'ప్రత్యేక హోదా.. సాయం రెండూ ఒకటే'
ఒక్క పేరు తప్ప.. ప్రత్యేక హోదా, ప్రత్యేక సాయం రెండూ ఒకటేనని ప్రభుత్వం మరోసారి తేల్చి చెప్పేసింది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగంలో ఇదే అంశాన్ని కుండ బద్దలుకొట్టి చెప్పారు. మన రాష్ట్రానికి వచ్చే ఆర్థికపరమైన, ఇతర అసమతౌల్యతల గురించి పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరచలేదని అన్నారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల తర్వాత నిధులను ఇచ్చేందుకు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలతో పాటు అన్ని రాష్ట్రాలను ఒకే విధంగా పరిగణనలోకి తీసుకుంటున్నారని, అందువల్ల ప్రత్యేకహోదా ఇచ్చే విధానాన్ని కేంద్రం విరమించుకుంటోందని కూడా చెప్పారు. ప్రత్యేకహోదా కలిగి ఉన్న రాష్ట్రాలు ఈ నెలాఖరు నుంచి ఆ హోదాను కోల్పోతాయని కూడా గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
ప్రత్యేకహోదా స్థానంలో మన రాష్ట్రానికి ప్రత్యేక సహాయాన్ని ప్రకటించడంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చి, వాళ్లను అంగీకరింపజేశామని, ప్రత్యేకహోదా కింద రాష్ట్రానికి చేకూరే మద్దతు, రాయితీలు, సహాయలన్నీ ప్రత్యేక సాయంలో ఉంటాయని కేంద్రం వివరించిందని ఆయన తెలిపారు. వాస్తవానికి పేరు తప్ప ప్రత్యేక హోదా కింద రాష్ట్రానికి వచ్చే అంశాలన్నీ ప్రత్యేక సాయం కింద లభిస్తాయని, ప్రత్యేక సాయానికి కూడా చట్టబద్ధతను కల్పించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని.. దాన్ని కూడా సాధిస్తుందని తెలిపారు.