజుల క్రితం వరకు స్వప్న బుట్టాయగూడెంలోని తమ ఇంటినుంచే కళాశాలకు వెళ్లేదని.. ఈ మధ్యనే ఆమెను కళాశాల హాస్టల్‌లో చేర్పించామని శిశుపాల్ నాయక్ తెలిపారు. కాగా ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్సై ఎం.కేశవరావు తెలిపారు.
కాన్వెంట్ నడుపుకుంటున్న తల్లిదండ్రులు
విద్యార్థిని తండ్రి శిశుపాల్ నాయక్ ఒడిశాకు చెందిన వారు కాగా, తల్లి షీబా కేరళకు చెందిన వారు. ఈ దంపతులిద్దరూ 25 సంవత్సరాల క్రితం బుట్టాయగూడెం వచ్చిన సెయింట్ థెరిస్సా పేరిట కాన్వెంట్ నడుపుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. ఆత్మహత్యకు పాల్పడిన స్వప్న నాయక్ రెండో కుమార్తె. కుమార్తె మృతితో తండ్రి కన్నీటి పర్యంతమవుతున్నారు. పదవ తరగతిలో కూడా 9.8 జీపీఏ సాధించిందని, బాగా చదువుతుందని చెప్పారు. చదువు పాడవకూడదనే ఉద్దేశంతో హాస్టల్‌లో చేర్చానని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని వాపోయారు.