
సోనియా నిర్ణయం ఎంపి సీట్ల కోసమే: మేకపాటి
హైదరాబాద్ : ఎంపి సీట్ల కోసమే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి విమర్శించారు. ఎల్బి స్టేడియంలో జరుగుతున్న సమైక్య శంఖారావం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కొన్ని ఎంపీ సీట్లు గెలవవచ్చునని తెలుగు రాష్ట్రాన్ని విభజించడం సోనియాకు తగదన్నారు. ఆమె విభజన చర్యలు ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నాయని పేర్కొన్నారు. ఆమె విధానాన్ని దేశమంతా వ్యతిరేకిస్తోందన్నారు.
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ఆర్ నాయకత్వంలో రాష్ట్రం నుంచి కాంగ్రెస్ రెండు సార్లు 30కి పైగా ఎంపీ సీట్లు గెలుచుకుందని తెలిపారు. దాంతోనే కేంద్రంలో కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును నిందించడానికి తెలుగులో పదాలు లేవన్నారు. ఆరు నెలల్లో సమర్థ నాయకత్వం ఈ రాష్ట్రాన్ని పాలించబోతోందన్నారు. అందుకోసమే ప్రజలు ఎదురు చూస్తున్నారని మేకపాటి చెప్పారు.