ముగ్ధ మనోహరం | Srisailam Brahmotsavam Special Story | Sakshi
Sakshi News home page

ముగ్ధ మనోహరం

Published Fri, Mar 1 2019 9:54 AM | Last Updated on Fri, Mar 1 2019 9:54 AM

Srisailam Brahmotsavam Special Story - Sakshi

గ్రామోత్సవం నిర్వహిస్తున్న దృశ్యం

శ్రీశైలం: శ్రీగిరి కొండల్లో వెలసిన భ్రమరాంబా సమేత శ్రీమల్లికార్జున స్వామిఅమ్మవార్లు గురువారం రాత్రి   మయూర వాహనంపై ముగ్ధ మనోహరంగా దర్శనమిచ్చారు. దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకున్న భక్తులు ఓం హర శంభోశంకరా... శ్రీశైల మల్లన్నా పాహిమాం.. పాహిమాం అంటూ పురవీధుల్లో సాగిలపడ్డారు. ఆలయ ప్రాంగణంలోని అలంకార మండపంలో ఉత్సవ మూర్తులను మయూర వాహనంపై ఉంచి వేదమంత్రోచ్ఛారణల మధ్య మంగళవాయిద్యాల నడుమ అర్చకులు, వేదపండితులు  శాస్త్రోక్తంగా వాహన పూజలను నిర్వహించారు. అనంతరం వాహన సమేతులైన శ్రీ స్వామిఅమ్మవార్లను ఆలయ ప్రాంగణం నుంచి ఊరేగిస్తూ కృష్ణదేవరాయుల గోపురం మీదుగా రథశాల వద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం నందిమండపం, బయలువీరభద్రస్వామి మండపం చేరుకొని తిరిగి రాత్రి 9.30 గంటలకు  ఆలయ ప్రాంగణం చేరింది. ఈ గ్రామోత్సవంలో లక్షలాది మంది భక్తులు స్వామిఅమ్మవార్లను దర్శించుకొని కర్పూర నీరాజనాలు అర్పించి పునీతులయ్యారు . ఈ కార్యక్రమంలో ఈఓ  శ్రీరామచంద్రమూర్తి, ట్రస్ట్‌బోర్డ్‌ చైర్మన్‌ వంగాల శివరామిరెడ్డి, సభ్యులు చిట్టిబొట్ల భరధ్వాజశర్మ, చాటకుండ శ్రీనివాసులు,మాజి ఈఓ శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

నేటి రాత్రి వరకే మల్లన్న స్పర్శదర్శనం  
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శుక్రవారం రాత్రి వరకు మాత్రమే మల్లన్న స్పర్శదర్శనాన్ని ఏర్పాటు చేసినట్లు ఈఓ శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. శనివారం తెల్లవారుజాము నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు మల్లికార్జునస్వామివార్ల అలంకార (దూర) దర్శనాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.  శివస్వాములు,  సాధారణ భక్తజనంతో పాటు వీఐపీలు, వీవీఐపీలకు కూడా మల్లన్న స్పర్శదర్శనం శివరాత్రి ముగిసే వరకు  ఉండదని  పేర్కొన్నారు.  

పట్టు వస్త్రాలు సమర్పించిన కాణిపాక దేవస్థానం:
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో శివరాత్రి పర్వదినాన జరిగే స్వామిఅమ్మవార్ల కల్యాణోత్సవానికి   కాణిపాకవరసిద్ది వినాయక దేవస్థానం తరపున గురువారం ఉదయం  పట్టు వస్త్రాలను సమర్పించారు. కాణిపాకం దేవస్థానం  ఈఓ పూర్ణచంద్రారావు, అర్చక వేదపండిత బృందం స్వామిఅమ్మవార్లకు పట్టువస్త్రాలు, ఫలపుష్పాదులకు శాస్త్రోక్త పూజలు చేసి స్వామిఅమ్మవార్లకు సమర్పించారు.  రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి కళా వెంకటరావు శుక్రవారం సాయంత్రం సంప్రదాయానుసారం పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.  

ఆకట్టుకున్నసాంస్కృతిక ప్రదర్శనలు
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తుల కోసం దేవస్థానం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఏలూరు ఉషాబృందం వారి భరతనాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రముఖ సినీ సంగీత దర్శకులు, గాయకులు కొండూరు నిహాల్, పాడుతా తీయగా విజేతలు శ్రీప్రణతి, సాయి రమ్య, లక్ష్మీమేఘన, ప్రణవ్, చేతన్, లాస్య ప్రియ, జి.సరిగమ విజేత దివ్య మాలిక, బోల్‌బేబీ బోల్‌ విజేత అఖిల్, శర్మిషలు ఆలపించిన భక్తి గేయాలు భక్తులకు వీనులవిందయ్యాయి. అలాగే శివదీక్షా శిబిరాల వద్ద వినాయక నాట్య మండలి వారి సతీఅనసూయ నాటక ప్రదర్శన శ్రీశైలం ప్రాజెక్ట్‌ కె. ప్రసాద్‌రావు బృందం వారి మోహిని భస్మాసుర, శ్రీశైలం రాములు నాయక్‌ బృందం వారి నాటక ప్రదర్శనలు అర్ధరాత్రి వరకు భక్తులను అలరించాయి.     

మాఘమాసంలో శివుడిని  బిల్వదళాలతో పూజించిన వారికి శివలోక ప్రాప్తి కలుగుతుందని పురాణాల్లో ఉంది. దీంతో మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి పర్వదినం రోజున ద్వాదశి జ్యోతిర్లింగ క్షేత్రంలో వెలసిన శ్రీశైలమల్లికార్జునస్వామివార్లను అష్టాదశ శక్తిపీఠంగా వెలసిన శ్రీభ్రమరాంబాదేవిని దర్శించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి ఈ క్షేత్రానికి పాదయాత్రతో భక్తులు చేరుకుంటుంటారు. శ్రీశైల మల్లికార్జునస్వామిని శక్తికొలది బిల్వపత్రాలతో, అడవిలో కోసుకొచ్చిన పూలు, పత్రిని సమర్పించి తమ కోర్కెలను చెప్పుకుంటారు. మహాశివరాత్రి పర్వదినం నాడు స్వామివార్ల పాగాలంకరణ దర్శనం చేసుకుని బ్రహ్మోత్సవ కల్యాణాన్ని వీక్షించి, ఆ తరువాత రోజు జరిగే మల్లన్న రథోత్సవ వేడుకను కనులారా తిలకించి తిరుగు ప్రయాణమవుతారు.

నేడు శ్రీశైలంలో...
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదవ రోజు శుక్రవారం శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను  రావణవాహనంపై ఆవహింపజేసి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. వాహన సమేతులైన స్వామిఅమ్మవార్లను రథశాల నుంచి నందిమండపం, అంకాలమ్మగుడి, బయలువీరభద్రస్వామిఆలయం వరకు ఊరేగిస్తారు.  ప్రత్యేక పూజలలో భాగంగా శుక్రవారం ఉదయం 7.30గంటలకు నిత్యహోమ బలిహరణలు, జపానుష్ఠానములు, నిర్వహిస్తారు ఆ తర్వాత శ్రీ స్వామివార్లకు విశేషార్చనలు, అమ్మవారికి నవావరణార్చనలు చేస్తారు. సాయంత్రం 5.30 గంటల నుంచి నిత్యపూజలు, అనుష్ఠానములు, నిత్యహవనములు, బలిహరణలను సమర్పిస్తారు.  

శివ పూజా ఫలితం ఇలా..
చైత్రమాసంలో శివుని నృత్యగీతాలతో సేవిస్తూ దర్భపూలతో పూజిస్తే బంగారం లభిస్తుంది.
వైశాఖమాసంలో శివున్ని నేతితో అభిషేకించి,తెల్లమందారాలతో పూజిస్తే అశ్వ మేధ యాగం చేసిన ఫలితం లభిస్తుంది.  
జ్యేష్ట మాసంలో పెరుగుతో అభిషేకించి, తామర పూలతో పూజించిన వారు ఉత్తమ గుణాలను పొందుతారు.  
ఆషాఢమాసంలో స్వామికి గుగ్గిలంతో ధూపం వేసి, పొడవాటి తొడిమలు గల పూలతో పూజిస్తే బ్రహ్మాలోకప్రాప్తి కలుగుతుంది.  
శ్రావణమాసంలో ఏకభుక్తం అంటే మధ్యాహ్నం భోజనం చేసి, రాత్రివేళలో ఉపవాసం ఉంటూ, గన్నేరు పూలతో శివున్ని పూజించిన వారికి వేయి గోవులను దానం చేసిన ఫలితం లభిస్తుంది.  
భాద్రాపదమాసంలో ఉత్తరేణి పూలతో శివున్ని పూజించినవారు మరణాంతరం రుద్రలోకానికి చేరుకుంటారు.
ఆశ్వీయుజమాసంలో జిల్లేడు పూలతో శివున్ని అర్చించిన వారు శివలోకాన్ని పొందుతారు.  
కార్తీకమాసంలో శివున్ని పాలతో అభిషేకించి జాజిపూలతో పూజించినవారు శివసాన్నిధ్యానికి చేరుకుంటారు.
మార్గశిరమాసంలో పొగడపూలతో పూజించిన వారు కైలాసాన్ని చేరుకుంటారు.
పుష్యమాసంలో శివున్ని ఉమ్మెత్త పూలతో పూజించిన వారు పరమపదాన్ని పొందుతారు.  

పూలు    – ఫలం
పొగడ    శివానుగ్రహం
గన్నేరు    ధనం  
జిల్లేడు    సిరిసంపదలు  
ఉమ్మెత్త    మోక్షం  
నల్లకలువ    సుఖ సంతోషాలు
ఎర్రతామర    రాజ్యాధికారం
తెల్లతామర    ఉన్నతమైనపదవులు
సంపెంగ     కోరిన కోరికలు
తెల్లజిల్లేడు    అనుకున్న పనులు  
బ్రహ్మచారులు సన్నజాజి పూలతో శివున్ని పూజిస్తే గుణవంతురాలైన కన్యతో వివాహం  
ముత్తైదువులు గరికపూలతో పూజిస్తే ఐదోతనం వృద్ధి  
మల్లెపూలతో శివలింగాన్ని పూజిస్తే  లౌకిక విద్యలు,ఆధ్యాత్మిక విద్యలు
కడిమి పూలతో శివున్ని పూజించిన విజయం
దర్భపూలతో పూజలు చేస్తే ఆరోగ్యం
బిల్వదళాలతో పూజిస్తే దారిద్య్రం తొలగి,సకల కోరికలు సిద్ధిస్తాయి.  
ఏ పూలతో పూజించినా     శివపూజలో చిత్తశుద్ధి ముఖ్యం

3 నుంచి శ్రీశైలానికి బైక్‌లు, ఆటోలు నిషేధం
ఆత్మకూరురూరల్‌: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం ఘాట్‌ రోడ్‌లో వాహనాల రాకపోకలపై పోలీస్, రవాణా శాఖ అధికారులు నియంత్రణ విధించారు. ఈమేరకు గురువారం ఆత్మకూరు సీఐ బత్తల కృష్ణయ్య తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీశైలం యాత్రికులకు పలు సూచనలు చేశారు. మార్చి 3వ తేదీ నుంచి ప్రకాశం జిల్లాలోని దోర్నాల – శ్రీశైలం ఘాట్‌ రోడ్‌లో  బైక్‌లు, ఆటోలను నిషేధించినట్లు తెలిపారు. సరుకు రవాణా చేసే వాహనాలలో ప్రయాణం చట్ట విరుద్ధమని, ఈ వాహనాలను కూడా శ్రీశైలానికి అనుమతించడం లేదని ఆయన స్పష్టం చేశారు. మహాశివరాత్రి రోజున మార్చి 4న సాయంత్రం 6 గంటల నుంచి దోర్నాల నుంచి శ్రీశైలానికి పూర్తిగా వాహనాల నిషేధం అమలులో ఉంటుందన్నారు. పాగాలంకరణ తరువాత శ్రీశైలం నుంచి దిగువకు వచ్చే వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎగువకు వాహనాలను నిషేధించామన్నారు. ఆత్మకూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బైర్లూటీ లో వాహనాలను నిలిపివేస్తామన్నారు. సమావేశంలో ఆత్మకూరు ఎస్‌ఐ రమేష్‌ కూడా ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement