
వైఎస్ విగ్రహానికి పూలమాల వేస్తున్న నాయకులు
మైలవరం (వైఎస్సార్ కడప): టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రజలకు సంక్షేమ పథకాలు సరిగా అందడం లేదని వైఎస్సార్‌సీప జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త సుధీర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ అల్లె ప్రభావతి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని ధన్నవాడ గ్రామంలో గడపగడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో కడప మేయర్ సురేష్‌బాబు, కమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, మాజీ జెడ్పీటీసీ అల్లె చెన్నారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీతోనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. నియోజకవర్గంలో గాలేరు– నగరి వరదకాలువ పనులు పూర్తి చేసి గండికోటకు, మైలవరానికి కృష్ణా జలాలు తెప్పించిన ఘనత దివంగత సీఎం వైఎస్‌కే దక్కుతుందన్నారు. పార్టీ ఫిరాయించిన మంత్రి ఆదినారాయణరెడ్డి తన స్వలాభం మాత్రమే చూసుకుంటూ ప్రజా సమస్యల గురించి పట్టించుకోవడం లేదన్నారు.
రెండేళ్ల కిందట పార్టీ ఫిరాయించిన మంత్రి వందరోజుల ప్రణాళికలో భాగంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే మంత్రి, ఆయన కుమారుడు, బంధువులు మాత్రమే అభివృద్ధి చెందారని, నియోజకవర్గంలో సమస్యలన్నీ అలాగే ఉన్నాయని చెప్పారు.ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల వద్దనుంచి భూములు కొనుగోలు చేసి దాదాపు 30 సంవత్సరాలైనా ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టలేదు. దీంతో వైఎస్సార్‌సీపీ రైతుల తరఫున పోరాటం చేస్తే మంత్రి ఆదినారాయణరెడ్డి రైతులపైనా, వైఎస్సార్‌సీపీ నాయకులపైనా అక్రమ కేసులను పెట్టించారన్నారు. ఏసీసీ బాధితులకు న్యాయం చేస్తానని చెప్పిన మంత్రి వారికి ఎటువంటి పరిహారం ఇప్పించలేకపోయారన్నారు. ఈ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగిపోయారన్నారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలు అందరికీ అందేలా కృషి చేస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో అధ్యక్షుడు శివగురివిరెడ్డి, వద్దిరాల రామాంజనేయల యాదవ్ జమ్మలమడుగు పట్టణ అధ్యక్షులు పోరెడ్డి మహేశ్వరరెడ్డి, పోచిరెడ్డి, చిన్న కొమెర్ల రామలింగారెడ్డి, ఆయా గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.