శ్రీకాకుళంలో సోనియాకు సమాధి
Published Fri, Oct 11 2013 2:58 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీకి ప్రత్యేక తెలంగాణ జబ్జు పట్టుకుందని సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ప్రతినిధులు ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ, టీ నోట్‌ను కేబినెట్‌లో ఆమోదం తెలపడాన్ని నిరసిస్తూ శ్రీకాకుళంలోని ఎన్జీవో కార్యాలయం నుంచి వైఎస్‌ఆర్ కూడలి వరకూ సోనియాగాంధీ శవయాత్రను జరిపారు. అనంతరం వైఎస్‌ఆర్ కూడలి వద్ద నిర్మించిన సమాధిలో పూడ్చిపెట్టారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర పరిరక్షణవేదిక చైర్మన్ హనుమంతు సాయిరాం మాట్లాడుతూ సీమాంధ్రలోని అన్ని రాజకీయ పార్టీలు జెండా, ఎజెండాలను పక్కనపెట్టి సమైక్యాంధ్ర ఉద్యమంలోకి రావాలని కోరారు.
23మంది ఎంపీలు స్పీకర్‌ఫార్మాట్‌లో రాజీనామాలు సమర్పించి ఉద్యమంలోకి వస్తే యూపీఏ ప్రభుత్వం దిగివస్తుందన్నారు. చిన్న రాష్ట్రాలతోనే పరిపాలన సాధ్యమన్న బీజేపీ కూడా సమైక్యాంధ్ర కు మద్దతుగా మాట్లాడుతున్నారన్నారు. ఉద్యమంలోని రాని నేతలను వారి నియోజకవర్గాల్లో అడుగుపెట్టనీయమని హెచ్చరించారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల సంభవించే ముప్పుకు ఎన్జీవోలంతా మానవతా దృక్పథంతో ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో సమైక్యాంధ్ర పరిరక్షణవేదిక ప్రతినిధులు గీతా శ్రీకాంత్, జామి భీమశంకర్, కిలారి నారాయణరావు, దుప్పల వెంకట్రావులు మాట్లాడుతూ సోనియాగాంధీ చుట్టూ ఒక కోటరీ ఉందని, వారే ఆమెను తప్పుదోవ పట్టించి కాంగ్రెస్‌ను, రాహుల్‌గాంధీలను సర్వనాశనం చేస్తున్నారన్నారు.
చివరిగా సోనియూ సమాధివద్ద సర్వమత ప్రార్థనలు చేశారు. ఆమె చనిపోయినందుకు సంతోషపడుతూ స్వీట్లు పంచి సంబరాలు జరుపుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఐకాస ప్రతినిధులు బుక్కూరు ఉమామహేశ్వరరావు, జయరాం, ఎం.అప్పలనాయుడు, వై.ఉమామహేశ్వరరావు, బీఎల్‌పీ రావు, ఎం.ఎ.రాజు, ఎస్.సిమ్మయ్య, పి.నానాజీ, కె.నారాయణమ్మ, కె.శ్రీను, ఎంఆర్‌కె దాస్, ఎం.గోవింద్, కాయల శ్రీను, కె.సుమన్, ఎ.తారకేశ్వరరావు, ఎ.కిరణ్‌కుమార్, కె.నరేంద్ర, పూజారి జానకిరాం, గొలివి నర్సునాయుడు తదితరులు పాల్గొన్నారు.
Advertisement