ఢిల్లీ: ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా (Press Club of India) మేనేజింగ్ కమిటీ మెంబర్‌గా తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్టు పబ్బ సురేశ్‌బాబు విజయం సాధించారు. ఢిల్లీలోని పీసీఐలో ఎన్నికల పోలింగ్ శనివారం జరగగా.. ఆదివారం ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం 1357 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 85 శాతం ఓట్లతో గౌతమ్ లహిరి ప్యానెల్ విజయం సాధించింది. తెలంగాణ బిడ్డ పాలమూరు జిల్లా నడిగడ్డ గద్వాల ప్రాంతానికి చెందిన పబ్బ సురేశ్ 773 ఓట్లతో మేనేజింగ్ కమిటీమెంబర్‌గా ఎన్నికయ్యారు.
కాగా, ఫలితాల అనంతరం సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. పీసీఐ మేనేజింగ్ కమిటీ మెంబర్‌గా గెలుపొందడం సంతోషంగా ఉందన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న ప్యానెల్ దేశ వ్యాప్తంగా జర్నలిస్తుల హక్కుల కోసం పార్లమెంట్ వేదికగా పోరాడుతుందని చెప్పారు. జర్నలిస్ట్ లపై ఎలాంటి దాడులు, సంఘటనలు జరిగినా ఖండించిడంతో పాటు.. వారికి న్యాయం చేకూర్చడంలో ముందుందన్నారు.
ఇకపై తెలంగాణ, ఏపీ జర్నలిస్టుల వాయిస్ వినిపించేందుకు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని తెలిపారు. తన గెలుపుకోసం సహకరించి ఓట్లతో మద్దతు తెలిపిన పీసీఐ మెంబర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఎన్నికల్లో గౌతమ్ లహిరి ప్యానెల్ మొత్తం బంపర్ మెజారిటితో గెలిచారు.పలువురు స్వతంత్రులుగా బరిలోకి దిగారు.
Comments
Please login to add a commentAdd a comment