ఇదో ‘ఫ్రెంచి’ బంధం | Special Story On 50 families in Yanam with French citizenship | Sakshi
Sakshi News home page

ఇదో ‘ఫ్రెంచి’ బంధం

Published Sun, Jul 19 2020 5:28 AM | Last Updated on Sun, Jul 19 2020 5:30 AM

Special Story On 50 families in Yanam with French citizenship - Sakshi

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అది రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత నాటి మాట. యానాంలో 137 ఏళ్ల పాలనను ఫ్రెంచి పాలకులు విడిచి వెళుతున్న రోజులవి. అప్పుడు యానాంలో సుమారు ఏడెనిమిది వేల మంది ఉంటారు. ఫ్రెంచి పాలకులు యానాంలో ఉన్న పౌరులను ‘ఫ్రెంచి పౌరసత్వం తీసుకుంటారా, భారతీయ పౌరులుగా కొనసాగుతారా?’ అని అడిగారు. ఫ్రెంచి పౌరసత్వం తీసుకుంటే భారత్‌తో విడిపోయాక ఆ దేశానికి పంపేస్తారనే భయంతో 90 శాతం మంది ఫ్రెంచి పౌరసత్వానికి వెనుకాడారు. ధైర్యం చేసిన 15 కుటుంబాలు ఫ్రెంచి పౌరసత్వం తీసుకున్నాయి. ఆ 15 కుటుంబాలే ఇప్పుడు యానాంలో 50 కుటుంబాలయ్యాయి. వీరి ద్వారా మరో 200 కుటుంబాలు ఫ్రాన్స్‌లో స్థిరపడ్డాయి. ఆరు దశాబ్ధాలుగా (1954 నుంచి) యానాం, ఫ్రెంచి కుటుంబాల మధ్య ఆత్మీయత, అనుబంధాలు నేటికీ చెక్కు చెదరలేదు. యానాంలో ఉన్న ఫ్రెంచి పౌరులను, ఫ్రాన్స్‌లో స్థిరపడిన యానాం ఫ్రెంచి పౌరులను ‘సాక్షి’ పలకరించినప్పుడు అనేక ఆసక్తికరమైన అంశాలను  పంచుకున్నారు. 

ఫ్రెంచి పౌరసత్వం ఉంటే చాలు 
నాడు ఫ్రెంచి పౌరసత్వం తీసుకున్న కుటుంబాల భవిష్యత్తు బంగారమైంది. 65 ఏళ్లు దాటితే ఫ్రెంచి పౌరుడికి ‘సెక్యూర్‌’ పథకం ద్వారా 900 యూరోలు (సుమారు రూ.75 వేలు) పెన్షన్‌ వస్తుంది. వృద్ధులను సాకే అటెండెంట్‌కు 550 యూరోలు (రూ.50 వేలు), ఇంటి అద్దెలో 50 శాతం, 25 సంవత్సరాలు దాటితే నిరుద్యోగ భృతి 550 యూరోలు (సుమారు రూ.50 వేలు) ఇస్తారు. ఫ్రెంచి పౌరసత్వం కలిగి, ఆ దేశంలో కనీసం ఆరు నెలలైనా ఉంటేనే వీటన్నింటికీ అర్హులు. ఫ్రెంచి పౌరసత్వం ఉన్న వారు ప్రపంచంలోని 129 దేశాలతో పాటు 24 యూరోపియన్‌ యూనియన్‌ దేశాలను వీసా లేకుండా చుట్టిరావచ్చు. 

ఆత్మీయత, అనుబంధాలకు ప్రతిరూపం 
స్థానికులతో యానాంలోని ఫ్రెంచి పౌరులు ఆరు దశాబ్దాలుగా విడదీయరాని అనుబంధాన్నే కొనసాగిస్తున్నారు. జూలై 14న ఫ్రెంచి జాతీయ దినోత్సవం. నవంబరు 11 ఫ్రెంచి పాలకులు యానాం విడిచిపెట్టి వెళ్లిపోయిన రోజును, మన పండగలను యానాం ప్రజలు, యానాంలోని ఫ్రెంచి పౌరులు కలిసే జరుపుకోవడం విశేషం. రోమన్‌ కేథలిక్‌ చర్చికి ప్రతి ఆదివారం హిందువులూ వెళుతుంటారు. యానాంకు చెందిన దవులూరి చంద్రశేఖ ర్, ఫ్రెంచి యువతి షావలోత్‌ భారతీయ సంప్రదాయంలో 2018 లో పెళ్లిపీటలు ఎక్కారు. యానాంలోనూ ఈఫిల్‌ టవర్‌ నిర్మించి ఇరు ప్రాంతాల మధ్య విడదీయరాని బంధాన్ని చాటిచెప్పారు. 

యానాంలో ఫ్రెంచి పాలన 
1750లో హైదరాబాద్‌ నిజాం నవాబు ముజఫర్‌ జంగ్‌ ఫ్రెంచి సార్వభౌమత్వాన్ని అంగీకరించారు. మూడుసార్లు బ్రిటిషు వారి చేతిలోకి వెళ్లిన యానాం.. 1817లో చివరిగా ఫ్రెంచి వారి ఆధీనంలోనికి వెళ్లింది. యానాం సుమారు 137 ఏళ్లు ఫ్రెంచి పాలనలో ఉంది. 1954లో ఫ్రెంచి పాలన నుంచి బయటపడి, స్వాతం త్య్రం పొంది పుదుచ్చేరిలో భాగమైంది. ఫ్రెంచి పౌరసత్వంతో ఇక్కడున్న వారం దరూ ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికల్లో పాల్గొని చెన్నైలోని ఫ్రా న్స్‌ కాన్సులేట్‌ జనరల్‌ కా ర్యాలయంలో ఓటు వేస్తారు. 

భారతీయతను ప్రేమిస్తారు
ఫ్రాన్స్‌ ఆర్మీలో పని చేసి 2015లో రిటైరయ్యా. ఎక్కువ కాలం ఫ్రాన్స్‌లో ఉండటంతో అక్కడి వారితో విడదీయరాని అనుబంధమేర్పడింది. భారతీయతను వారు ప్రేమిస్తారు.
–దవులూరి మృచ్ఛి, మాజీ సైనికుడు, ఫ్రెంచి జాతీయుడు,యానాం 

ఫ్రెంచి పౌరుల యోగక్షేమాలు తెలుసుకుంటారు 
ఫ్రెంచి కాన్సులేట్‌ జనరల్‌ నేరుగా మాట్లాడి, యానాంలో ఉన్న ఫ్రెంచి పౌరుల యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారు. వారాంతపు నివేదికలు కాన్సులేట్‌ నుంచి తీసుకుంటారు. రిటైరై, ఇక్కడ ఉన్న వారి బాగోగులను నిశితంగా పరిశీలిస్తుంటారు. 
– సాధనాల బాబు, ఫ్రెంచి పౌరుల ప్రతినిధి, యానాం 

ఆరు నెలలు అక్కడ.. ఆరు నెలలు ఇక్కడ 
ఫ్రాన్స్‌లో ఏళ్ల తరబడి నివసిస్తున్నా ఇక్కడి ఆచార సంప్రదాయాలను వీడలేదు. నాకు సెక్యూర్‌ స్కీమ్‌ ద్వారా ఫ్రెంచి ప్రభుత్వం ప్రతి నెలా పెన్షన్‌ ఇస్తుంది. నా మనుమరాలు, మనువడుల చదువుకయ్యే ప్రతి పైసా ఫ్రెంచి ప్రభుత్వమే భరిస్తోంది.  
– సాధనాల అనసూయ, ఫ్రెంచి పౌరురాలు, యానాం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement