స్పందన అర్జీల స్వీకరణకు ఏర్పాటు చేసిన వెబ్‌సైట్ చిత్రం
సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం, వారి అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ, వారి జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యం. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ప్రతి అధికారి బాధ్యతగా వ్యవహరించాలి. చిరునవ్వుతో స్పందించి ప్రజల సమస్యలు పరిష్కరించాలి.
– ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
సాక్షి, చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యలను వెంట నే పరిష్కరించడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూపొందించిన స్పందన(ప్రజా పరిష్కార వేదిక) కార్యక్రమాన్ని ఈ నెల 1వ తేదీ నుంచి ప్రారంభించారు. గత వారం జరిగిన స్పందన కార్యక్రమానికి కలెక్టరేట్‌లో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేశారు. స్పందనలో గత వారం అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని అర్జీలను అందజేశారు.
కలెక్టరేట్ వెనుకభాగంలో కౌంటర్లు
కలెక్టరేట్ వెనుకభాగంలో రశీదు కౌంటర్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో ప్రజలు వస్తుండడంతో గతంలో ఉన్న స్థలం ఇబ్బందికరంగా ఉండేది. దీంతో కలెక్టర్ నారాయణ భరత్‌గుప్తా స్పందన కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయించారు. కలెక్టరేట్ వెనుకభాగాన ఉన్న విశాలమైన బహిరంగ ప్రదేశంలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయించారు. అధికారులు ఆదివారం కలెక్టరేట్ వెనుక భాగాన ఉన్న ప్రాంతాన్ని జేసీబీతో చదును చేసి, ఏర్పాట్లు చేశారు. ప్రజలకు ఎండవేడిమి తగలకుండా ప్రత్యేకంగా షామియానాలను ఏర్పాటు చేశారు.
ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదులు
స్పందన కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యను అర్జీ రూపంలో ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదు చేసేలా ప్రభుత్వం సౌకర్యాన్ని› కల్పించింది. ప్రజల సమస్యలను అర్జీ రూపంలో వెబ్‌సైట్‌లో రాయవచ్చు. ఈ వెబ్‌సైట్ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తుంది. ఎక్కడ నుంచైనా సమస్యను రాసి పంపే సౌకర్యాన్ని కల్పించారు. దీనికి 24 గంటలపాటు పనిచేసే కాల్‌సెంటర్‌ను అనుసంధాం చేయనున్నారు. స్పందన కోసం కొత్తగా 1800–425–4440 టోల్ ఫ్రీ నెంబర్, spndana.ap@gmail.com మెయిల్ ను కేటాయించారు. కేవలం ఫిర్యాదులే కాదు, వివిధ విషయాలపై ప్రభుత్వానికి సూచనలు, సలహాలు కూడా చేయవచ్చు. ప్రజలు http:// spandana.ap.gov.in/ వెబ్‌సైట్ లో అర్జీలను పంపవచ్చు.
అర్జీతో పాటు ఆధార్ తప్పనిసరి
స్పందన కార్యక్రమంలో బాధితుల అర్జీతోపాటూ ఆధార్ కార్డు జిరాక్స్‌ను జరచేయాల్సి ఉంటుంది. అర్జీదారులు మొదట కలెక్టరేట్‌లోని వెనుకభాగంలో ఉన్న ప్రత్యేక కౌంటర్లలో అర్జీలు ఇచ్చి రశీదు పొందాలి. అనంతరం ఉన్నతాధికారులకు అందజేయాల్సి ఉంటుంది. స్పందన కార్యక్రమం సోమవారం ఉదయం 10 నుంచి 1 గంట వరకు జరుగుతుంది.
ప్రతి అర్జీని పరిష్కరించాలి
ప్రజలు స్పందన కార్యక్రమంలో అందజేసే ప్రతి అర్జీని ఆయా శాఖల అధికారులు కచ్చితంగా పరిష్కరించాల్సిందే. స్పందన కార్యక్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. స్పందన కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు తప్పక హాజరుకావాల్సిందే. ఎవరైన గైర్హాజరైతే చర్యలుంటాయి.
– నారాయణ భరత్‌గుప్తా, జిల్లా కలెక్టర్
రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ
స్పందన కార్యక్రమానికి రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. భూ తగాదాలు, కబ్జాలు తదితర సమస్యలు ఉన్నట్లు ప్రజలు అర్జీలు ఇస్తున్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని ఆయా తహసీల్దార్లకు ఆదేశాలు ఇచ్చాం. రెవెన్యూ ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వాటిని పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నాం.
– మార్కండేయులు, జాయింట్ కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment