
‘సృజన’ డీవీడీ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ఎందరో అమరులు, సాహితీవేత్తల కృషి ఫలితంగానే ‘సృజన’ పత్రిక పాఠకులను ప్రభావితం చేసిందని విప్లవ రచయితల సంఘం(విరసం) నేత వరవరరావు అన్నారు. మిత్రమండలి సహకారంతో ఈ పత్రిక మొదలైందని తెలిపారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సృజన 200 సంచికల డీవీడీని విరసం నేత చలసాని ప్రసాద్ ఆవిష్కరించి వరవరరావుకు అందజేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. సృజన ఉన్నత ప్రమాణాలు పాటించి, సమాజాన్ని ప్రభావితం చేసే ఎన్నో రచనలను వెలువరించిందన్నారు. సృజన సంపాదకురాలు హేమలత, రచయితలు ఆశారాజు, జీవన్‌కుమార్, ప్రొఫెసర్ ఎన్.గోపి, బాల్‌రెడ్డి, ఆకుల భూమన్న, అల్లం నారాయణ, టంకశాల అశోక్, పీసీ నర్సింహారెడ్డి, సోమంగి వేణుగోపాల్, డీఎస్ రాములు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.