రుణమాఫీ మమ
- మూడో జాబితా విడుదల
- ఫిర్యాదులు 29,600..వచ్చింది కొందరికే..
- మొదటి, రెండో విడత అర్హుల జాబితాలో నేటికి జమకాని మాఫీ సొమ్ము
- బాబును నమ్మి అప్పుల ఊబిలో కూరుకుపోయిన అన్నదాతలు
నెల్లూరు(అగ్రికల్చర్): రుణమాఫీ మూడో విడత లబ్ధిదారుల జాబితాను రాష్ట్రప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఇప్పటికే మొదటి, రెండవ విడత లబ్ధిదారుల ఖాతాల్లో మాఫీ సొమ్ము జమకాలేదు. మూడో విడతలో జిల్లా నుంచి 29,600 రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో కొన్ని దరఖాస్తులను ప్రభుత్వం వివిధ కారణాలతో పక్కన పెట్టినట్లు సమాచారం. రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన మూడో విడత జాబితాలో సగంమందే అర్హత సాధించినట్లు తెలుస్తోంది. వీరికి రూ.58.12 కోట్ల వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
పలురకాల ఆంక్షలు, వడపోతల అనంతరం తయారుచేసిన జాబితాల్లోని లబ్ధిదారుల ఖాతాల్లో 20 శాతం రుణమాఫీ మెత్తం జమకాలేదు. కొద్దిమంది ఖాతాల్లో 20 శాతం మాఫీ సొమ్మ జమ అయినా వడ్డీకి కూడా సరిపోకపోవడంతో అసలు, వడ్డీ చెల్లించాలని బ్యాంకర్లు రైతులపై ఒత్తిడి పెంచారు. అప్పులు చెల్లించలేక, ఖరీఫ్ సాగుకు రుణాలు పొందలేక రైతులు అధిక వడ్డీకి ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సిన దుస్థితి నెలకొంది. జాబితాల్లో తప్పులను సరిచేయాలని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఫిర్యాదుల కేంద్రంలో దరఖాస్తు చేసుకున్న రైతులు జాబితా విడుదల కోసం వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. రుణమాఫీ కోసం ఎదురుచూసిన రైతులు పంట, బంగారు రుణాలను సకాలంలో చెల్లించకపోవడంతో అదనపు వడ్డీ భారం పడింది. మరోపక్క గడువు మీరి పోవడంతో తనఖా బంగారాన్ని బ్యాంకులు వేళం వేస్తున్నా విడిపించుకోలేని నిసహాయ స్థితిలో రైతులు బోరున విలపిస్తున్నారు.
ఇన్సెంటివ్‌ను కోల్పోయారు
సకాలంలో వడ్డీ చెల్లిస్తే రైతులు చెల్లించిన వడ్డీలో 3 శాతం ఇన్సెంటివ్‌గా కేంద్రప్రభుత్వం ఇస్తుంది. దీనిని రైతులు కోల్పోయారు. బ్యాంకుల ద్వారా పంట రుణాలు అందకపోవడంతో పంటబీమా సొమ్మును చెల్లించలేదు. ప్రభుత్వం పూర్తిగా రుణమాఫీ చేయకపోవడం, రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకపోవడంతో డిఫాల్టర్లుగా మారా రు. జాబితాల ప్రకటనలో గందరగోళం, సవరణలకు సవాలక్ష ఆంక్షలు, ప్రభుత్వం ప్రకటించిన సొమ్ము రైతులు ఖాతాల్లో జమకాకపోవడం, సవరణలు పెట్టుకున్న రైతుల జాబితాలో అర్హులను ప్రకటించకపోవడం వంటి విషయాలు రైతులు నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు.
అంతా సాగతీతే..
జిల్లాలో 5,04,611 మంది రైతులు రుణమాఫీకి అర్హులని ప్రభుత్వానికి జిల్లా అధికారులు నివేదికలు పంపించారు. అయితే ప్రభుత్వం తొలివిడత ప్రకటించిన జాబితాలో 2,22,065 మంది రైతులకు చెందిన రూ. 921 కోట్ల రుణాలను రద్దుచేస్తున్నట్లు ప్రకటించింది. వీరికి 20 శాతం నిధులు రూ. 206.22 కోట్లు విడుదల చేసింది. రెండో జాబితాలో 1,03,729 మంది రైతులకు రూ.375.65 కోట్లు మాఫీగా ప్రకటించింది. రూ.50వేలు ఉన్న రుణాలను పూర్తిగా రద్దుచేస్తూ రూ. 13.65 కోట్లు, 20 శాతం నిధులు రూ.167.65 కోట్లు మాఫీ నిధులను విడుదల చేసినట్లు ప్రకటించింది. చాలామంది రైతుల ఖాతాల్లో మాఫీ సొమ్ము జమకాలేదు. మూడోవిడతలో అన్నా న్యాయం జరుగుతుందని ఆశించిన రైతులకు తీరా వెబ్‌సైట్ చూస్తే నిరాశే మిగిలింది.