నరసాపురం పట్టణంలో పుష్కర పనులను ఇటీవల చూసిన కలెక్టర్ కె.భాస్కర్ అవాక్కయ్యారు. నాణ్యతకు తిలోదకాలు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. లేదంటే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ చీఫ్.. మునిసిపల్ అడ్మినిస్ట్రేటివ్ డెరైక్టర్ సహా ఉన్నతాధికారులెందరో ఇక్కడి పనులను పరిశీలించారు. లోపాలను సహించేది లేదని.. పనులు సక్రమంగా చేపట్టని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. అయినా ఎవరూ ఖాతరు చేయడం లేదు. ‘ఎవరొస్తే మాకేంటి.. వాళ్లేమన్నా పట్టించుకునేదేంటి’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పర్సంటేజీల రూపంలో ఎవరి తాంబూలం వారికిచ్చేశామన్న ధీమాతో నాణ్యతకు నీళ్లొదిలి చకచకా పనులు చేసేస్తున్నారు.
నరసాపురం అర్బన్ :గోదావరి పుష్కరాల నేపథ్యంలో నరసాపురంలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో నాణ్యతకు తిలోదకాలిచ్చారు. తూతూమంత్రంగా పనులు కానిచ్చేస్తున్నారు. పుష్కరాల పేరుతో వచ్చిపడిన కోట్లాది రూపాయల నిధులను జేబుల్లో నింపుకునే వ్యవహారం యథేచ్ఛగా సాగిపోతోంది. పర్సంటేజీల బాగోతాలతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుంటే అధికారులు హెచ్చరికలు జారీ చేయడం.. ప్రజలు అవాక్కవ్వడం తప్ప ఏమీ చేయలేని దుస్థితి నెలకొంది. వివాదాలు.. ఉల్లంఘనలు.. నాణ్యతకు తిలోదకాల నడుమ ఆదినుంచీ చర్చనీయాంశమైన పుష్కర అభివృద్ధి పనుల తీరు రోజురోజుకూ మరింత దారుణంగా తయారవుతోంది. పుష్కరాల నేపథ్యంలో నరసాపురం నియోజకవర్గానికి దాదాపు రూ.110 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఒక్క మునిసిపాలిటీ ద్వారానే రూ.43 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. పట్టణంలో చేపట్టిన పుష్కర పనులను జిల్లా కలెక్టర్ సహా ఉన్నతాధికారులు పలు సందర్భాల్లో పరిశీలించారు. నాణ్యత విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిస్థితిలో మార్పు రాకపోతే కాంట్రాక్టర్లతోపాటు సంబంధిత అధికారులపైనా చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. అయినా.. కాంట్రాక్టర్లు ఈ హెచ్చరికలను తాటాకు చప్పుళ్లగానే తీసుకుంటున్నారు.
ఉదాహరణలెన్నో
రూ.3 కోట్లతో ప్రకాశం రోడ్డులో నిర్మిస్తున్న డ్రెయిన్ పనులను కాంట్రాక్టర్లు తమకు ఇష్టం వచ్చిన రీతిలో నిర్మిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లు, షాపింగ్ కాంప్లెక్స్ యజమానుల బేరసారాల కారణంగా ఇక్కడి పనులు అష్టవంకర్లతో చేపడుతున్నారు. కొన్నిచోట్ల సింగిల్ సైడ్ వాల్‌తో డ్రెయిన్ నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నారు. పట్టణంలో ఇతర డ్రెయిన్లను నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారు. ఇసుక, కంకర, సిమెంట్‌ను తగిన మోతాదులో వాడకుండా పనులు కానిచ్చేస్తున్నారు. నాణ్యత లేని.. స్థానికంగా లభ్యమయ్యే గరుకు ఇసుకతోనే పుష్కర అభివృద్ధి పనులన్నీ సాగుతున్నాయి. సముద్ర తీరం కావడంతో ఇక్కడి గరుకు ఇసుక అభివృద్ధి పనులకు పనికిరాదు. ఇందులో ఉప్పు శాతం అధికంగా ఉంటుంది. తక్కువ ధరకు వస్తుందన్న ఉద్దేశంతో ఈ ఇసుకనే వాడుతున్నారు.
పర్సంటేజీల ధైర్యంతోనే..
పుష్కర అభివృద్ధి పనుల విషయంలో మొదటినుంచీ పర్సంటేజీల పర్వం నడుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మునిసిపల్ పెద్దలు, ప్రజాప్రతినిధులు కొందరు పనులు ప్రారంభానికి ముందే కాంట్రాక్టర్లతో ఓ అంగీకారానికి వచ్చినట్టు ప్రచారం సాగుతోంది. దీనిని నిజం చేస్తూ ఈ ప్రొక్యూర్‌మెంట్ టెండర్ల దశలోనే రాష్ట్ర చరిత్రలో లేనివిధంగా కాంట్రాక్టర్లు రింగ్ అవడం.. దీనిపై దుమారం రేగడంతో ఆ పనులను అధికారులు రద్దు చేయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇదిలావుంటే పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పురపాలక పెద్దలకు 7.50 శాతం చొప్పున పర్సంటేజీలు చెల్లించేవిధంగా ఒప్పందం చేసుకున్నట్టు చెబుతున్నారు. ఈ కారణంగానే తమను అడిగేవారు లేరనే ధైర్యంతో కాంట్రాక్టర్లు నాణ్యతకు తిలోదకాలిచ్చి ఇష్టానుసారం పనులు చేపడుతున్నారు. మునిసిపాలిటీ చేపట్టిన పనులతోపాటు పంచాయతీరాజ్, కన్జర్వెన్సీ, ఆర్ అండ్ బీ శాఖల ఆధ్వర్యంలో చేస్తున్న పనుల తీరు సైతం ఇలాగే ఉంది.
పుష్కర పర్వం.. అక్రమాలే సర్వం
Published Wed, May 13 2015 2:21 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement