శంఖారావానికి ప్రత్యేక రైళ్లు, బస్‌లు, కార్లు
Published Thu, Oct 24 2013 2:47 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి ప్రతినిధి, గుంటూరు :సమైక్య శంఖారావం.. ఎక్కడ విన్నా ఇదే మాట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ సభకు జిల్లా నుంచి ఎంత మంది ప్రజలు తరలివెళతారు.. అందుకు ఏ విధమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.. ఎలా వెళతారు..? ఈ సభ తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనే అంశాలపై అన్ని వర్గాల్లోనూ చర్చ సాగుతోంది. రాష్ట్ర విభజనను అడ్డుకొనేందుకు ధృఢ సంకల్పంతో ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించతలపెట్టిన సమైక్య శంఖారావానికి ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు, రైతుకూలీలు, సామాన్యప్రజల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. రాజధానిలోని ఎల్‌బి స్టేడియంలో ఈ నెల 26న జరగనున్న ఈ సభ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని మేధావులు భావిస్తున్నారు. దీనికి అను గుణంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు సభను విజయవంతం చేసేందుకు జోరు వర్షంలోనూ పని చేస్తున్నారు. స్వచ్ఛందంగా తరలిరానున్న ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకొంటున్నారు. మాజీ మంత్రి, ఆ పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మూడు రోజుల కిందట గుంటూరులో నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి అనేక సూచనలు చేశారు.
నియోజకవర్గాల వారీ సమావేశాలు ...
నియోజకవర్గాల సమన్వయకర్తలు పార్టీ సమావేశాలు నిర్వహిస్తూ కార్యకర్తలకు ముఖ్య బాధ్యతలు అప్పగిస్తున్నారు. రాష్ట్ర విభజన వల్ల కలగనున్న నష్టాలను వివరిస్తూ పార్టీ పంపిన కరపత్రాలను ప్రజలకు అందజేస్తున్నారు. ఇంకా విస్తృత ప్రచారం కోసం పార్టీ పంపిన పోస్టర్లను గ్రామీణ ప్రాంతాల్లో వినియోగిస్తున్నారు. పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ చిలకలూరిపేటలో బుధవారం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ హైదరాబాద్ యావత్తూ జనసంద్రంగా మారనుందన్నారు. సమైక్యవాదాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ జగన్‌కు మద్దతు పలకాలని, గ్రామాల నుంచి, పట్టణంలోని ప్రతి వార్డు నుంచి ప్రజలు తరలిరావాలని విజ్ఞప్తిచేశారు. ఇదే రీతిలో మిగిలిన నియోజకవర్గాల్లో సమన్వయకర్తలు సమావేశాలను నిర్వహించనున్నారు. శంఖారావం విజయవంతం కావాలని కోరుతూ వివిధ వర్గాల ప్రజలు గ్రామాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
మూడు ప్రత్యేక రైళ్లు, బస్‌లు, చిన్నకార్లు..
సమైక్య శంఖారావ సభకు ప్రజలు ఇబ్బంది పడకుండా వెళ్లేందుకు పార్టీ నాయకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు వల్లభనేని బాలశౌరి, కృష్ణా,గుంటూరు జిల్లాల సమన్వయకర్త ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్‌కె) గుంటూరు సిటీ కన్వీనరు లేళ్ల అప్పిరెడ్డిలు మూడు ప్రత్యేక రైళ్లను బుక్ చేశారు. ప్రతీ నియోజకవర్గం నుంచి కనీసం 30 బస్‌లు, వందలాది చిన్నకార్లతో ప్రజలను రాజధానికి తీసుకువెళ్లేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ తెలిపారు. గురజాల, మాచర్ల, ప్రత్తిపాడు నియోజకవర్గాల నుంచి బస్‌ల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందన్నారు. బాపట్ల నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు, నాయకులు ఒక రోజు ముందుగానే రాజధానికి చేరుకుంటారని తెలిపారు. సభకు హాజరయ్యే వారికి భోజన, అల్పహార ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రతీ నియోజకవర్గం నుంచి కనీసం ఐదువేలకు తగ్గకుండా ప్రజలు శంఖారావ సభకు తరలివచ్చే అవకాశం ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ముందుగానే సభావేదిక వద్దకు చేరుకోవాలని మర్రి రాజశేఖర్ సూచించారు.
Advertisement