ప్రతీకాత్మక చిత్రం
మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన రెండు మనసులు.. ముచ్చటగా మూడేళ్లు కూడా నిండకుండానే ముక్కలవుతున్నాయి. ఏడడుగుల బంధంతో జీవన ప్రయాణం సాగించిన రెండు జీవితాలు.. అర్థంలేని అపోహలతో చెరో దారిన పయనిస్తున్నాయి. దాంపత్యంలోఅన్యోన్యపు సరాగాలకు అనుమానపు అపస్వరాలు తోడై చివరకు ఎడబాటు గీతికలు ఆలపిస్తున్నాయి. పెళ్లినాడు చేసిన ఊసుల బాసలు.. అహంభావపు మంటల్లో మసవుతున్నాయి. మొత్తంగా గుమ్మానికి కట్టిన మావిడాకుల్లా పచ్చగా ఉండాల్సిన కాపురాలు విడాకుల వాకిట వడబడుతున్నాయి.
కృష్ణ ఏడాది కిందట కాళికను వివాహం చేసుకున్నాడు. వారికి పాప ఉంది. ఓ ప్రైవేటు సంస్థలో కృష్ణ ఉద్యోగం చేస్తూ భార్యతో పాటు తల్లిదండ్రుల్ని పోషిస్తున్నాడు. ఇంట్లో వారందరినీ తన భర్త కష్టపడి బతికిస్తున్నాడని భావించి వేరు కాపురం వెళదామని భర్తను కాళిక వేధించడం మొదలు పెట్టింది. భర్త అందుకు ససేమిరా అన్నాడు. తన మాట వినలేదనే కారణంగా భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్లి వరకట్న వేధింపుల కేసు పెట్టింది. చివరకు విడాకుల కోసం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధపడింది.
కోటి, రజని ఓ ప్రైవేటు ఆఫీసులులో ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల సమక్షంలో వివాహం చేసుకున్నారు. రోజూ ఆఫీసు నుంచి రావడానికి లేటవుతుందేంటని భార్య నిలదీసింది. స్నేహితులతో కొద్దిసేపు కూర్చొని వస్తున్నానని సమాధానం చెప్పాడు. అయితే, మీ స్నేహితులతోనే కాపురం చేయాలంటూ ఘర్షణకు దిగి నెలరోజులకే పుట్టింటికి వెళ్లింది. ఇదేమిటని ప్రశ్నిస్తే... అతనంటే తనకు ఇష్టం లేదని, కోర్టు నుంచి విడాకులు తీసుకుంటానని తేల్చి చెప్పింది.
గుంటూరు: అర్ధేచ ..కామేచ.. మోక్షేచ..నాతి చెరామి ..అంటూ చేస్తున్న పెళ్లినాటి ప్రమాణాలు, నేటి ఆధునిక ప్రపంచంలో ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. స్వల్ప కారణాలతో కొందరు కోర్టులు ఎక్కుతుంటే...అవగాహన లేని కారణంగా జీవితాంతం కలసి జీవించాల్సి భార్యాభర్తలు విడిపోతున్నారు. పోలీసుల కౌన్సెలింగ్‌లో కొందరు సర్దుకు పోతున్నారు. మరికొందరైతే తాము పట్టింది మూడేకాళ్లు అనే చందంగా వ్యవహరించి బంగారు భవిష్యత్‌ను అంధకారం చేసుకోవడంతో పాటు వారి పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయతలను దూరం చేస్తున్నారు. ఉమ్మడి కుటుంబాల విచ్ఛిన్నంపై సుప్రీం కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇచ్చిన తీర్పును కూడా కొందరు లెక్కచేయడం లేదంటే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మన పక్కనే లేదా మనింట్లోనే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడంతో పెళ్లి అంటేనే ఆడపిల్లలు ఆలోచనలో పడుతున్నారు. సొంత నిర్ణయాలు తీసుకుంటే ఎంత వరకు జీవితంలో సఫలం అవుతాం... ప్రేమ వివాహం చేసుకుంటే జీవితంలో నిలబడగలమా అనే సందిగ్ధంలో పడుతున్నారు.నేను చెప్పిందే వినాలి
గతంలో సంస్కృతీ, సంప్రదాయాలను గౌరవిస్తూ ఒకరి అభిప్రాయాలను మరొకరు విలువలు ఇస్తూ పిల్లలకు ఆదర్శవంతమైన తల్లిదండ్రులుగా నిలిచేవారు. ఏవైనా సమస్యలు వస్తే ఉమ్మడి కుటుంబాలు కావడంతో ఇద్దరికీ సర్ది చెప్పి వారి మధ్య మనస్పర్థలను తొలగించడానికి కుటుంబ పెద్దలు చేస్తుండేవారు. అప్పటికీ మాట విననివారు ఉంటే వారికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చి భార్యాభర్తలను ఒక్కటి చేసేవారు. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా జరుగుతోంది.
కౌన్సెలింగ్ ఇచ్చినాఫలితం శూన్యం
ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్న కుటుంబాలు ఏర్పడటం ప్రధాన కారణమని పోలీస్‌బాస్‌లు అంటున్నారు. ఒకరి నిర్ణయాలకు మరొకరు గౌరవించుకోక పోవడంతో, కొందరు మొండిగా వ్యవహరిస్తున్న కారణాలతో వారి భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. నేను చెప్పిందే వినాలి అనే ధోరణిలో అధికంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వస్తున్నాయి. వారికి సర్దిచెప్పేందుకు పెద్దలు లేకపోవడం, ఒకవేళ ఉన్నా వారి దృష్టికి సమస్యల్ని తీసుకు వెళ్లేందుకు భార్యాభర్తలు ఇష్టపడని కారణంగా రోజు రోజుకూ వరకట్న వేధింపుల కేసులు పెరుగుతూ వస్తున్నాయి. పోలీసులు కూడా సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. మనస్పర్థలతో, చిన్నచిన్న కారణాలతో విడిపోవాలనుకునే భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇందులో కొందరు మాత్రమే కలసి జీవించేందుకు ఇష్టపడుతుంటే.. అధికంగా విడాకుల కోసం నేడు కోర్టుల చుట్లూ తిరుగుతున్నారు. కొందరు మహిళలు విడాకుల కంటే ముందుగా పోలీసులను ఆశ్రయించి వరకట్న వేధింపుల కింద కేసులు పెడుతున్నారనేది బహిరంగ రహస్యం. ఇప్పటి వరకు జిల్లావ్యాప్తంగా 2016లో 762, 2017లో 854, 2018 ఏప్రియల్ నాటికి 423 కేసుల చొప్పున వరకట్న వేధింపుల కేసులు నమోదయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఉమ్మడి కుటుంబాల్లో కాపురాలకు యువతులు ససేమిరా
ఉమ్మడి కుటంబంలో కలసి జీవించేందుకు ఎక్కువ మంది యువతులు సుముఖత చూపుడం లేదు. అదేమని అడిగితే అత్త, ఆడపడచులు దెప్పిపొడుపులు ఉంటాయని ఇట్టే చెప్పేస్తున్నారు. తల్లిదండ్రులుకూడా తమ కుమార్తె ఎలాంటి సమస్యలు లేకుండా జీవించాలనే ఆలోచిస్తున్నారు. ఉమ్మడి కుటుంబంలో తమ కుమార్తె హాయిగా జీవిస్తుందనే భరోసాను నింపలేక పోతున్నారు.
కారణం ఏదైనా చిన్న కుటుంబంగా జీవించడం అలవాటు పడుతున్న నేటి పరిస్థితుల్లో ఉమ్మడి కుటుంబాలకు ససేమిరా అంటున్నారు. తల్లిదండ్రులను వదిలేసి వేరు కాపురం పెట్టేందుకు ఇష్టపడని భర్తను....వేరు కాపురం పెడితేనే కాపురానికి వస్తానని భార్య డిమాండ్ చేస్తే కోర్టును అశ్రయించి విడాకులు కోరవచ్చని 2015 అక్టోబర్ 7న సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. దాన్ని కూడా లెక్కచేయని కొందరు మహిళలు పౌరుషానికి పోయి పండంటి కాపురాన్ని కోల్పోతున్నారు. తద్వారా పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమను దూరం చేస్తున్నారు.
సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలి
హిందూ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలి. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం విచారకరం. అవగాహన, అహం కారణంగానే భార్యాభర్తల మధ్య సమస్యలు తలెత్తుతాయి. ఇద్దరూ సర్దుకు పోతే జీవితాంతం సుఖంగా జీవించవచ్చు. పచ్చని జీవితాలను నాశనం చేసుకొని పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చవద్దు.– సీహెచ్. వెంకటప్పల నాయుడు, రూరల్ ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment