భీమునికొలను అటవీమార్గంలో పాదయాత్రగా వస్తున్న భక్తులు
శ్రీశైలం: శ్రీశైల మహాక్షేత్రంలో ఫిబ్రవరి 25 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభం కాగా గడిచిన నాలుగైదు రోజుల నుంచి శివరాత్రి భక్తుల హడావిడే కనిపించడంలేదు. సా«ధారణంగా ఏటా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగానే భక్తుల తాకిడి మొదలవుతోంది. ఉత్సవాలు ఆరంభమైన 4వ రోజుకే శ్రీశైలం అంతా భక్త జనసంద్రంగా మారుతోంది. ఇదంతా ఊహించుకుని దేవస్థానం అధికారులు మహాశివరాత్రి పర్వదినానికి మూడు రోజుల ముందుగానే స్పర్శదర్శనాన్ని నిలిపివేస్తామని ప్రకటించారు. అయితే ఈ ఏడాది భక్తుల రద్దీ ఊహించినంత మేర లేకపోవడంతో శుక్రవారం రాత్రి 7.30 వరకు గర్భాలయ దర్శనాలను అనుమతించాలనే నిర్ణయం తీసుకున్నారు.
గత నెలలో ట్రస్ట్‌బోర్డు సమావేశంలో ఫిబ్రవరి 28 వరకు ఇరుముడు స్వాములకు స్పర్శదర్శనాన్ని అనుమతించాలని రద్దీకి అనుగుణంగా భక్తుల మనోభావాలనుసరించి మార్చి 1 వరకు ఏర్పాటు చేయాలని చైర్మన్ వంగాల శివరామిరెడ్డి, సభ్యులు తీర్మానించారు. కాని ఊహించినంతగా భక్తుల రద్దీ కనపడకపోవడం చంద్రావతి కల్యాణ మండపం నుంచి ప్రారంభమైన శివదీక్షా స్వాముల క్యూ ఇప్పటి వరకు పూర్తిగా నిండిన రోజే లేకపోవడం గమనార్హం. ఫిబ్రవరి 28 వరకే ఇరుముడి స్వాములకు గర్భాలయ దర్శనం ఉంటుందని ప్రచారం జరగడం ఒక కారణం కాగా, స్పర్శదర్శనానంతరం తమ తమ గ్రామాలకు చేరుకుని మహాశివరాత్రిన తమ స్వగ్రామంలోని శివాలయల్లో దీక్షా విరమణ చేయవచ్చునని కుటుంబ సభ్యులతో కలిసి ఉండవచ్చుననే ఆలోచనతో చాలా మంది స్వాములు ఇళ్లకు వెళ్తున్నట్లు తెలుస్తుంది.
బోసిపోయిన నల్లమల దారులు..
గత ఏడాది ఉత్సవాల ఆరంభమైనన రెండవ రోజు నుంచే రద్దీ ప్రారంభం అయ్యేది. కనీసం 50 నుంచి 80 వేల వరకు దర్శించుకునే వారు. అయితే ఈ ఏడాది స్వామిఅమ్మవార్లను ఉత్సవాలు ఆరంభమైన నాటి నుంచి కూడా ప్రతి రోజూ 25 వేల నుంచి 30 వేలకు మించి దర్శనాలు జరగలేదనే అభిప్రాయాన్ని ఆలయ అధికారులు, సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు. అలాగే నాగలూటి, పెచ్చెర్వు, భీమునికొలను, కైలాసద్వారం ద్వారా శ్రీశైలం చేరుకుని పాదయాత్ర భక్తుల సంఖ్యకూడా గణనీయంగా తగ్గినట్టు కన్పిస్తుంది. ఈ ఏడాది సోమవారం మహాశివరాత్రి పర్వదినం రావడంతో శుక్రవారం నుంచి రద్దీ పెరిగే అవకాశం ఉంది.
రఅన్నదాన కేంద్రాలు ఖాళీ
సాధారణంగా ఉదయం 10.30 వరకు దేవస్థానం అన్నపూర్ణభవన్‌లో స్వాములకు, శివస్వాములకు అల్పాహారాన్ని ఏర్పాటు చేస్తారు. అనంతరం 11.30 గంటల నుంచి సాంబార్ అన్నం, పెరుగన్నం,సాధారణభక్తులకు భోజన సౌకర్యం కల్పిస్తుంటారు. అయితే వండుతున్న పదార్ధాలు కూడా మిగిలే పరిస్థితి నెలకొని ఉండడంతో అన్నపూర్ణభవన్ అధికారులు వృధాను నియంత్రించడం కోసం రద్దీకి అనుగుణంగా అప్పటికప్పుడు వంటలు తయారు చేస్తున్నారు.
3 తర్వాతనే బందోబస్తు..
రాష్ట్ర ముఖ్యమంత్రి కర్నూలు పర్యటన మార్చి 2కు వాయిదా పడడంతో శ్రీశైలానికి చేరాల్సిన బందోబస్తు సిబ్బంది సీఎం పర్యటనకు కేటాయించినట్లు తెలుస్తోంది. మార్చి 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పూర్తి స్థాయి బందోబస్తు ఉండే అవకాశం ఉంది.
పరీక్షలతోనే రద్దీ తగ్గుదల
బ్రహ్మోత్సవాల్లో రద్దీ తగ్గడానికి ఇప్పటికే ఇంటర్ మీడియట్, పరీ క్షలు ప్రారంభం కావడంతో మరో 2 వారాల తరువాత 10వ తరగతి పరీక్షలు కూడా ఉండడంతో రద్దీ తగ్గడానికి ఈ పరీక్షలు కూడా ఓ కారణమేననే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది. సాధారణంగా శివరాత్రి వరకు ఇక్కడే శివ స్వాములు.. ఈ ఏడాది తమ పిల్లలకు పరీక్షలు ఉండటంతో ఇరుముడులను సమర్పించుకుని స్వగ్రామాలకు తిరుగు ప్రయాణమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment