ఇటలీ మాఫియాకు సోనియాగాంధీ లీడర్
చీపురుపల్లి/విజయనగరం, న్యూస్‌లైన్: తెలుగువారందరికీ సమన్యాయం చేసి రాష్ట్ర విభజన అంశంలో ముందుకెళ్లాలని అప్పుడు చెప్పామని.. ఇప్పుడూ అదే మాట చెబుతున్నామని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఎప్పుడైనా తనది ఒకే మాట అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకే తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి, రాష్ట్ర విభజనకు పాల్పడుతోందని విమర్శించారు. ఇటలీలో పెద్ద పెద్దమాఫియాలు ఉన్నాయని, వాటికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నాయకత్వం వహిస్తున్నారని ఆరోపించారు. ఆమెకు ఓట్లు, సీట్లు మినహా ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు.
చంద్రబాబు ఆదివారం విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గాల్లో పర్యటించారు. వర్షాలకు దెబ్బతిన్న మొక్కజొన్న, ఇతర పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో మిలాఖత్ అయ్యి, తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను విలీనం చేసుకుని అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ కుట్ర పూరిత రాజకీయాలు చేస్తోందన్నారు.
తీవ్ర వర్షాలకు ప్రజలు, రైతాంగం నానా అవస్థలూ పడుతోంటే.. కిరణ్ జనానికి అందనంత ఎత్తులో విమానాల్లో తిరుగుతున్నారని.. ఆయనను ప్రజలు నేలకు దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. నీతికి మారుపేరైన విజయనగరం జిల్లాకు అవినీతి మచ్చ తెచ్చింది మంత్రి బొత్స సత్యనారాయణ అని విమర్శించారు. భవిష్యత్తులో అత్యధిక ఎంపీ సీట్లు సాధించి కేంద్రంలో టీడీపీ చక్రం తిప్పనుందన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. వరదల వల్ల నష్టపోయిన మొక్కజొన్న పంటకు ఎకరాకు రూ. 10 వేలు, బొప్పాయి, అరటి పంటలకు ఎకరాకు రూ. 25 వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు పి.అశోక్‌గజపతిరాజు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శోభా హైమావతి తదితరులు పాల్గొన్నారు.