ప్రజల పక్షాన మాట్లాడినా తప్పేనా?
దంతలూరు కృష్ణను పోలీసులు
అదుపులోకి తీసుకోవడంపై ఎమ్మెల్యే రాచమల్లు
ప్రొద్దుటూరు : ప్రజల పక్షాన మాట్లాడిన వారిపై కూడా ప్రభుత్వం ఒత్తిడి చేసి కేసులు పెట్టడం తగదని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక దొరసానిపల్లెలోని ఎమ్మెల్యే రాచమల్లు ఇంటి వద్ద ఉన్న పులివెందుల వైఎస్సార్‌సీపీ నాయకుడు దంతలూరు కృష్ణను మంగళవారం రాత్రి పులివెందుల రూరల్ సీఐ మహేశ్వరరెడ్డి అదుపులోకి తీసుకున్నారు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పులివెందుల నియోజకవర్గంలోని మురారిచిం తల గ్రామంలో రేషన్ పంపిణీపై ప్రజల తరఫున మాట్లాడినందుకు అరెస్ట్ చేస్తామనడం తగదన్నారు. ఈ వ్యవహారంలో ఎంపీడీఓ మురళీమోహన్‌ను ఇప్పటికే సస్పెండ్ చేశారన్నారు.
వాస్తవానికి గ్రామ ప్రజలు టీడీపీ నేత ఇంటి వద్ద రేషన్ పంపిణీ చేయొద్దని చెప్పారన్నారు. ఈ విషయంలో ప్రజలకు మద్దతు ఇస్తే ఏదో పెద్ద నేరం చేసినట్లు.. ఎమ్మెల్యే హోదాలో ఉన్న తన కోసం వచ్చిన దంతలూరు కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకోవడం తెలుగుదేశం పార్టీ కక్షసాధింపు చర్య అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై పోలీసుల ద్వారా ఉక్కుపాదం మోపి అణచివేసే కార్యక్రమానికి టీడీపీ శ్రీకారం చుట్టిందన్నారు. కాగా, పోలీసుల అదుపులో ఉన్న దంతలూరు కృష్ణను అరెస్టు చూపించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అనంతరం కృష్ణను లింగాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.