యానాం నుంచి పారిస్‌కు చాలా దూరం. కానీ.. రెండు ప్రాంతాల మనుషుల మధ్య కాదు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత 1954లో ఫ్రెంచ్ వాళ్లు యానాంను విడిచి వెళ్లినా.. ఇక్కడి వారితో మాత్రం నేటికీ బంధాలను కొనసాగిస్తూనే ఉన్నారు. కాగా, ఇటీవల కాలంలో మూడుముళ్లు.. ఏడడుగులతో పెనవేసుకుని.. కడవరకూ కలిసుంటామని ప్రమాణం చేసుకుంటూ బంధాలను మరింతగా పదిలం చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో 30 మందికి పైగా యానాం యువతీ యువకులు ఫ్రెంచ్ వారిని వివాహం చేసుకున్నారు. ఏటా కనీసం మూడుకు పైగా వివాహాలు ఫ్రెంచ్ పౌరులతో ముడిపడుతున్నాయి. అవి కూడా పెద్దలు కూర్చిన వివాహాలు కావడం.. హిందూ సంప్రదాయం ప్రకారమే జరుగుతుండటం మరో విశేషం.
సాక్షి ప్రతినిధి, కాకినాడ: యానాంకు చెందిన దవులూరు చంద్రశేఖర్.. ఫ్రెంచ్ యువతి షావలోత్ భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి పీటలెక్కారు. కాళ్లు కడగటం.. కన్యాదానం చేయడం.. కల్యాణ ఘడియలో వధూవరులు ఒకరి శిరస్సుపై ఒకరు పరస్పరం జీలకర్ర, బెల్లం ఉంచటం.. ఆ తరువాత వధువు మెడలో వరుడు తాళి కట్టడం.. అరుంధతీ నక్షత్ర వీక్షణ.. చివరగా అప్పగింతలు వంటి వివాహ తంతుల్లో ఏ ఒక్కటీ వదలకుండా వివాహ తంతును సంప్రదాయం ప్రకారం జరిపించారు. ఆ తరువాత ఆ దంపతులిద్దరూ యానాం–పారిస్ వివాహ బంధానికి ప్రతీకగా యానాంలోనూ ఈఫిల్ టవర్ నమూనా నిర్మిం చారు.
30 మందికి పైగా..
ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. 30 మందికి పైగా పారిస్ పౌరులను మన సంప్రదాయం ప్రకారమే వివాహమాడారు. వీరిలో మంచాల, బెజవాడ, దవులూరు, చింతా, కామిశెట్టి, సలాది వంటి కుటుంబాలకు చెందిన వారున్నారు. అలాగని.. ఇవన్నీ ప్రేమ వివాహాలే అనుకుంటే పప్పులో కాలేసినట్టే. వీటిలో అధిక శాతం వివాహాలు ఇరుపక్షాల తల్లిదండ్రులు కుదుర్చుకున్నవే.
ఇక్కడి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ అంగరంగ వైభవంగా వివాహాలు చేసుకోవడానికే ఫ్రెంచ్ పౌరులు మక్కువ చూపుతున్నారు. పెళ్లికి ముందు జాతకాలు, ఫొటోలు ఇచ్చిపుచ్చుకోవడంతోపాటు ఇరు కుటుంబాల మధ్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏటా మాఘమాసంలో కేంద్రపాలిత ప్రాంతాలైన యానాం, పాండిచ్చేరి, మాహే, కారైకల్ ప్రాంతాలకు చెందిన కనీసం పది జంటలు వివాహ బంధంతో ఒక్కటవుతూ అనుబంధాల్ని పెనవేసుకుంటున్నాయి.
జాక్‌పాట్ కొట్టినట్టే..
ఫ్రెంచ్ వారితో వివాహ బంధంతో ఒక్కటైతే వరుడు లేదా వధువు జాక్‌పాట్ కొట్టినట్టే. ఫ్రెంచ్ యువతీ యువకులను వివాహం చేసుకుంటే లభించే ఫ్రెంచ్ పాస్‌పోర్టుతో వీసా లేకుండా ప్రపంచ దేశాలు చుట్టి రావచ్చు. కెనడా, ఆ్ర«ఫికా, దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా తదితర 25కు పైగా దేశాలకు వీసా లేకుండా స్వేచ్ఛగా వెళ్లిరావచ్చు. పైగా ఫ్రెంచ్ ప్రభుత్వం అమలు చేసే పథకాలను, ప్రయోజనాలను అనుభవిస్తూ హాయిగా జీవనం సాగిస్తున్నారు.
అలనాటి అనుబంధాన్ని కొనసాగిస్తూ..
కాకినాడ–కోనసీమ జిల్లాల నడుమ జాతీయ రహదారిని ఆనుకుని ఉండే యానాం పట్టణం కేంద్రపాలిత ప్రాంతమైన పాండిచ్చేరి పరిధిలో ఉంది. యానాంను రెండు శతాబ్దాల పాటు ఫ్రెంచ్ వాళ్లు పాలించారు. తమ పాలనకు స్వస్తి పలికి తిరిగి వెళ్లేప్పుడు ఇక్కడి వారికి ఐచ్చికంగా ఫ్రెంచ్ పౌరసత్వం ఇచ్చే అవకాశం కల్పించారు. అప్పట్లో సుమారు 4 వేల మంది ఉండగా.. వారిలో 70 మంది ఫ్రెంచి పౌరసత్వం తీసుకున్నారు.
ఫ్రెంచ్ పౌరసత్వం అనేది ఐచ్ఛికమని భారత్–పారిస్ మధ్య ఒప్పందం కుదిరింది. దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ ఫ్రెంచి–యానాం మధ్య అనుబంధం చెక్కుచెదరకుండా కొనసాగడం విశేషం. తొలినాళ్లలో 70 మంది ఫ్రెంచ్ పౌరసత్వం తీసుకోగా.. ఆ దేశ పౌరసత్వం ఉన్న సుమారు 100కు పైగా కుటుంబాల వారు ఫ్రాన్స్‌లోనే స్థిరపడి ఉద్యోగాలు చేసుకుంటున్నారు.
ఫ్రాన్స్‌లో ఉన్నా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు వీడకుండా ఏటా రెండు, మూడు పర్యాయాలు వచ్చి వెళుతుంటారు. యానాంలో నివసించిన తమ పూర్వీకుల సమాధులు, వారి స్వీయ అనుభవాలు నిక్షిప్తమై ఉన్న యానాం రోమన్ కేథలిక్ చర్చితోపాటు సమాధులను దర్శించుకుని వెళుతుంటారు. అలా వారి మధ్య కొనసాగుతున్న అనుబంధాన్ని ఇప్పుడు వివాహ బంధంతో ముడివేస్తున్నారు.
చెక్కుచెదరని అనుబంధం
స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచీ ఫ్రెంచ్ వారితో అనుబంధం కొనసాగుతూనే ఉంది. వారి పాలనకు మెచ్చి యానాం సహా పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతవాసులు వారితో వివాహ బంధం కోసం అమితాసక్తి చూపుతున్నారు. ఏటా యానాం సహా పాండిచ్చేరి ప్రాంతానికి చెందిన కనీసం 10 మంది ఫ్రెంచ్ వారిని సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకుంటున్నారు. – సాధనాల బాబు, ఫ్రెంచ్ కాన్సులేట్ సభ్యుడు, యానాం
మూడుముళ్లతో ఒక్కటవుతున్నారు
ఫ్రెంచ్ యువతీ, యువకులను యానాం ప్రాంత వాసులు పెళ్లిళ్లు చేసుకోవడం ద్వారా స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఉన్న ఆత్మీయతను కొనసాగిస్తున్నారు. ఫ్రెంచ్ వారు కూడా మన సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నారు. ఫ్రెంచ్ వారు తమ పూర్వికుల చరిత్రను తెలుసుకునేందుకు, సమాధులను దర్శించుకోవడం కోసం ఏటా ఒకటి, రెండుసార్లు వచ్చి వెళుతున్నారు. – కనకాల రామదాసు, ప్రముఖ న్యాయవాది, యానాం
Comments
Please login to add a commentAdd a comment