కలియుగ ప్రత్యక్ష దైవం, అలంకార ప్రియుడైన శ్రీవేంకటేశ్వరస్వామి హృదయంపై పుష్ప దేవతలు సేదతీరాయి. స్వామి వారి పుష్పయాగం కోసం తరలించిన సుగంధ భరిత పుష్పాలను చూసి భక్తులు తన్మయం చెందారు. టీటీడీ ఉద్యోగులు, శ్రీవారి సేవకులు స్వామి సేవకు పుష్పాలను మోసుకె ళ్లడం పూర్వజన్మ సుకృతంగా భావించారు.
తిరుమల, న్యూస్‌లైన్: శ్రీవారి ఆలయంలో ఆదివారం పుష్పయాగం కార్యక్రమాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. టీటీడీ గార్డెన్ విభాగం వారు స్వామివారి కైంకర్యానికి ఎనిమిది టన్నుల బరువు కలిగిన 12 రకాల పుష్పా లు, 6 రకాల పత్రాలను వెదురు బుట్టల్లో తరలించా రు. ఇందులో చామంతి, లిల్లీ, వృక్షి, రోజాలు, మల్లె లు, కనకాంబరాలు, తామరలు, కలువలు, మొగలిరేకులు, మాను సంపంగి వంటి పుష్పాలతో పాటు మరువం, దవణం, బిల్వం, కదిరిపచ్చ, పన్నీరాకు, తులసి పత్రాలు ఉన్నాయి.
అలాగే ఈ ఏడాది అత్యంత ధర కలిగిన మదిలం పుష్పాలను కూడా పుష్పయాగంలో వినియోగించారు. కార్యక్రమంలో భాగంగా తిరుమల పాపవినాశనం మార్గంలోని టీటీడీ గార్డెన్ నుంచి వివిధ రకాల సుగంధ భరిత పుష్పాలను టీటీడీ ఉద్యోగులు, శ్రీవారి సేవకులు గోవింద నామ స్మరణల మధ్య ఆలయం వద్దకు గంపలతో ఊరేగింపుగా తీసుకువచ్చారు. ఇన్ని రకాల పుష్పాలను ఒకేసారి చూసిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. మరికొంత మంది సేవకులు స్వామి కైంకర్యానికి పుష్పాలను తీసుకెళ్లటం పూర్వజన్మ సుకృతంగా భావించారు.
నా జీవితంలో ఇన్ని రకాల పుష్పాలను చూడలేదు
నేను శ్రీవారి సేవ చేయటం కోసం తిరుమలకు వచ్చాను. నా జీవితంలో ఇన్ని రకాల పుష్పాలను ఎక్కడా చూడలేదు. మళ్లీ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనాలనిపిస్తోంది. నాతో పాటు నా స్నేహితులు కూడా పుష్పయాగంలో వినియోగించే పుష్పాలను తీసుకువచ్చారు.
- వరలక్ష్మీ, ఆకివీడు
పూర్వజన్మ సుకృతం
స్వామి సేవకు నా చేతుల మీదుగా పుష్పాలను తీసుకురావటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. గోవిందనామ స్మరణలు చేస్తూ పుష్పాలను తీసుకురావటం ఎంతో సంతోషాన్ని కల్గించింది. ఇది దేవుడిచ్చిన ఓ గొప్ప వరంగా, అదృష్టంగా భావిస్తున్నాను.
- దేముళ్లు, విశాఖపట్నం
పుష్పాభిషేకం
Published Mon, Nov 11 2013 3:50 AM | Last Updated on Fri, Nov 9 2018 6:29 PM
Advertisement
Advertisement