
సాక్షి, తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనార్థం శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన శనివారం తిరుమలకు చేరుకున్నారు. సతీమణి జయంతి పుష్పకుమారి, ఇతర కుటుంబ సభ్యులు, ప్రతినిధులు మొత్తం 19 మందితో కలసి వచ్చారు. పద్మావతి అతిథిగృహాల వద్ద జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. ఆదివారం తొలి వేకువ 3 గంటలకు సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకోనున్నారు.
శ్రీవారి పాదాలు దర్శించుకుని..
శనివారం సాయంత్రం శ్రీలంక అధ్యక్షుడు తిరుమల నారాయణగిరిలోని శ్రీవారి పాదాలను దర్శించుకున్నారు. శ్రీలంక అధ్యక్షుడు బెంగళూరు నుంచి రోడ్డుమార్గంలో తిరుమలకు వచ్చిన సందర్భంగా కర్ణాటక, చిత్తూరు, తిరుపతి అర్బన్‌జిల్లా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.