సోనియాకు ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తెలుసా?: జగన్ | YS Jaganmohan Reddy says Sonia Gandhi is ignorant of Andhra History | Sakshi
Sakshi News home page

సోనియాకు ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తెలుసా?: జగన్

Published Sat, Oct 26 2013 5:42 PM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM

సోనియాకు ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తెలుసా?: జగన్ - Sakshi

సోనియాకు ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తెలుసా?: జగన్

హైదరాబాద్: తమ రాష్ట్రాన్ని విడగొట్టాలనుకుంటున్న సోనియా గాంధీకి ఆంధ్ర రాష్ట్ర చరిత్ర  తెలుసా అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రం కోసం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలుసా అని అడిగారు. వీర తెలంగాణ నాది.. వేరు తెలంగాణ కాదన్న రావి నారాయణరెడ్డి గురించి తెలుసా అంటూ ప్రశ్నించారు. చీలికవాదం తెలంగాణకు హానికరమని రావి నారాయణరెడ్డి చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

ఎల్బీ స్టేడియంలో శనివారం నిర్వహించిన సమైక్య శంఖారావం సభలో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి జగన్ పలు ప్రశ్నలు సంధించారు. రాష్ట్రం విభజించిన తర్వాత ఇక్కడి ఆస్తుల విలువలు పడిపోతే ఆ విలువ సోనియా ఇస్తారా, చంద్రబాబు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. భారతదేశ పౌరసత్వం తీసుకున్న వారిని ఇటలీకి తిరిగి వెళ్లిపోమంటే ఒప్పుకుంటారా అంటూ అడిగారు. 30 ఏళ్లుగా ఉంటున్న సోనియాకే భారతదేశంపై ఇంత అధికారం ఉంటే వందల ఏళ్లుగా ఉంటున్న తమకు ఎంత అధికారం ఉండాలని సూటిగా ప్రశ్నించారు. ఈ మాట అంటే కాంగ్రెస్ నాయకులు కల్లు తాగిన కోతుల్లా రెచ్చిపోతారని జగన్ ఎద్దేవా చేశారు.

ఓట్ల, సీట్ల కోసం విభజించే రాజకీయాలు తెరమరుగు కావాలని ఆకాంక్షించారు. సోనియా గుండెలు అదిరేలా, కిరణ్-చంద్రబాబు గూబలదిరేలా సమైక్య గళాన్ని వినిపించాలన్నారు. తెలుగు జాతికి ద్రోహం చేస్తున్న సోనియా, చంద్రబాబు, కిరణ్‌లను క్షమించాలా అంటూ సభలోని వారిని జగన్ ప్రశ్నించగా 'నో' అనే సమాధానం వచ్చింది. విభజన బిల్లు ఆపే వరకు పోరాడుదామని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల వరకూ పోరాడుదాం.. 30 ఎంపీ స్థానాలను మనమే గెలుచుకుందామన్నారు. ఢిల్లీ కోటను బద్దలు కొడదాం, ఢిల్లీ రాజకీయాలను మనమే శాసిద్దామని అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే నేతనే ప్రధానిని చేద్దామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement