ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఎంసెట్ అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి వారిని పరీక్ష కేంద్రాలకు చేర్చేందుకు...
- మండల కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులు
- జిల్లా కలెక్టర్ సుజాతశర్మ
ఒంగోలు ఒన్‌టౌన్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఎంసెట్ అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి వారిని పరీక్ష కేంద్రాలకు చేర్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సుజాతశర్మ వెల్లడించారు. గురువారం రాత్రి జిల్లా ఎస్పీ చిరువోలు శ్రీకాంత్‌తో కలిసి ఆమె ఎంసెట్ ప్రత్యేక ఏర్పాట్ల గురించి విలేకర్లకు వివరించారు. జిల్లాలో ఎంసెట్ పరీక్షకు మొత్తం 11,440 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి ఉదయం 4 గంటల నుంచే ప్రత్యేక బస్సులను అవసరమైన పోలీస్ బందోబస్తుతో ఏర్పాటు చేస్తామన్నారు.
12 కేంద్రాల్లో రాత్రి బస
ఎంసెట్‌కు హాజరయ్యే విద్యార్థులు గురువారం రాత్రికి ఒంగోలు చేరుకునే వారికి 12 కేంద్రాల్లో బస ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సుజాతశర్మ తెలిపారు. మొత్తం 1600 మంది బాల, బాలికలకు వేర్వేరుగా ఈ వసతి కల్పించారు. ఈ కేంద్రాలన్నింటికీ లైజన్ ఆఫీసర్లను నియమించారు.
పోలీస్ వాహనాలు సిద్ధం
ఎంసెట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం పోలీస్ వాహనాల సేవలు కూడా అందిస్తున్నట్లు ఎస్పీ చిరువోలు శ్రీకాంత్ తెలిపారు. ఒంగోలు నగరంలోని 8 కూడళ్లలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. 8 పోలీస్ హెల్ప్‌లైన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశామన్నారు. ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు అడిషనల్ ఎస్పీకి బాధ్యతలు అప్పగించామన్నారు. ఆర్టీసీ ఆర్‌ఎం నాగశివుడు మాట్లాడుతూ పోలీస్ బందోబస్తుతో గురువారం 50 శాతం ఆర్టీసీ బస్సులను తిప్పినట్లు చెప్పారు.
హెల్ప్‌లైన్, కంట్రోల్ రూం
ఒంగోలు టౌన్: ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం కంట్రోల్ రూమ్‌తో పాటు హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సుజాతశర్మ తెలిపారు. కంట్రోల్ రూమ్ (98482 25915) విద్యార్థులకు ఎలాంటి సహాయం అవసరమైన వెంటనే ఈ కంట్రోల్ రూమ్‌కు సంప్రదించాలని కలెక్టర్ కోరారు. అదే విధంగా ఒంగోలు రైల్వేస్టేషన్, బస్టాండ్‌ల వద్ద హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైల్వేస్టేషన్ వద్ద కొత్తపట్నం డిప్యూటీ తహశీల్దార్ (88866 16035), ఆర్‌టిసి బస్టాండ్ మద్దిపాడు డిప్యూటీ తహశీల్దార్ (99499 14310) ఇన్‌చార్జులుగా నియమించామన్నారు.