వెంకన్న సన్నిధిలో లంక ప్రధాని దంపతులు
సాక్షి, తిరుమల: శ్రీలంక ప్రధానమంత్రి రణీల్ విక్రమ సింగే , తన సతీమణి మైత్రి విక్రమ సింగేతో కలసి గురువారం వేంకటేశ్వరుని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లా డారు. శ్రీవారిని దర్శించుకోవడంతో ఆధ్యాత్మిక అనుభూతి, ప్రశాంతత చేకూరిందన్నారు. తమిళ జాలర్ల నిర్భంద అంశంపై పరిశీలించి తగిన విధంగా చర్యలు చేపడతామని ఆ దేశ మంత్రి దిగంబరం విలేకరులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. అంతకుముందు విక్రమ సింగే దంపతులకు టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావులు ప్రత్యేక దర్శనం కల్పించి, శ్రీవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాలు, 2017 సంవత్సరం డైరీ, క్యాలెండర్ అందజేశారు. వారి వెంట రాష్ట్ర మంత్రి నారాయణ కూడా ఉన్నారు.