శ్రీశ్రీ నాకు స్ఫూర్తి - సినీ డైరెక్టర్ నల్లపూసల బాబ్జీ | sree sree inspired me says cinee director nallapusala babji | Sakshi
Sakshi News home page

శ్రీశ్రీ నాకు స్ఫూర్తి - సినీ డైరెక్టర్ నల్లపూసల బాబ్జీ

Published Thu, Apr 30 2015 9:49 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 AM

sree sree inspired me says cinee director nallapusala babji

మహాకవి శ్రీశ్రీ... ఈ శతాబ్దం నాదని ఎలుగెత్తి మరీ ప్రకటించిన సాహితీభానుడు.. కవితాగ్నిహోత్రుడు! రెండు శ్రీలు ధరించిన ఈ మహాప్రస్థానయోథుడు తరతరాలుగా తెలుగువారిలో చైతన్యకాంతులు నింపగల స్ఫూర్తివంతుడు. తన ఒక్కో కవితను విప్లవ కేతనంగా మార్చి, ఒక్కో పాటను సాహిత్యపు పూతోటగా తీర్చి, ఒక్కో మాటతో తెలుగుతల్లికి ముత్యాల సరం కూర్చిన శ్రీశ్రీ ఎందరికో నిత్యం స్మరణకు వచ్చే అనితరసాధ్యుడు. ఇలా శ్రీశ్రీ ద్వారా ఉత్తేజితమైన వారెందరిలోనే తానూ ఒకడినని అంటున్నారు సినిమా డెరైక్టర్ నల్లపూసలు బాబ్జీ.

 

ఆయన ఎవరి పెళ్లికి వెళ్లినా, పుట్టినరోజు వేడుకకు వెళ్లినా ఇచ్చే గిఫ్ట్... శ్రీశ్రీ మహాప్రస్థానం మహాకవి స్ఫూర్తితో సామాజిక సమస్యలపై ఆయన కొన్ని వందల పాటలు రాశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నంది అవార్డు సహా 39 అవార్డులు దక్కించుకున్న నల్లపూసలు వంటి సామాజిక నేపథ్య సినిమాను తొలి ప్రయత్నంలోనే తీసి ఉత్తమ దర్శకుడనిపించుకున్నారు. సామాజిక ప్రయోజనమే లక్ష్యంగా తీస్తున్న వేటకొడవళ్లు షూటింగ్ కోసం వైజాగ్ వచ్చిన ఆయనతో  సిటీప్లస్ తో మాట్లాడారు.
 
 మహాకవి శ్రీశ్రీ అంటే నాకు ఎంతో ఇష్టం. శ్రీశ్రీ నడయాడిన నేల అనేగాకుండా ఆయనకు రోజుకోవిధంగా కనిపించి మెప్పించిన విశాఖ అన్నా అంతే ఇష్టం. ఈ నేలపై సాహిత్య సౌరభాలు విరబూశాయి. ఎందరో మహనీయులకు జన్మనిచ్చిన విశాఖ, ఉత్తరాంధ్ర అంటే నాకెంతో మక్కువ. అందుకే వైజాగ్‌కు రాకముందే ఈ ప్రాంతానికి అభిమాని అయిపోయాను.
 శ్రీశ్రీ స్ఫూర్తి
 మాది ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు. తాత, నాన్న కమ్యూనిస్టు పార్టీలో పనిచేశారు. నేను స్కూల్‌లో ఉన్నప్పుడే శ్రీశ్రీ మహాప్రస్థానం చదవమని నాన్న చెబుతుండేవారు. తొలుత అందులో భావం నాకు అర్థంగాకపోయినా తర్వాతర్వాత చదువుతున్న కొద్దీ ఏదో ఉత్తేజం నన్ను కదిలించేది. చుట్టూ ఉన్న సమస్యలపై నేనూ స్పందించేవాణ్ణి. క్రమంగా పార్టీ బాట పట్టా. అప్పట్లో నాతోపాటు చాలా మంది చేతుల్లో మహాప్రస్థానం కనిపించేది. ఆ స్ఫూర్తితో నేనూ పాటలు రాశాను. స్టూడెంట్‌గా ఉన్నప్పుడే ఎస్‌ఎఫ్‌ఐలో కీలక బాధ్యతలు వహిస్తూనే ప్రజలను చైతన్య పరిచేందుకు ప్రజానాట్యమండలిలో చేరా. నేను రాసిన పాటల్లో వంద వరకూ పాపులర్ అయ్యాయి.


 మహాప్రస్థానం అద్వితీయం
 నన్ను నేను తీర్చిదిద్దుకోవడంలో మహాప్రస్థానం పాత్ర కీలకం. అందుకే ఎవరి పెళ్లికి వెళ్లినా, పుట్టినరోజు ఫంక్షన్ అయినా దీన్నే బహుమతిగా ఇస్తా. ఇలా ఇప్పటివరకు ఐదు వేల పుస్తకాలు పంచా. వారు అప్పుడుకాకపోయినా తర్వాత ఏదో ఒక సందర్భంలో మహాప్రస్థానం చదువుతారు. ఆ పుస్తకం ఆలోచింపజేస్తుంది. కదిలిస్తుంది. మార్పు తెస్తుంది.
 సమాజం కోసం
 చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. మాదాల రంగారావు సిన్మాలు అప్పట్లో నన్ను చాలా ప్రభావితం చేశాయి. దీంతో స్వీయ దర్శకత్వంలో 1997లో నల్లపూసలు సినిమా తీశా. ఈ చిత్రం నంది సహా 39 అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ నూతన దర్శకుడిగా బంగారు నంది అందుకున్నా. భరతముని సహా నాలుగు అవార్డులు, మహానటి సావిత్రి అవార్డు వంటివన్నీ వచ్చాయి. దీంతో నల్లపూసల బాబ్జీగా నా పేరు స్థిరపడిపోయింది. 2000 సంవత్సరంలో ఎన్టీఆర్‌నగర్ సినిమా తీశా. దక్షిణభారతదేశంలోని ప్రముఖ హీరోల డూప్‌లనే హీరోలుగా చేసి తీసిన తొలి సినిమా ఇదే. దీనికి 18 అవార్డులు వచ్చాయి. అంతేకాదు రాష్ట్రంలో ఉన్న డూప్‌లు చాలామందికి ఉపాధి దొరికింది. తెలుగు సినిమా పితామహుడు రఘుపతి వెంకయ్యనాయుడు జీవితచరిత్ర ఆధారంగా తీస్తున్న సినిమా షూటింగ్ పూర్తిఅయింది. మే నెలలో రిలీజ్ చేస్తాం. ప్రస్తుతం వేటకొడవళ్లు సినిమా షూటింగ్ వైజాగ్‌లో చేస్తున్నాం.
 వైజాగ్ వాళ్లకు చాన్స్
 ఆస్తులు, బ్యాంకు బ్యాలెన్స్‌పైనే కాదు తోటివారిపైనా కాస్త ప్రేమ చూపండనే కాన్సెప్ట్‌తో వేటకొడవళ్లు సినిమా తీస్తున్నాం. దీనిలో సగం మంది విశాఖకు చెందినవారే నటిస్తున్నారు. హీరోలు ఐదుగురు కొత్తవారే. కనిపారేస్తున్నవారే చెత్తకుండీల్లో, రైల్వే స్టేషన్‌ల్లో అష్టకష్టాల మధ్య పెరిగి యాదృచ్ఛికంగా సంఘ విద్రోహశక్తులుగా ఎలా మారిపోతున్నారో ఈ సినిమాలో చూపిస్తున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement