మంచి ఆహారంతోనే ఆరోగ్యం | Special Story About How Junk Food Becoming Danger To Children Health | Sakshi
Sakshi News home page

ఆహారంతోనే ఆరోగ్యం

Published Tue, Jul 16 2019 8:24 AM | Last Updated on Tue, Jul 16 2019 8:24 AM

Special Story About How Junk Food Becoming Danger To Children Health - Sakshi

సాక్షి, పార్వతీపురం(విజయనగరం) : మన దేశంలో 45 శాతం మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నట్టు ఓ సర్వే నివేదిక. ఇది నిజంగా అందరినీ కలవరపెట్టే సామాజిక సమస్య. ఇదే దేశంలోని కొద్దో, గొప్పో మంది పిల్లలు విపరీతమైన జంక్‌ఫుడ్స్‌కు అలవాటు పడి ఊబకాయులుగా తయారౌతున్న పరిస్థితి. ఈ రెండింటికీ చెందని మధ్యతరగతి పిల్లలది మరో ప్రత్యేక కేటగిరి.

ఈ పిల్లల ఆహారపు అలవాట్లు ఇటీవల కాలంలో చిత్రంగా తయారవుతున్నాయి. పట్టణాలు, నగరాల్లో నివసించే వారిలో అధికశాతం తల్లులు పిల్లలకు కేవలం తిండితినిపించడం పైనే శృతిమించిన శ్రద్ధ కనబరుస్తారని, అది బెడిసి కొట్టి మొదటికే మోసం వచ్చి పిల్లలు అసలు తినాలంటేనే మారాం చేసే మొండి ఘటాలుగా తయారవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. 

ఇష్టంగా తింటే ఒంటికి మంచిది...  
చందమామ రావే... జాబిల్లి రావే...కొండెక్కిరావే..గోగుపూలు తేవే... అంటూ చిన్నప్పుడు తల్లులు ఏంచక్కా పాటల పాడుకుంటూ పిల్లలకు గోరుముద్దలు తినిపించడమనేది కాస్తా వెనుకటి తరం వారికి చిరపరిచయమే. ఇప్పుడు అలాంటి కమనీయ దృశ్యాలు కనుమరుగైపోయి జీవితం యాంత్రికంగా తయారైపోయింది.

ఆకలివేసినా, వేయకపోయినా పిల్లలను పట్టుకుని నోట్లో తప్పనిసరిగా ఏదో ఒకటి కుక్కాలన్నట్లుగా తల్లులు బలవంతం చేయడం, పిల్లలు అందుకు ప్రతీకారంగా తినకుండా ముప్పతిప్పలు పెట్టడం, వాంతులు  చేసుకోవడం, ఆ తరువాత తన్నులు, ఆపై బుజ్జిగింపులు వంటి సంఘటనలు ప్రతి ఇంటిలో నేడు కనిపిస్తున్నాయి. చిన్న పిల్లల వైద్యుల వద్దకు వచ్చే కేసుల్లో దాదాపు 50 శాతానికి పైగా తమ పిల్లలు సరిగ్గా తినడం లేదనే ఫిర్యాదులే ఉంటాయి. ఇష్టంగా తింటేనే పిల్లల ఒంటికి మంచిదన్నది వైద్యుల సూచన. 

అలవాట్లను మార్చాల్సిందే... 
దాగుడు మూతలు, గోళీకాయలాట, బొంగరాలు, కబడ్డీ, ఖోఖో వంటి ఆటలతో బిజీగా గడపడం.. సరదాగా చదువుకోవడం.. దశాబ్దం కిందటి చదువు సంద్యల చిత్రం. కంప్యూటర్‌లో, లేదంటే సెల్‌ఫోన్లలో టెంపుల్‌రన్, హేండీక్రష్‌ లాంటి గేమ్సు ఆడడం, టీవీల్లో కార్టూన్‌ షోలకి, క్రికెట్‌ షోలకి పరిమితమైపోవడం.. పొద్దస్తమానం హోంవర్కులు, ట్యూషన్లు, పరీక్షలు, ర్యాంకులు ఇవీ నేటి పిల్లల ఆటపాటలు. శారీరక వ్యాయామం లేకపోవడంతో చిన్నారుల్లో రకరకాల ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి.

అలాగే స్వీట్లు, ఐస్‌క్రీమ్సు, పిజ్జాలు, బర్గర్లు, చాక్‌లైట్‌లు, కోక్‌ పానియాలు ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోయి కొవ్వుగా మారిపోయే జంక్‌ ఫుడ్స్‌కి పిల్లలు ఇటీవల కాలంలో బాగా అలవాటు పడిపోతున్నారు. దీనికి తోడుగా ఏమాత్రం ఆటలో శారీరక శ్రమ లేకపోవడం, పైగా చదువుల ఒత్తిళ్లు ఇవన్నీ కలగలసి చిన్నపిల్లల్లో ఊబకాయంతో పాటు ప్రవర్తనా పరమైన సమస్యలు తలెత్తేలా చేస్తున్నాయి. పిల్లల ఆహారం, అలవాట్లలో మార్పు అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement