పండుగకు ప్రత్యేక బస్సులు
245 సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ చర్యలు
కర్నూలు(రాజ్‌విహార్):
దసరా, బక్రీదు పండుగలను పురస్కరించుకొని ప్రయాణికుల సౌకర్యార్థం రోడ్డు రవాణ సంస్థ (ఆర్టీసీ) ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టింది. ట్రాఫిక్ అంచనా మేరకు రీజియన్‌లోని వివిధ డిపోల నుంచి 245 సర్వీసులు తిప్పేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చే ప్రయాణికులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రధానంగా హైదరాబాదు, విజయవాడ, బెంగుళూరు, చెన్నై తదితర దూర ప్రాంతాకు బస్సులు నడిపేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈనెల 26వ తేది నుంచి వచ్చే నెల 2 వరకు ప్రత్యేక సర్వీసులు నడపనున్నారు. 28న విజయవాడ నుంచి కర్నూలుకు 10 సర్వీసులు, అక్టోబర్ 1వ తేది బెంగుళూరు నుంచి 30, చెన్నై నుంచి రెండు, హైదరాబాదు నుంచి 100 అదనపు బస్సులు తిప్పేందుకు ఏర్పాట్లు చేశారు. ఆదోని డిపో నుంచి 24 బస్సులు నడుపుతుండగా డోన్- 19, కర్నూలు-1 డిపో -24, కర్నూలు-2 డిపో -27, ఎమ్మిగనూరు- 26, ఆళ్లగడ్డ- 22, ఆత్మకూరు- 22, బనగానపల్లె- 24, కోవెలకుంట్ల- 16, నందికొట్కూరు- 16, నంద్యాల- 27 బస్సులు నడపనున్నారు. పండుగల తరువాత తిరుగు ప్రయాణం చేసే వారి కోసం ట్రాఫిక్‌కు తగ్గట్లు బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ దృష్ట్యా హైదరాబాదులోని పాత ఎంజీబీఎస్ హ్యాంగర్ (గౌళిగూడ) నుంచే బస్సులు నడపనున్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.
అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం: కృష్ణమోహన్, రీజినల్ మేనేజర్
దసరా, బక్రీదు పండుగల సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాదులో పాటు ఇతర దూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టాం. రద్దీకి తగ్గట్లు ప్రస్తుతం 245 బస్సులు తిప్పనున్నాం. సాధారణ బస్సులతో పాటు స్పెషల్ బస్సుల్లో టికెట్టు పొందేందుకు అడ్వాన్స్ బుకింగ్ రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించాం. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చే సుకొని సురక్షితంగా గమ్యస్థానాలు చేరండి.